ఆ టీడీపీ ఎమ్మెల్యే పాలిట కార్యకర్తలే కత్తుల్లా మారిపోయారా? ఆయనకు వ్యతిరేకంగా చర్యలు మీరు తీసుకుంటారా? లేక మేం చేయాల్సింది చేస్తామని ఏకంగా పార్టీ పెద్దలకే వార్నింగ్ ఇస్తున్నారా? వైసీపీకి సహకరిస్తూ… తమను వేధిస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కేడర్‌లో బస్తీ మే సవాల్ అనిపించుకుంటున్న ఆ లీడర్ ఎవరు? పరిస్థితి ఎందుకు అలా మారిపోయింది? కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా…ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారాయన. వరుసగా మూడు విడతల నుంచి ఇక్కడ ఓడిపోతున్న తెలుగుదేశం గత ఎన్నికల్లో కూటమి వేవ్‌లో విజయకేతనం ఎగరేసింది. పదిహేను ఏళ్ళుగా తమ పార్టీ తరపున ఎమ్మెల్యే లేకపోవటంతో అండ కోసం ఎదురుచూసిన తిరువూరు టీడీపీ క్యాడర్ కు ఎమ్మెల్యే కొలికపూడి అదనపు బలంగా మారతారని భావించిందట పార్టీ అధిష్టానం. కానీ… గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారన్నది టీడీపీలో ఓపెన్ టాక్. ఎమ్మెల్యే తీరుతో అటు అధిష్టానం కూడా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకుంటున్నారు.ఇప్పటికే రెండు సార్లు కొలికపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచి హెచ్చరించినా ఆయన తీరు మారకపోగా మరింత ఎక్కువై పార్టీకే డెడ్ లైన్ విధించే స్థాయికి వెళ్ళింది. దీంతో అధిష్టానం కూడా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉందట. తాజాగా మాజీ ఎఎంసీ ఛైర్మన్ రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానానికి డెడ్‌లైన్ పెట్టారు కొలికపూడి. దీంతోపాటు పార్టీ అధిష్టానం… కులానికి ఒక రకంగా చర్యలు తీసుకుంటుందా అంటూ బహిరంగంగా మాట్లాడటం పెద్దల్ని ఇరుకున పెట్టిందట. దీంతో… రమేష్ రెడ్డిపై చర్యల సంగతి పక్కన పెట్టి అసలు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేసింది.
జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం,ఎంపీ కేశినేని చిన్ని, నియోజకవర్గ అబ్జర్వర్ కమిటీగా అధిష్టానం నివేదిక అడగంతో వారు స్థానికంగా ఎమ్మెల్యే తీరుతో క్యాడర్ ఇబ్బందులు, వైసీపీ వారితో కొలికపూడి సన్నిహితంగా ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నవాటికి సంబంధించిన నివేదిక ఇచ్చారట. అటు తిరువూరు నుంచి క్యాడర్ పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదులు చేసింది. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పల్లా హామీ ఇచ్చినా… కార్యకర్తల్లో మాత్రం ఎమ్మెల్యేపై అసంతృప్తి చల్లారలేదట. ఆయన్ని మీరు వదిలిపెట్టినా మేం మాత్రం వదలబోమని సీరియస్ అవుతున్నట్టు సమాచారం. కొలికపూడి…. నియోజకవర్గంలో తమను ఇబ్బంది పెడుతూ…. వైసీపీ వారికి సహకరిస్తున్నారని, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే తిరువూరు టీడీపీకి వేరే ఇన్ఛార్జ్‌ని వేయమని డిమాండ్ చేశారట కార్యకర్తలు. ఎమ్మెల్యే వ్యవహారశైలి మీద సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నారని చెబుతున్నా… ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని అసహనంగా ఉందట తిరువూరు టీడీపీ కేడర్. అధిష్టానం దగ్గర ఎలాగూ ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేశాం కాబట్టి… ఇక స్థానికంగానే చూసుకుందామన్నది కొందరి మాట అట. కొలికపూడి తీరుకు నిరసనగా….నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు పెట్టాలని డిసైడయ్యారట పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు. ఇందులో భాగంగానే స్థానిక పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల నేతలు, క్యాడర్ వచ్చి అసమ్మతిరాగం వినిపించారట. ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమో లేక కొత్త ఇన్చార్జిని ఏర్పాటు చేయడమో జరిగే వరకు
నిరసన గళాన్ని కొనసాగించాలని డిసైడయ్యారట. బాధ్యత తీసుకున్న పెద్దలు స్పందించకుంటే…ఇక డైరెక్ట్ చంద్రబాబు అంటున్నట్టు సమాచారం. అటు ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా గమనిస్తూ మౌనంగా ఉందట కొలికపూడి వర్గం. పార్టీలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మాత్రమే ఇదంతా చేస్తోందని తెలిసినా… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కామ్‌గా ఉంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వార్ వన్ సైడ్ అవుతుందా లేక కొలికపూడి రియాక్ట్ అవుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.