NTV Telugu Site icon

Off The Record: వైఎస్ జగన్ ఆ నేతలకు పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తే ఇప్పుడు అడ్రస్ లేరా?

Otr

Otr

Off The Record: పిలిచి పిల్లనిస్తామంటే పెళ్ళి కూతురు గురించి తేడాగా మాట్లాడినట్టు ఉందట అక్కడి వ్యవహారం. వైసీపీ అధిష్టానం ఏరికోరి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తే…. తీరా ఓడిపోయాక ఉన్నారో లేరో కూడా అడ్రస్‌ లేకుండా పోయారా నేతలు. భరోసా ఇచ్చే లీడర్‌ లేక కేడర్‌ కూడా కన్ఫ్యూజ్‌లో ఉందట. అంత తేడాగా ప్రవర్తిస్తున్న ఆ లీడర్స్‌ ఎవరు? ఎందుకలా జరుగుతోంది?

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ… ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది వైసీపీ. అధిష్టానం నుంచి కిందిస్థాయి కార్యకర్త దాకా రీఛార్జ్‌ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. కానీ… కొందరు నాయకులు మాత్రం ఇంకా ఆ మూడ్‌లోకి రాలేదన్నది పార్టీ ఇంటర్నల్‌ టాక్‌. మరీ ముఖ్యంగా అనుకోకుండా అవకాశం దక్కిఎమ్మెల్యే టికెట్ వచ్చి ఓడిపోయిన వారంతా ఇప్పుడు కష్టకాలంలో అండగా నిలవకుండా మొహం చాటేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి వాళ్ళలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కదిరి ఇన్చార్జ్ మక్బూల్, రాయదుర్గం ఇన్చార్జ్‌ మెట్టు గోవిందరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట. ఎన్నికల టైంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వీళ్ళిద్దర్నీ తీసుకువచ్చి టిక్కెట్స్‌ ఇచ్చింది పార్టీ. కానీ…ఎన్నికల తర్వాత అసలు వీళ్ళు ఎక్కడున్నారన్నారో కూడా తెలియకుండా పోయిందని మాట్లాడుకుంటున్నారు రెండు సెగ్మెంట్స్‌ కార్యకర్తలు. ముందుగా కదిరి నియోజకవర్గ విషయానికొస్తే…. ఇక్కడ నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి పార్టీకి విధేయుడన్న పేరుంది. కానీ.. సొంత నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు అప్పట్లో. దీంతో ఆయన్ని మార్చాలని డిసైడైన అధిష్టానం.. మైనారిటీలకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో… అప్పటిదాకా ఎవరో కూడా తెలియని మక్బూల్‌ను ముందుకు తీసుకువచ్చింది.

ఎన్నికలకు కొద్ది రోజులు ముందు మక్బూల్ రంగంలోకి దిగినా… పార్టీ బలంతో ఇక్కడి ప్రజలు బాగానే ఆదరించారు. కానీ… పార్టీ స్థానిక నాయకులు మాత్రం ఆయన్ని వ్యతిరేకించారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్ ఎలా ఇస్తారంటూ ఇటు సిద్ధారెడ్డి తో పాటు చాలామంది నాయకులు వైసిపి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే… నాటి ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికీ సర్దిచెప్పి ఎన్నికల వరకు తీసుకెళ్లారు. ఎంత చెప్పినా… సిద్ధారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండి.. ఇటీవల పార్టీ మారిపోయారు. ఇక ఇలాంటి టైంలో పార్టీ తరపున నిలబడాల్సిన మక్బూల్‌ ఓటమి తర్వాత ముఖం చాటేయడంతో కదిరి వైసీపీ కేడర్‌ నాయకుడి కోసం ఎదురు చూస్తోందట. పార్టీ ఎంతగానో నమ్మి టికెట్ ఇస్తే ఇప్పుడు ఆయన పత్తా లేకుండా పోవడం ఏంటన్నది కార్యకర్తల క్వశ్చన్‌. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. కొన్ని భూ సంబంధ కేసుల్లో ఇరుక్కోవడం వల్లే ఆయన కదిరికి దూరం అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక రాయదుర్గం విషయాని కొస్తే ఇక్కడ అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీకి వీరవిధేయల టాప్ టెన్‌లో కాపు రామచంద్రా రెడ్డి పేరు ఉంటుంది. జగన్‌ను ఎవరేమన్నా వెంటనే రియాక్ట్‌ అయ్యేవారాయన. అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

స్థానికంగా పెద్ద వ్యతిరేకత లేనప్పటికీ రామచంద్రా రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం వెనక ఏదో మేటర్‌ ఉండి ఉంటుందని అప్పట్లో అనుకున్నారు అంతా. ఇక ఆయన స్థానంలో మెట్టు గోవింద్ రెడ్డిని రంగంలోకి దింపింది అధిష్టానం. అప్పటికే ఏపీఐఐసీ చైర్మన్ కూడా ఉన్న మెట్టును రాయదుర్గం తీసుకువచ్చి…2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మెట్టు విషయంలో కూడా స్థానికంగా సానుకూలత ఉన్నా…. కూటమి వేవ్, కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం లాంటి పరిణామాలతో ఓటమి తప్పలేదన్నది లోకల్‌ అనాలసిస్‌. తనకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న కాపు రామచంద్రారెడ్డిని సైతం పక్కనపెట్టి జగన్‌… మెట్టు గోవింద్ రెడ్డికి టికెట్ ఇస్తే.. ఇప్పుడు కష్ట సమయంలో ఆయన చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు తప్ప నేనున్నానంటూ కేడర్‌కు భరోసా ఇవ్వలేకపోతున్నారన్నది లోకల్‌ టాక్‌. మరి ఈ పరిణామాల్ని పార్టీ అధిష్టానం ఎలా చూస్తుంది? వాళ్ళను సెట్‌ చేస్తుందా? లేక మార్చేసి కొత్త ఇన్ఛార్జ్‌లను ప్రకటిస్తుందా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి ఉమ్మడి అనంత రాజకీయవర్గాలు.