Off The Record: తెలంగాణలో ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టీఎన్జీవోలో తలెత్తిన వివాదాలు చల్లారడటం లేదు. ఇన్ని రోజులుగా అధ్యక్షుడి ఎన్నికపై సందిగ్ధత ఏర్పడింది. తాజాగా టీఎన్జీవో ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండడంతో…ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు తర్జనభర్జన పడ్డారు. ఈ విషయాన్ని టీఎన్జీవో నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘంపై కోర్టులో కేసు వేసిన టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాయికంటి ప్రతాప్‌ను…పిలిపించి మాట్లాడిందట. రాజీ చేసి ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించారు. ప్రతాప్ వేసిన కేసును వెనక్కి తీసుకున్నందుకు ఆయనకు టిఎన్జీఓలో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పదవి ఇస్తామని హామీ ఇచ్చిందట. ప్రతాప్ కోర్టు కేసును వెనక్కి తీసుకోవడంతో…ప్రస్తుతం టిఎన్జీఓ అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు…మారం జగదీశ్వర్‌ను కొద్ది రోజుల క్రితం టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కారదర్శి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి…ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పట్టించుకోవడం లేదని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. కోర్టు కేసును విరమించుకుంటే…తనకు పదవి అప్పగిస్తామని 15 రోజుల క్రితం హామీ ఇచ్చారంటూ… పొలిటటిషయన్లపై ప్రతాప్ ఒత్తిడి తెస్తున్నారట. కోర్టు ఎదుట తనకు పదవి ఇస్తామని లిఖిత పూర్వకంగా అంగీకరించడంతోనే…తాను కోర్టు కేసును వెనక్కి తీసుకున్నానని చెప్పుకొస్తున్నారు ప్రతాప్.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి 8 మంది పోటీ పడుతుంటే…అందులో ముగ్గురు నలుగురు సీనియర్ల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షులే…రాష్ట్ర ప్రధాన కారద్యర్శి పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి ఎంపికయ్యే అవకాశం లేకపోలేదని టిఎన్జీఓ నాయకులు చెబుతున్నారు. మూడు నెలలు దాటినా టిఎన్జీఓ కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడంతో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాల్సిన నేతలు…పదవులు కోసం కొట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మామిళ్ల రాజేందర్ టిఎన్జీవో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరడంతో సంఘంలో కలహాలు మొదలయ్యాయట. ప్రస్తుతం టిఎన్జీవోకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్ పెద్ద దిక్కు అయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఎన్జీవో, టీజీవోలు మద్దతుగా నిలిచారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ…నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో…ఆయనతో సత్సంబంధాలు ఉన్న ఉద్యోగ సంఘం నేతల పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే…ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని చెబుతున్నారట. అందుకే కోదండరామ్, అద్దంకి దయాకర్ సూచించిన వారికి టిఎన్జీవో ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల ప్రమేయం ఉద్యోగ సంఘాల్లో మితిమీరిపోతే…అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.