ఆయన వైసీపీ మాజీ మంత్రి…అధికారంలో ఉన్నపుడు టీడీపీ, జనసేనలో ప్రధాన నేతలపై హద్దులు దాటి విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ మాజీ మంత్రి అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడలి పోతున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బెంబేలెత్తి పోతున్నారు. లెట్స్ వాచ్.
జోగి రమేష్…ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన నేత. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్, లోకేస్‌పై హద్దులు దాటి మాట్లాడారు. చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించటమే ఆయనకు మంత్రి పదవి రావటానికి కారణమని కూటమి నేతలు చెబుతారు. జోగి వ్యవహారశైలి కారణంగా కూటమి ప్రభుత్వానికి ఆయన హిట్ లిస్టులో చేరిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేశ్ స్పీడు కూడా…చాలా వరకు తగ్గిందనేది పొలిటికల్ సర్కిల్స్ మాట. స్పీడు తగ్గినా జోగి అంటే కూటమి కేడర్ లైట్ తీసుకుందనుకున్న సమయంలో…నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్ షాక్ ఇచ్చింది. దీంతో జోగి జరదూరం అనే ట్యాగ్‌ను టీడీపీ లీడర్స్ ఎంచుకుంటున్నారట.
కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నూజివీడులో స్థానికులు ఒక కమిటీగా ఏర్పడి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రారంభానికి స్థానిక నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా పిలవటంతో జోగి ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు మాట్లాడి…ఇంటిపై దాడికి ప్రయత్నించిన జోగితో కలిసి వేదిక పంచుకున్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ళను సోషల్ మీడియాలో ట్రోల్ చేసేశారు. జోగితో కలిసి కార్యక్రమంలో పాల్గొనటంపై లోకేష్ కూడా సీరియస్ అవటంతో మంత్రి పార్థసారథి సారీ చెప్పారు. గౌతు శిరీష, కొనకళ్ళ నారాయణ కూడా వివరణ ఇచ్చారు. జోగి ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందని అంచనా చేయకపోవటం వల్ల ఇబ్బందులు పడ్డామని టీడీపీ నేతలు ఆ తర్వాత తెలుసుకున్నారట. ఇప్పుడు ఇదే పరిస్థితి మరోసారి పెనమలూరు టీడీపీ నేతలకు ఎదురు కావటంతో…మరోసారి పొలిటికల్ చర్చగా మారిందట.
Also Read: Off The Record: ఆయన కండువా మార్చేశారా?.. ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారా!
తాజాగా పెనమలూరులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు కార్యక్రమం తలపెట్టారట స్థానికులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఆహ్వానించారు. ఇదే కార్యక్రమానికి జోగి రమేశ్‌ను ఆహ్వానించారు. ఈ సమాచారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గౌతు శిరీషకి తెలియడంతో… జోగి రాకను వ్యతిరేకించారట. నూజివీడులో జోగి హాజరు కావటంతో తలెత్తిన పరిణామాలతో…పెనమలూరు ప్రోగ్రాంకి జోగి రమేశ్ వస్తే తాము రామని కూడా తెగేసి చెప్పారట. దీంతోపాటు కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్నామనే విధంగా సంకేతాలు ఇవ్వడంతో…జోగి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదట. చివరి వరకు జోగి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రావాలని అనుకున్నా…స్థానికంగా ఉన్న పరిస్థితులు దృష్ట్యా జోగి రమేష్ కూడా వెళ్లకుండా ఆగిపోయారట. నూజివీడులో మాదిరి ఇక్కడకు కూడా జోగి వస్తే…అధిష్టానం దగ్గర ఇబ్బంది పడతామనే ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు శతవిధాలా జోగి రాకను వ్యతిరేకించారట. చివరికి జోగి లేకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేసేసారట. దీంతో జోగి ఎఫెక్ట్ నుంచి బయటపడ్డామని అనుకుంటున్నారట. మొత్తానికి టీడీపీ నేతలను అధికారంలో లేకపోయినా జోగి ఫోబియా వెంటాడు తొందనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.