NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మళ్లీ హస్తినకు మారుతుందా? పార్టీ పెద్దల ఢిల్లీ టూర్ వ్యూహం ఏంటి?

Otr Congress

Otr Congress

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం మళ్ళీ హస్తినకు మారుతోందా? పార్టీ పెద్దల ఢిల్లీ టూర్‌ వెనక ఏదో ఉందా? నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ చర్చలు జరిగే ఛాన్స్‌ ఉందా? నేతల రాజధాని టూర్‌ చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటి? అంచనాలు ఎలా ఉన్నాయి?

పదవులు ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయట. అంతా… ఆశల పల్లకిలో ఢిల్లీ వెళ్తున్నారు. గతంలో ఇలాగే ఓసారి ఊపు వచ్చింది. పార్టీ ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే రోజుల తరబడి మకాం వేసి లాబీయింగ్‌ చేసుకున్నారు. కానీ… అప్పట్లో ఓవరాల్‌గా ఆ ప్రోగ్రామ్‌ మొత్తం వాయిదా పడటంతో ఉసూరుమంటూ తిరుగుటపాలో హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కేశారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర పార్టీ పెద్దలు హస్తిన బాట పట్టడంతో ఏం జరుగుతోందని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్ర మంత్రి, సీనియర్‌ లీడర్‌ ఉత్తం కుమార్‌రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారుల సమీక్షా సమావేశం కోసం ఢిల్లీలో ఉన్నారు. మీటింగ్‌ తర్వాత కూడా ఆయన షెడ్యూల్‌ అక్కడే ఉండటంతో ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాజధానికి వెళ్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో ఈ రుణమాఫీని ప్రకటించారు. ఆ క్రమంలోనే…రెండు లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర సర్కార్‌. దాన్ని బేస్‌ చేసుకుని రైతులతో భారీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందట. రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే ఈ సభను ఏర్పాటు చేయాలని, రాహుల్ గాంధీ, ప్రియాంకను ఈ సభకు పిలవాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం, డిప్యూటీ సీఎం ఒకేసారి ఢిల్లీ వెళ్ళి పార్టీ ముఖ్యలను కలుస్తున్నందున మరోసారి నామినేటెడ్ పదవుల అంశం తెర మీదకు వచ్చింది. ఇంకో 30 మంది నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తోందని, అందుకు సంబంధించి కూడా సీనియర్ నేతలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పోస్టుల భర్తీకి అధిష్టానం అప్రూవల్ తేవడానికి ఢిల్లీ వెళుతున్నారని చర్చ కూడా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. గతంలో ఎప్పుడూ ఆషాడ మాసంలో ఏ రాజకీయ నాయకుడు పదవీ బాధ్యతలను తీసుకున్న పరిస్థితి లేదు. కానీ ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు బాధ్యతలు స్వీకరించారు. దీంతో చాలా రోజులుగా పీసీసీ చీఫ్ నియామకంపై జరుగుతున్న చర్చ మళ్లీ తెరమీదకు వచ్చింది. శ్రావణమాసంలో పిసిసి కొత్త చీఫ్ ఫీవర్ వెళ్ళిపోతుందని టాక్. దీనిపై కూడా కాంగ్రెస్ నాయకత్వంతో అగ్ర నాయకులంతా చర్చించేందుకే హస్తినకు వెళ్లారనే మరో వాదన ఉంది. పిసిసి చీఫ్ నియామకంతో పాటు క్యాబినెట్ విస్తరణ అంశం కూడా చాలా రోజుగా చర్చలో ఉంది. దీనిపై కూడా అధిష్టానం ఏదైనా క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైతే అగ్రనాయకత్వం అంతా బిజీగా ఉంటుంది కాబట్టి… ఆలోపే ఆమోద ముద్ర వేయించే పనిలో ఉన్నారన్న టాక్‌ సైతం నడుస్తోంది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల ఢిల్లీ టూర్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయి పార్టీ వర్గాలు.