Off The Record: తెలంగాణ గ్రూప్ వన్ ఎపిసోడ్‌లో వెనుకబడ్డామని బీఆర్‌ఎస్ ఫీలవుతోందా? ఆ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేయగలిగిందని, తాము ఇంకొంచెం యాక్టివ్ అవగలిగితే బాగుండేదన్న చర్చ పార్టీలో జరుగుతోందా? అందుకే కరెంట్ ఛార్జీల విషయంలో అలర్ట్‌గా ఉండాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందా? క్రెడిట్ వార్‌లో గులాబీ దళం ఎక్కడుంది? ఆ పార్టీ అధిష్టానం మనసులో ఏముంది?
తెలంగాణలో ఇప్పుడు కొత్త రకం పొలిటికల్ గేమ్ మొదలైనట్టు చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలపై పోరాడి క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతిపక్షాలు పోటీలు పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకూడదన్న టార్గెట్‌తో బీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీగా పావులు కదుపుతున్నాయట. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఛాన్స్ దొరికినప్పుడల్లా… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్‌ఎస్. అయితే… తాజాగా గ్రూప్‌వన్ అభ్యర్థుల ఆందోళన ఎపిసోడ్‌లో తాము వెనకబడ్డామన్న ఫీలింగ్ ఉందట ఆ పార్టీ పెద్దల్లో. జీవో 29ని రద్దు చేయాలంటూ గట్టిగా కొట్లాడారు అభ్యర్థులు. నెల రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కానీ… మొదట్లో ఈ వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు గులాబీ పార్టీ. ఇంకా చెప్పాలంటే అసలు పట్టింపులేని ధోరణితో ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. అప్పట్నుంచి కామ్‌గా ఉండి… గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించే చివరి వారం ముందు హడావుడి చేశారన్న అభిప్రాయం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే…. అసలు అభ్యర్థులు ఎక్కువగా ఉండే అశోక్‌నగర్ వైపునకే ఆ పార్టీ నేతలు వెళ్లలేదట. కానీ… ఇక్కడే బీజేపీ సక్సెస్ అయిందన్న చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతోందట. గ్రూప్ 1 అంశంపై గతంలో హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ భవన్ లో నేతలు ప్రెస్ మీట్ లు కూడా పెట్టారు. అలాగే… తెలంగాణ భవన్ లో అభ్యర్థులను కేటీఆర్ కలిశారు. కానీ… వాటన్నిటికి మించిన ప్రచారం, స్పందన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ర్యాలీకే వచ్చిందని గులాబీ నేతలు భావిస్తున్నారట. మనం వెనుకబడ్డామని మాట్లాడుకుంటున్న టైంలో విద్యుత్ చార్జీల అంశం తెర మీదకు వచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు కోసం డిస్కంల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది బీఆర్‌ఎస్. బీజేపీకంటే ముందుగా… మనమే ఈ అంశాన్ని ఎత్తుకోవాలని డిసైడ్ అయిందట బీఆర్ఎస్. అసలు కరెంట్ చార్జీల పెంపు పై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు, అంత లోతైన చర్చ కూడా జరగలేదు. కానీ… బీఆర్‌ఎస్ మాత్రం ఈసారి కూడా నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఎక్కడ పుంజుకుని తాము వెనకబడిపోతామోనన్న ఆందోళనతో తొందరపడి ఒక కోయిల అన్నట్టుగా అడుగులేస్తోందంటున్నారు. అక్కడ ఇంకా ఏం జరక్క ముందే సోమవారంనాడు హుటాహుటిన ఈఆర్‌సీని కలిసి చార్జీల పెంపు ప్రతిపాదనకు అంగీకరించవద్దని కోరింది కేటీఆర్ నేతృత్వంలోని బృందం. దీన్ని చూసి అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే… ఇదెక్కడి విడ్డూరం అంటూ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అదే సమయంలో… విద్యుత్ చార్జీల అంశాన్ని బీజేపీ ఎత్తుకునే లోపే మనం ముందడుగు వేయడం మంచిదేనన్న మరో చర్చ కూడా జరుగుతోందట. విద్యుత్ చార్జీల వ్యవహారం ప్రతి ఇంటికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి… ముందుగా ఎత్తుకోవడం పార్టీకి లాభమని ఆలోచిస్తున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. అయితే… అదే సమయంలో ఇంకో భయం మాత్రం గులాబీ దళాన్ని వెంటాడుతోందని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఎగ్రెసివ్‌గా వెళ్తే ఎదురుదాడి కూడా జరిగే ప్రమాదం ఉందన్నది ఆ భయం. పదేళ్ళ బీఆర్‌ఎస్ హయాంలో కరెంట్ ఛార్జీలను పెంచలేదు. కానీ…. డిస్కంలకు ఇవ్వాల్సిన 18వేల500 కోట్ల రూపాయల్ని పెండింగ్‌లో ఉంచడం వల్లే.. ఇప్పుడు చార్జీల్నిపెంచాల్సి వస్తోందని ప్రభుత్వం నుంచి బాల్ తమ కోర్ట్‌లోకి వస్తే… ఏం చేయాలన్న చర్చ కూడా జరుగుతోందట బీఆర్‌ఎస్ పెద్దల్లో. ఇలా మొత్తంగా…ఇంకా ఓ క్లారిటీ రాని విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ వార్ మాత్రం మొదలైందంటున్నారు.