అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్ పాలిటిక్స్?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే… ఛాన్స్ దొరికితే చాలు అటవీశాఖను టార్గెట్ చేస్తున్నారు. గ్రామ, మండలం లేదా జిల్లాలో ఏ స్థాయి సమావేశమైనా అటవీ అధికారులను తిట్టిపోస్తున్నారట. కారణం మాత్రం పోడు పేరు చెబుతున్నారు. అడవుల్లో ఇసుకంటారు. ఎంక్రోచ్‌మెంట్స్ కాకుండా చూసే అధికారులు వెళ్తే…మందిలోనే తిట్టేస్తున్నారు లేదా వాదిస్తున్నారట. కొందరైతే వార్నింగ్‌లదాకా వెళ్తున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితులుగొడవలు, దాడులకు దారి తీస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వారు ఏది చేసినా దానికి పెట్టే మాత్రం పోడు వ్యవసాయం. ఆ భూములకు పట్టాలు కావాలనేది వారి డిమాండ్. వాస్తవానికి పోడు వ్యవసాయం అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు మాత్రమే హక్కు. ట్రైబల్స్ భూములు సాగు చేసుకుంటే వాళ్లకు చట్ట ప్రకారం ప్రభుత్వమే హక్కులు కల్పిస్తుంది.
2006 అటవీహక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 31కి ముందు సాగులో ఉండాలి. అలాంటి వారు మాత్రమే హక్కుదారులు. అలా లక్షల ఎకరాలకు హక్కులు కల్పించారు. కానీ ప్రస్తుతం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోడు భూముల పేరుతో రాజకీయ నాయకులు అటవీశాఖ అధికారులను మందిలో వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. రూల్ ప్రకారం ఈ జిల్లాల్లోని చాలా ఏరియాల్లో నాన్ ట్రైబల్స్‌కు ఏహక్కులు ఉండవు. వారికి భూమి కాదు కదా… కనీసం ఇంటి నిర్మాణానికి కూడా అనుమతులివ్వరు. ఒక వేళ బీసీ లేదా ఎస్సీలు ఎవరైనా ఉంటే… మూడు నాలుగు తరాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలి. అవేవీ లేని వారికి ఎలాంటి హక్కులు ఉండవు. ఇదంతా తెలిసి కూడా…. నాయకులు అధికారుల మీద చిందులేయడం ఓట్ బ్యాంక్ రాజకీయం కాక మరేంటన్న చర్చ నడుస్తోంది జిల్లాలో. తాజాగా ఓ ఎమ్మెల్యే తాను చెప్పినట్టు చేస్తే సరి… లేదంటే బదిలీ చేయిస్తానంటూ అందరి ముందు ఫారెస్ట్ ఆఫీసర్‌ని హెచ్చరించారట. మరో ఎమ్మెల్యే అయితే… ఎక్కడ మీటింగ్ జరిగినా తన ప్రతాపం అటవీశాఖ అధికారుల మీద చూపెడతారనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరులు హక్కులు కావాలన్నారంటే.. అది చట్ట విరుద్ధం. ఇప్పుడు మాత్రం ఎలాంటి పట్టాలిచ్చే అస్కారం ఉండదు. అటవీ భూములు కబ్జా చేస్తే అధికారులు చర్యలు తీసుకోవడం తప్పుకాదు. ఇదంతా తెలిసి కూడా రాజకీయ నాయకులు కొత్త రాగం అందుకుంటున్నారట. పోడు అనగానే ఆదివాసీలనే అభిప్రాయం అందరిలో వస్తుంది..కానీ అది పోడు కాదు కబ్జా అంటున్నారు అధికారులు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ ఏదైనా అందరి అస్త్రం మాత్రం పోడే. కబ్జా అయిన అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధిత శాఖ అధికారులు వెళితే రాజకీయ నేతలే ముందు అడ్డుపడుతున్నారనేది వాస్తవం. అలా ఎందుకు చేస్తున్నారంటే… అక్కడే ఓట్ల రాజకీయం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల ఓట్ల శాతం పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే…. గ్రామాల్లో అటవీభూముల కబ్జాలు పెరిగాయనేది అటవీశాఖ అధికారుల లెక్కలు. కొన్ని చోట్ల మొక్కలు నాటేందుకు అటవీ సిబ్బంది వెళ్తే… తాము పోడు చేసుకుంటున్నామని అడ్డుకోవడం, నిరసనలకు దిగడం, లేదా నేతల దగ్గరికెళ్ళడం పరిపాటిగా మారింది.
ఇదే అటవీ అధికారులకు ఇబ్బందిగా మారుతోందట. గ్రామస్థాయి లీడర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం దీనికి మినహాయింపు కాదంటున్నారు. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పోడు అంటే అంతా తమకే జై అంటారనేది నేతల లెక్కగా తెలుస్తోంది. టైగర్ జోన్ పరిధిలో ఓవర్గం వద్ద ఒకే మండలంలోసుమారు 20 వేల ఎకరాల అటవీభూములు కబ్జాలో ఉన్నాయట. మరో రేంజ్ పరిధిలో 5 వేల ఎకరాలు నాన్ ట్రైబల్స్ చేతుల్లోకి వెళ్ళాయి.ఇలా ఉమ్మడి జిల్లాలో గిరిజనేతరుల చేతుల్లో సుమారు 70 నుంచి 80వేల ఎకరాల వరకు ఉన్నట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బడాబాబులు అడవులను కబ్జాలు చేసిన చరిత్ర ఉమ్మడి జిల్లాలో ఎలాగూ ఉంది. అయితే వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని చూస్తే మాత్రం రాజకీయ స్వార్థంతో కొంతమంది నాయకులే అడ్డుతగుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అటవీ భూముల పాటిట శాపం అయ్యాయన్నది విస్తృతాభిప్రాయం.
