NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కొత్త అస్త్రం?

Brs

Brs

Off The Record: బీఆర్‌ఎస్‌ బీజేపీతో రాజకీయ సంబంధాలు పెట్టుకోబోతోందా? కాషాయంలో గులాబీ కలిసిపోతుందా? లేక మిత్రపక్షంగా కొనసాగనుందా? తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్ కొత్త అస్త్రాన్ని ఎంచుకుందా? దీనిపై తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న హాట్‌ హాట్‌ చర్చలో నిజమెంత?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌… 14ఏళ్ల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుంది. 10 ఏళ్లపాటు అధికారంలో ఉంది. ఆ క్రమంలో పేరు మారి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. తీరా ఇప్పుడు అధికారం కోల్పోయాక తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కోంటోంది. 10మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక… పార్టీ చరిత్రలో తొలిసారి ఢిల్లీ సభలో స్థానం లేక డీలా పడిపోయింది బీఆర్‌ఎస్‌. క్యాడర్‌ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న క్రమంలో మరో పిడుగు పడింది ఆ పార్టీ మీద. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కాబోతోందన్న ప్రచారం గులాబీ పెద్దల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ప్రచారం ఉంది. అందులో నిజా నిజాల సంగతి ఎలా ఉన్నా… ఇన్నాళ్ళు బద్ద వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీలో విలీనం కావడమోస లేదా… మిత్రపక్షంగా కొనసాగడమో ఖాయమన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇటీవల కేటీఆర్‌, హరీష్‌రావు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత ఈ ప్రచారం తీవ్ర రూపం దాల్చింది.

ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ…. గులాబీ పార్టీకి చిరకాల మిత్రుడు, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ కామెంట్స్‌ చేశారు. ఆయన మాటల తర్వాత విలీనం అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయట. విలీనం విషయంలో బీఆర్‌ఎస్‌ వివరణ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్‌ చేశారు అసద్‌. ఆ డిమాండ్‌ బీఆర్‌ఎస్‌కు మరింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్‌ ఇప్పట్లో వస్తుందో? రాదో తెలియుదు. ఈ పరిస్థితుల్లో ఓవైపు విలీనం ప్రచారం, మరోవైపు అసద్‌ లాంటి నేత బీఆర్‌ఎస్ ప్రాతివ్రత్యాన్ని ప్రశ్నించడం లాంటి వ్యవహారాలతో ఆ పార్టీ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందులు ఇలా ఉండగానే… ఆదిలాబాద్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి బీఆర్‌ఎస్‌ తోడుగా నిలవడంతో రెండు పార్టీల బంధంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వలసలు, ఇంకోవైపు బిజెపితో కలిసిపోతున్నారనే ప్రచారంతో గులాబీ పెద్దలకు ఊపిరి సలపడంలేదన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. దీనికి అట్నుంచి రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.