NTV Telugu Site icon

Off The Record : రెడ్లు టార్గెట్‌గా కాంగ్రెస్‌ బీసీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారా?

Bc Leader Otr

Bc Leader Otr

మొన్న ఒకరు, నిన్న ఒకరు…. రేపు ఇంకొకరా? వరుసబెట్టి కాంగ్రెస్‌ పార్టీలో బీసీ నాయకులు ఎందుకు నోరు జారుతున్నారు? ప్రత్యేకించి ఒక కులాన్ని టార్గెట్‌ చేసుకుని తిట్ల పురాణం ఎందుకు అందుకుంటున్నారు? ఏమీ లేని చోట ఏదో ఒకటి రగిలించే ప్రయత్నం జరుగుతోందా? అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయా? పార్టీకి తలపోట్లు తెప్పిస్తున్న ఆ నేతలు ఎవరు? వాళ్ళ టార్గెట్‌ క్యాస్ట్‌ ఏది? తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు వరుసబెట్టి నోరు జారుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ… మాట్లాడుతున్న మాటలు ఇటు ఓవరాల్‌గా పార్టీకి, అటు పార్టీలో ఉన్న అదే సామాజికవర్గం నాయకులకు తలనొప్పిగా మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఓ ఎమ్మెల్సీ… రెడ్ల మీద కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. నోటీసుల దాకా వెళ్ళింది ఆ వ్యవహారం. నోటీసులైతే వెళ్లాయి కానీ…తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ మాటల గాయం మానక ముందే…ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్వరం సవరించుకున్నారు. ప్రభుత్వం చేసిన కుల గణనపై సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి… దీనివల్ల జరిగే మేలు ఏంటో చెప్పండి, అవగాహన పెంచండని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. కానీ…. ఆయన చెప్పింది ఒకటి ఐతే…పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేసింది ఇంకోటి అన్నట్టు మారింది వ్యవహారం. బీసీ కుల గణన అంశాన్ని వదిలేసి రెడ్ల మీద పడ్డారు అంజన్‌కుమార్‌. సొంత పార్టీలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతల మీద దూషణల పర్వం మొదలుపెట్టారట. దీంతో అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల మర్మం ఏంటి..? ఎందుకు ఆయన ప్రత్యేకంగా రెడ్డి నాయకులను టార్గెట్ చేశారన్న చర్చ మొదలైంది కాంగ్రెస్‌ పార్టీలో.

ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి,,, ఇలా కొన్ని పేర్లను కూడా కోట్‌ చేశారట ఆయన. ఇప్పుడిదే హాట్‌ సబ్జెక్ట్‌ అవుతోంది. ఆయన అసలు ఎందుకంత ఘాటుగా మాట్లాడారు, ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చిందని ఆరాతీస్తే… అందులో కూడా రాజకీయ అవసరాల సబ్జెక్ట్ ఉండవచ్చని అంటున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వంలో తన అవకాశాల్ని రెడ్లు అడ్డుకుంటున్నారన్న అక్కసు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ రాకుండా రెడ్లు అడ్డుకున్నట్టు ఫీలవుతున్నారట ఆయన. అయితే… అంజన్‌ వ్యాఖ్యల తర్వాత….. అసలు సిసలైన రచ్చ మొదలైంది. ఆ మాటల మీద అటు రెడ్డి నాయకులు ఫైరైపోతూ… అంజన్‌ వ్యాఖ్యల్ని తూర్పారబడుతున్నట్టు సమాచారం. ఆయనకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ముషీరాబాద్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వడమేకాకుండా….గ్రేటర్ హైదరాబాద్ అంతా అప్పగిస్తే… ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూశారుగా అంటూ పాయింట్‌ లాగుతున్నారట కాంగ్రెస్‌… రెడ్డి నాయకులు. అంత జరిగాక కూడా… అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్‌కి పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చిందని, ఇక అంతకు మించి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అంజన్‌ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపబోతున్నట్టు సమాచారం. అసలు బీసీ కులగణనపై అవగాహన కల్పించే పని వదిలేసి… ఇలా తిట్ల దండకం ఎత్తుకోవడంపై పార్టీలో సీరియస్‌గానే చర్చ జరుగుతోందట. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలు ఎన్ని..? పార్టీకి అంజన్ కుటుంబం చేస్తోంది ఏంటి..? అంటూ వ్యతిరేక వర్గం చర్చకు పెడుతోందట. ఇలా…. ఈ ఎపిసోడ్‌ మొత్తం గమనిస్తున్న వాళ్ళు మాత్రం… ఏమైనా కాంగ్రెస్‌ కల్చరే కల్చరబ్బా…. సమస్య లేని చోట సృష్టించుకుని లొల్లి పెట్టుకోవంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అంటున్నారట.