ఎమ్మెల్సీ కవిత ఇక రాజకీయంగా ఒంటరేనా? ఆమె పొలిటికల్ స్టెప్స్ అన్నీ ఇక సోలోగా పడాల్సిందేనా? గులాబీ వాసన ఇక ఆమె దరిదాపులకు కూడా చేరదా? లేఖ రాజేసిన అగ్గి అంతకంతకూ అంటుకుంటోందా? తాజాగా నిజామాబాద్ టూర్ ఆ విషయాన్నే చెప్పేసిందా? అసలేం జరిగింది నిజామాబాద్‌లో? ఆమె పొలిటికల్ ఒంటరి అని ఎందుకు స్టాంప్ వేసేస్తున్నారు అంతా? మొన్నటి దాకా…. బీఆర్‌ఎస్‌లో ఆమె మాటకు తిరుగులేదు. అక్క నోటి నుంచి మాట రావడమే ఆలస్యం… ఆచరణలో పెట్టేందుకు పోటీపడేవి పార్టీ శ్రేణులు. అధినేత కూతురు కావడంతో… కవిత మాటే శాసనంగా ఇంకా చెప్పాలంటే…ఆడిందే ఆట పాడింది పాటగా నడిచిపోయింది. కానీ… ఒక్క లేఖ. తండ్రికి రాసిన ఒకే ఒక్క లేఖ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ కేరీర్‌ను తల్లకిందులు చేసేసింది. ఇన్నేళ్ళు ఆమె ఏ కార్యక్రమం చేసినా… తెలంగాణ జాగృతితో పాటు బీఆర్‌ఎస్ కేడర్ వెన్నంటి ఉండేది. గల్లీలో నిరసనలతో మొదలుపెడితే ఢిల్లీలో మహాధర్నాల దాకా…. బీఆర్‌ఎస్ లీడర్స్, కేడర్ కవిత వెంటే ఉండేది. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… కవిత సక్సెస్ వెనక గులాబీ జెండా ఉందనేది కాదనలేని సత్యం. అలాంటి జెండానే ఆమె కాదనుకోవడంతో… వరుసబెట్టి కవిత కార్యక్రమాల సత్తా ఏంటో తేలిపోతోందని అంటున్నారు పరిశీలకులు. బీఆర్‌ఎస్‌లోని పరిణామాలను ఉద్దేశిస్తూ… కేసీఆర్‌కు లేఖ రాయడంతోపాటు… ఆ తర్వాత మీడియా చిట్‌చాట్‌లో పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కవితకు గులాబీ బంధం తెగిపోయింది. పార్టీ కేడర్ ఆమె వైపు చూడటం మానేసింది. తెలంగాణ జాగృతి కార్యకలాపాలను ఉధృతం చేసిన కవిత… కొత్త కార్యాలయం ఏర్పాటుతోపాటు…. కేసీఆర్‌కు మద్దతుగా ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ…. ఆ మహాధర్నా చేశారు కవిత. కానీ… ఆ ప్రోగ్రామ్‌లో ఎక్కడా గులాబీ జెండా కనిపించలేదు, పార్టీ స్లోగన్ వినిపించలేదు. అసలు కేసీఆర్‌కు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు కనిపించకపోవడం ఏంటి? పార్టీ నాయకులు కాదు కదా… కనీసం కార్యకర్తలు కూడా కనిపించకపోవడం ఏంటని అప్పుడే మాట్లాడుకున్నారు అంతా.
కవితకు, గులాబీ జెండాకు బంధం తెగిపోయినట్టేనని ఆ మహా ధర్నా తర్వాత ఫిక్సయిపోయారు చాలామంది. అదంతా ఒక ఎత్తయితే… కవిత సొంత జిల్లా, ఎంపీగా ఆమె ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ టూర్‌లో కనిపించిన తాజా దృశ్యాలు ప్రచారాలు, అనుమానాలకు వంద శాతం స్టాంప్ వేసేశాయట. హైదరాబాద్ అంటే… సరే…. పెద్దోళ్ళ ప్రభావం ఉంటుంది. కానీ.. సొంత జిల్లాలో ఏమైంది? అక్కడ సైతం ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్త కూడా కవిత వెంట రాలేదంటే….ఇక పార్టీ ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. రెండు రోజులపాటు నిజామాబాద్ జిల్లాలో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కవిత. గతంలో అది ఏ ప్రోగ్రామ్ అన్నదాంతో సంబంధం లేకుండా ఆమె జిల్లాకు వస్తే చాలు… అటెండెన్స్ కోసం పోటీలు పడేవారు స్థానిక నాయకులు. అలాగే తనకంటూ కొంత వర్గాన్ని మెయిన్‌టెయిన్ చేసేవారు ఆమె. ఇప్పుడు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా ఎమ్మెల్సీ వెనక కనిపించలేదు. గతంలో సొంత జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరే వరకు వెంట ఉండే వాళ్ళంతా ఇప్పుడు దూరమయ్యారు. కేసీఆర్ దేవుడైతే… ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలతో హర్ట్ అయిన వాళ్ళు కొందరైతే… ఆమె మీద అభిమానం ఉన్నా… దగ్గరికి వెళితే ఏమవుతుందోనన్న భయం మరికొందరిదట. ప్రస్తుతానికి ఆమె బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కవిత ప్రోగ్రాంకు వెళ్లకూడదని పార్టీ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వలేదు. అయినాసరే… ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ… ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారట నేతలు. ఆవేశపడి ఇప్పటికిప్పుడు కవిత వెంట నడిస్తే… తర్వాత తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందన్నది అందరి భయంగా తెలుస్తోంది. అటు కవిత సైతం తనవెంట నడవమంటూ ఎవర్నీ వత్తిడి చేయడం లేదట. ఈ పరిణామాలన్నిటినీ చూస్తుంటే… ప్రస్తుతానికి రాజకీయంగా కవిత ఒంటరి అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొన్నటి ధర్నాగాని, తాజా నిజామాబాద్ టూర్‌గాని, ఈ రెండూ ఒకే విషయం చెబుతున్నాయని విశ్లేషిస్తున్నారు.