Off The Record: కొంచెం రచ్చ… ఎక్కువ చర్చ. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తీరిది. రకరకాల వ్యాఖ్యలు, వివాదాల సంగతి ఎలా ఉన్నా… మొత్తంగా ఆ ఐకాన్ వందేళ్ల వేడుకలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగానే జరుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఈ వేడుకలకు మరింత వన్నె తెచ్చింది. యుగపురుషుడి స్మారకంగా ఆయన బొమ్మతో 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణెం విడుదలైంది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా వెళ్లారు. కొడుకులు, కుమార్తెలు, అల్లుళ్లు.. మనవళ్లు ఇలా అంతా హాజరయ్యారు. కానీ… ఆయన పేరు పెట్టుకున్న, ఆ రూపాన్ని పుణికిపుచ్చుకున్నానని, తాతే నా ప్రాణం అని చెప్పుకునే మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్ళలేదు. నందమూరి కుటుంబం నుంచి చాలా మంది మంది హీరోలుగా వచ్చినా.. పెద్ద ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని మాత్రం బాలకృష్ణ తర్వాత అందుకున్నది జూనియర్ ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి వ్యక్తి ఇంత అతి ముఖ్యమైన కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదన్నది ఇప్పుడు అటు అభిమానుల్ని, ఇటు రాజకీయ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు జూనియర్ దూరంగా ఉంటున్నారా..? చంద్రబాబు హాజరవుతున్న కార్యక్రమానికి వెళ్ళడం ఇష్టం లేదా? లేక చెబుతున్నట్టు నిజంగానే.. షూటింగ్‌లో బిజీ వల్ల వెళ్ళలేకపోయారా? అనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో తారక్‌కు ఆహ్వానం ఉందా..? లేదా..? అనే అంశం కూడా తెర మీదికి వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ఎవరెవర్ని ఆహ్వానించాలనే బాధ్యతను పురంధేశ్వరికి అప్పజెప్పింది కేంద్రం.ఆమె అందరికీ ఆహ్వానాలు పంపారు. అలాంటప్పుడు జూనియర్‌కు ఆహ్వానం అందకపోవడమన్న ప్రసక్తే ఉండదంటున్నారు. ఎన్టీఆర్ ఇవాళ కాకున్నా.. రేపైనా రాజకీయంగా తమకు ఉపయోగపడతారేమోననే భావన బీజేపీ పెద్దల్లో ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి ఆయన్ని పిలవకుండా ఉండే సాహసం పురంధేశ్వరి చేయరని అంటున్నారు. అలాగే ఫ్యామిలీ పరంగా జూనియర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని ఆంక్షలు విధించే పొజిషన్‌లో చంద్రబాబు లేరు. ఈ పరిస్థితుల్లో ఆయనే కావాలనే రాలేదా అన్న అభిప్రాయం బలపడుతోందంటున్నారు నందమూరి కుటుంబ అభిమానులు. ముఖ్యంగా చంద్రబాబుతో కలిసి డయాస్ పంచుకోవడం కానీ.. ఓ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జూనియర్ ఎన్టీయార్‌కు ఇష్టం లేదనే వాదన బలంగా ఉంది.
గతంలో విజయవాడలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన శతజయంతి వేడుకలకు జూనియర్‌కు ఆహ్వానం లేదు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పిలిచినా జూనియర్ వెళ్ళలేదు. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. రాజకీయంగా చంద్రబాబుకు.. టీడీపీకి ఉపయోగపడే ఏ కార్యక్రమానికైనా వెళ్లకూడదని జూనియర్ ఎన్టీఆర్ డిసైడైనట్టు సమాచారం. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సందర్బంలో చంద్రబాబుతో డయాస్ షేర్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. ఇక హరికృష్ణ చనిపోయిన తర్వాత పార్టీకి.. జూనియర్‌కు, మామా అల్లుళ్ళకు మధ్య గ్యాప్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే నాణెం విడుదల కార్యక్రమానికి హాజరై ఉండకపోవచ్చునంటున్నారు. రాజకీయంగా ఇబ్బంది ఉండదు అనుకున్న కార్యక్రమాలకు మాత్రం చంద్రబాబు వస్తున్నా ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్ళికి ఇద్దరూ వెళ్ళారు. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది.
ఇప్పుడు జూనియర్ పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. రాజకీయాల గురించి పెద్దగా ఆలోచన చేయడం లేదు. ముందు సినీ కెరీర్.. ఆ తర్వాత పొలిటికల్ కెరీర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాను పాల్గొనే కార్యక్రమాల వల్ల లేనిపోని రచ్చ జరిగి.. కొత్త చర్చకు తావివ్వడం వల్ల తన సినిమాల పైనా.. కాస్తో కూస్తో ఇంపాక్ట్ పడడం గ్యారెంటీగా కన్పిస్తోంది. ఈ క్రమంలో తన సినీ కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందని భావిస్తే.. అలాంటి కార్యక్రమాల నుంచి తప్పుకుంటున్నారట. ఇప్పుడు కాకున్నా.. కొన్నేళ్ల తర్వాతైనా.. టీడీపీ పగ్గాలు తనకే అందుతాయనే ధీమా జూనియరులో ఉందని.. ఆయన్ను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. అందుకే…ఫస్ట్ సినీ కెరీర్.. నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ అనే సిద్దాంతంతో మైండ్ ఫిక్స్ చేసుకున్నారని.. దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఎంత కెరీర్ విషయంలో జాగ్రత్త తీసుకున్నా… కేంద్ర ప్రభుత్వం తాతకు అంత గుర్తింపు ఇస్తున్న కార్యక్రమానికి హాజరవకపోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించేవారు ఉన్నారు.