Off The Record: ఏపీలో ఎన్నికల సీజన్ సమీపిస్తున్న వేళ మరో సంచలనాత్మక పొలిటికల్ మూవీ వెండి తెరమీదకు రాబోతోందట. అయితే… ఇది అలాంటిలాంటి సినిమా కాదు. ఇప్పుడు తీసింది కాదు. ఆ సినిమా గురించి తెలుసుకోవాలంటే… దాదాపు 36 ఏళ్ళ వెనక్కు వెళ్ళాలి. అప్పుడెప్పుడో తీసిన సినిమా ఇప్పుడెలా సంచలనం అవుతుందనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. 1987లో దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా సొంతగా నిర్మించిన సినిమా చైతన్య రథం. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీనే పాలకపక్షంగా ఉంది. టీడీపీ పరిపాలనలో తనకు ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధానాంశంగా, నాటి ప్రభుత్వమే టార్గెట్ గా సినిమా తీశారు వంగవీటి రంగా. కానీ.. రంగా హత్య తర్వాత వివిధ కారణాలతో ఆ సినిమా రీల్స్‌ను కాల్చేశారు. ఆ మూవీని రీ రిలీజ్ చేయాలన్న డిమాండ్ ఉన్నా… ఈ 36 ఏళ్ళలో అది సాధ్యం కాలేదు. అదే సినిమాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న రంగా కుమారుడు రాధా రీ రిలీజ్ చేయబోతున్నారట. అదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలను అమితంగా ఆకర్షిస్తున్న పాయింట్.
1985 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. బెజవాడ తూర్పు నుంచి వంగవీటి రంగా కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన పర్యటనలపై పోలీసు ఆంక్షలు పెట్టిందని, సోదాల పేరిట వేధించిందని, అక్రమ కేసులు పెట్టిందనేది చైతన్య రథం సినిమాలో ప్రధాన కథ. బెజవాడలో రిక్షా పుల్లర్ లాకప్ డెత్, ఓ మహిళ శిరోముండనం వ్యవహారం, పోలీసులు తనను ఇబ్బంది పెట్టిన విషయాలన్నీ సినిమాలో ఉన్నాయట. 1987లో సినిమా రిలీజవటం, 88లో రంగా హత్య జరగడం, 89లో టీడీపీ సర్కారు ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కటం వరుస పరిణామాలు.
టీడీపీ పాలనకు వ్యతరేకంగా నాడు రంగా తీసిన ఈ సినిమాకు ఇప్పుడు అదే పార్టీలో ఉన్న ఆయన కొడుకు రాధా తిరిగి రీళ్ళు కడిగించడం నాయకత్వానికి మింగుడు పడటంలేదట. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ వ్యూహం పేరిట టీడీపీ టార్గెట్ గా సినిమా తీస్తుండగా … ఇప్పుడు రాధా 36 ఏళ్ళ క్రితం తీసిన సినిమాను రీ రిలీజ్ చేయటానికి పూనుకోవటంతో టీడీపీ నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నారట. చైతన్యరథం సినిమాను ఇప్పటికే యూఎస్‌లో రంగా పుట్టిన రోజైన ఈనెల 4న విడుదల చేశారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తామని, యూ ట్యూబ్ లోకి కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు రాధా. అసలే ఎన్నికల సీజన్, కాపుల ఓట్లే కేంద్రంగా రాజకీయం జరుగుతున్న సమయం, టీడీపీ -జనసేన దగ్గరవుతున్న సందర్భంలో రంగా తీసిన టీడీపీ వ్యతిరేక సినిమా జనాల్లోకి వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆ పార్టీ అధినాయకత్వాన్ని కంగారు పెడుతోందట. అయితే రాధా మాత్రం వీటన్నింటినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నట్టు తెలిసింది. టీడీపీ ఎదుర్కొంటున్న సంకట స్థితిని చూసి వైసీపీ నేతలు మాత్రం లోలోపల విజిల్స్ వేసుకుంటున్నారట. రిలీజ్ అయ్యాక రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.