అదిగో..ఇదిగో… అంటారు.. తీరా ఆ టైం వచ్చేసరికి తూచ్… లేదు పొమ్మంటారు. ఊరించి ఊరించి ఊసూరుమనిపిస్తారు. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ ఏ విషయంలో సర్కార్ అంతలా టార్గెట్ అవుతోంది? ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసి తర్వాత వెనక్కి తగ్గడం వెనకున్న రీజన్స్ ఏంటి? జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజు గడిచిపోయినా… పథకం ప్రారంభంలేదు, అసలా ఊసేలేదు. ఎందుకలా జరిగింది? అంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకానికి డేట్ ప్రకటించిమరీ ఎందుకు సైలెంట్ అయ్యారని అంటే… అబ్బో.. అది చాలా పెద్ద స్టోరీ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పథకాన్ని రెండున ప్రారంభిద్దామని అనుకున్నా….ఒకటో తేదీ రాత్రికల్లా…కుప్పలు తెప్పలుగా వచ్చాయట దరఖాస్తులు. ఈ స్థాయిలో అయితే తేడాలు జరిగిపోతాయ్… మనం నూటికి నూరు శాతం అర్హులకే పథకాన్ని ఇవ్వాలని నిర్ణయించాం… అందుకే స్క్రూటీని పర్ఫెక్ట్‌గా చేయాలని మంత్రులు సూచించినట్టు ఒక ప్రకటన బయటికి వచ్చేసింది. అంటే… మంత్రుల ఆదేశాల మేరకే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు వాయిదా పడ్డట్టు తేల్చి చెప్పేశాయి అధికార వర్గాలు. జూన్ 2 నుండి పథకం లాంచ్ అవుతుందని యువత చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా పడటంతో… అంతా ఉసూరుమన్నారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. రాజీవ్ యువ వికాసానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చి పడుతున్నాయని మొదట్నుంచి తెలిసిందే. దీనిపై ప్రతి 15 రోజులకోసారి రివ్యూ చేస్తూనే ఉన్నారు అధికారులు. కానీ తీరా.. ఆ టైం వచ్చినప్పుడు ఎక్కువ దరఖాస్తుల పేరిట వాయిదా వేయడం ఏంటో అర్ధంకాలేదంటోంది తెలంగాణ యువత. ఇప్పటికే వచ్చిన వాటిని పర్‌ఫెక్ట్‌గా స్క్రూటినీ చేసుకుంటూ వెళితే మొత్తం గాడిన పడుతుందిగానీ.. ఎక్కువ అప్లికేషన్స్ పేరుతో మొత్తం స్కీమ్ ప్రారంభాన్నే వాయిదా వేయడం ఏంటో అర్ధం కావడంలేదంటున్నారు పరిశీలకులు. ఇదొక్కటే కాదు…. ఇప్పటివరకు అమలైన చాలా పథకాల విషయంలో ముందు ఒకటి అనుకుని.. ఆ తర్వాత చర్చించి.. మార్పులు చేసి ఆఖరుకు అమల్లోకి తెచ్చేసరికి పెద్ద రచ్చ అవుతోంది. ప్రతి పథకం అమలులోను ఇలాగే జరుగుతున్నా.. సరిదిద్దుకోవడం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లేదంటే ప్రభుత్వంలోనే… మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయట.
ముందు గ్రాండ్ గా ప్రకటన చేయడం, చివరికి సైలెంట్ గా వాయిదాలు వేసయడం సర్వ సాధారణమైపోయిందని అంటున్నారు. నిధులు సమకూర్చుకోవడం లాంటి అంశాలపై ముందస్తుగానే కసరత్తు చేయడం.. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకొని పథకాన్ని లాంఛ్ చేయడం సహజంగా జరిగే ప్రక్రియ.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం… ముందు అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి చివరికి ఆ రోజు వచ్చేసరికి వాయిదా వేయడంతో… లబ్దిదారులకు మేలు జరిగినదానికన్నా ఎక్కువగా… అంతకుముందు జరిగిన రాద్దాంతం, వాయిదా పర్వమే హైలైట్ అవుతోంది. ఓవైపు వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో వేయాల్సిన రైతు భరోసా నాలుగు ఎకరాల రైతులకు ఇప్పటికీ జమ కాలేదు. అది పూర్తవకముందే…. రాజీవ్ యువ వికాసం అంటూ నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది ప్రభుత్వం. దాని ఉద్దేశం, ఆలోచన.. మంచివే… కానీ ఆర్థిక వనరులను సమకూర్చుకున్నాక అమలు ప్రకటన చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా… ఒకదానిపై ఒకటిగా ప్రకటనలు చేసేసి… చివరకు వాయిదాలతో లబ్దిదారులను ఉసూరుమనిపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆఖరి నిమిషంలో వాయిదాలు వేసుకుంటే ఆ పథకం అమలుతో వచ్చే పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రచారమే ఎక్కువ జరుగుతోంది. చివరికి జనానికి ఇచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందన్న బాధ పెరుగుతోందట కాంగ్రెస్ నేతల్లో. ప్రతిపక్షం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఫోకస్ చేస్తుంటే.. అలర్ట్ అవ్వాల్సిన అధికార పక్షం ఇలా ఆఖరి నిమిషంలో వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల జరిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే చర్చ నడుస్తోంది. గతంలో ప్రజా పాలన దరఖాస్తుల విషయం నుంచి మొదలుకొని రైతు భరోసా నిధుల పెంపు రుణమాఫీ లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వం పెద్దలు రోజుకొక ప్రకటన చేయడంతో గందరగోళం ఎక్కువై ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత కూడా క్లారిటీ లేకపోవడం, ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ పెట్టడం వల్ల చేసిన మేలు కంటే నెగిటివ్ చర్చకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుందనేది ఓపెన్ టాక్.