Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్ పోగొట్టుకున్న చోట నుంచే వేట మొదలు పెట్టాలి అనుకుంటుందా..!!

Otr Telangana

Otr Telangana

Off The Record: గులాబీ పార్టీ ట్రాక్‌ అండ్‌ ట్రెండ్‌ మార్చాలనుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్లాన్‌కు పదును పెడుతోందా? అటు సీనియర్స్‌ని సంతృప్తి పరచడం, ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడమన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టాలనుకుంటోందా? జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్‌ఎస్‌ వేస్తున్న కొత్త స్కెచ్‌ ఏంటి? దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?

పొలిటికల్‌గా దెబ్బ మీద దెబ్బ తగిలి ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్‌ మెల్లిగా తేరుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచే యాక్షన్‌ ప్లాన్‌ మొదలుపెడుతోందట. పదేళ్ళ పాలనా కాలంలో జనానికి దూరం అయ్యామా అన్న ఆత్మ పరిశీలన పార్టీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకుంటూ…ఇక దూకుడుగా జనంలోకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే… ముందు ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలి కాబట్టి అటువైపు దృష్టి సారిస్తోందట పార్టీ అధిష్టానం. ప్రజా సమస్యలపై ఆల్రెడీ అవగాహన ఉన్నా… ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏంచేయాలో నిర్దేశించుకుని… పోరాట మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఏదో… గుడ్డెద్దు చేలో పడ్డట్టు పార్టీ మొత్తం ఒకే సమస్య వెంటపడం కాకుండా… ఏ వింగ్‌కు ఆ వింగ్‌ విడివిడిగా పోరాటాలు చేస్తూ… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ప్రణాళికలు రూపొందుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకోసం నిజ నిర్ధారణ కమిటీలు, అధ్యయన కమిటీల పేరుతో కొత్త విభాగాలను సైతం ఏర్పాటు చేయబోతోందట గులాబీ పార్టీ. పార్టీకి చెందిన సీనియర్స్‌, ఆయా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లను ఈ కమిటీల్లో నియమించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మొదటగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని నియమించినట్టు ప్రకటించింది బీఆర్ఎస్. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది పార్టీ. ఇలాగే మరికొన్ని కమిటీలు కూడా వేయబోతున్నట్టు తెలిసింది. బీసీల సమస్యలపై అధ్యయనం కోసం బీసీ నేతలతో ఒక కమిటీ, రైతు సమస్యల విషయంలో పార్టీ రైతు నాయకులతో కమిటీ, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు… ఇలా రకరకాల సమస్యలపై ఆయా విభాగాల సీనియర్స్‌, అవగాహన ఉన్నవారితో కమిటీలు ఫామ్‌ చేయాలని భావిస్తోందట గులాబీ అధిష్టానం.ఇలాంటి కమిటీల ద్వారా…పార్టీలో అనుభవం ఉన్న నేతల సేవల్ని సరిగ్గా ఉపయోగించుకోవన్నది ప్లానింగ్‌లో ఉన్నారట. సీనియర్స్‌కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి ఒక బాధ్యత ఇచ్చినట్టు ఉంటుంది, అదే సమయంలో పార్టీ అవసరాలు తీరతాయన్న భావనలో ఉన్నట్టు తెలిసింది. తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంతో ఉన్న సీనియర్స్‌ను తిరిగి యాక్టివేట్‌ చేసినట్టు కూడా ఉంటుందని భావిస్తోందట బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం. ఇక ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం పోరాట పంథాను ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నది ఫైనల్‌ ప్లాన్‌. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇక ఆలస్యం చేయకుండా కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకోవాలని, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. కొత్త గులాబీలు ఏ మేరకు గుభాళిస్తాయో చూడాలి మరి.

 

 

Exit mobile version