ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ బెర్త్ దక్కుతుందా? లేదా? ఉన్న ఒక్క ఖాళీని భర్తీ చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? లేక అలాగే వదిలేస్తారా? నాగబాబును మంత్రిని చేస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పాక కూడా ఇంకా మీన మేషాలు ఎందుకు? లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయా? అసలు ఎమ్మెల్సీకి సైరన్ కార్ యోగం ఉందా? లేదా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ని మొదట రాజ్యసభకు పంపాలనుకున్నా… తర్వాత మారిన సమీకరణాలతో రాష్ట్రంలోని పెద్దల సభకు పంపామన్నది కూటమి నేతల మాట. అయితే… అంతకంటే ముందే నాగబాబును ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. కానీ… ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి చాలా రోజులు గడుస్తున్నా…ఆ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. కనీసం అందుకు సంబంధించిన ఫీలర్స్ కూడా బయటికి రావడం లేదు. దీంతో అసలు నాగబాబుకు ఛాన్స్ ఉందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయట అటు జనసేన, ఇటు రాజకీయ వర్గాల్లో. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా? లేక అలాగే వదిలేస్తారా? అన్న చర్చలు మొదలయ్యాయట. కొంత మంది మంత్రుల పనితీరు మీద ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం. ఆయన ఎంత అసహనంగా ఉన్నా…. అది ఇప్పటికిప్పుడు క్యాబినెట్ విస్తరణ వరకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్‌కి కనీసం రెండేళ్లు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట సీఎం. కాబట్టి… ఇప్పట్లో పూర్తి స్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండకపోవచ్చంటున్నారు. అదే సమయంలో కేవలం నాగబాబుని మాత్రం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయట కూటమిలో. ప్రస్తుతం క్యాబినెట్లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ ఒక్కదాన్ని జనసేన కొత్త ఎమ్మెల్సీతో భర్తీ చేయాలా? లేక మొత్తం కలిపి ఒకేసారి పూర్తి పునర్ వ్యవస్థీకరించాలా అన్న విషయంలో క్లారిటీ రానట్టు తెలుస్తోంది. వచ్చే జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఒకవేళ క్యాబినెట్లో మార్పు చేర్పులు ఉండాలంటే ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం.
దీంతోపాటు నాగబాబుకి అవకాశం ఇవ్వటం మీద కూడా ఒక కొత్త చర్చ మొదలైందట. కేబినెట్‌లో ఇప్పటికే జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు ఇస్తే… ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారవుతారన్న పాయింట్ తెర మీదికి వచ్చినట్టు తెలిసింది. మొత్తం జనసేన తరపున పదవులన్నీ కాపులకే ఇచ్చేస్తే… పార్టీకి చెందిన ఇతర సామాజికవర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్న చర్చ సైతం నడుస్తోందట. ఈ పరిస్థితుల్లో… ఎమ్మెల్సీని అసలు కేబినెట్‌లోకి తీసుకుంటారా లేక అలాగే వదిలేస్తారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట. కానీ… నాగబాబుకు మంత్రి పదవి అంటూ గతంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నోట్ ఇచ్చారు కాబట్టి… ఖచ్చితంగా తీసుకుంటారన్నది కొందరు జనసేన నాయకుల మాట. స్వయంగా సీఎం మాట ఇచ్చి తప్పితే బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి… చంద్రబాబు మాటలకు కట్టుబడి ఉంటాల్సి వస్తుందన్నది ఎక్కువ మంది జనసేన లీడర్స్ అభిప్రాయం. దీంతో… నాగబాబుకు ఓవైపు మంత్రి పదవి ఖాయంగానే కనిపిస్తోంది. కానీ… అదే సమయంలో ఎక్కడో ఏదో మూల డౌట్. ఉన్న ఒక్క ఖాళీలో ఆయన్ని సెట్ చేయాలంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. మరి ఆగారంటే… దాని అర్ధం వేరుగా ఉంటుందా అని మాట్లాడుకుంటున్నాయట గ్లాస్ పార్టీ వర్గాలు. జనసేనతో పాటు ఇటు టీడీపీ వర్గాల్లో సైతం ప్రస్తుతం నాగబాబుకు మంత్రి పదవికి సంబంధించిన చర్చ జరుగుతోందట. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారం రోజులులోపే జరిగిపోవాల్సిన పని ఇన్ని రోజులు ఆగిందంటే… ముఖ్యమంత్రి ఇంకా క్లారిటీకి రాలేదా? లేక తనదైన శైలిలో నానబెడుతున్నారా అన్నది క్లారిటీ రావాల్సిం ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.