Site icon NTV Telugu

Off The Record: ఈసారి తెలంగాణ కేబినెట్‌లో కూడికలు, తీసివేతలు పక్కాగా ఉంటాయా..?

Tg Cabinet

Tg Cabinet

Off The Record: చేసే పని ఏదైనా సరే… చెక్స్ అండ్ బ్యాలెన్సెస్‌ అవసరం. ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా అలాంటి ఈక్వేషన్స్ ఉండాల్సిందే. ఉంటాయి కూడా. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ లెక్కల గురించిన చర్చే మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళకు దగ్గర పడుతున్న క్రమంలో…. సర్కార్‌ పెద్దలు కూడికలు…తీసివేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో ఇంకో మూడు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంతో పాటు… ఇప్పుడున్న వాళ్ళ పని తీరు ఆధారంగా మార్పులు… చేర్పులు కూడా ఉండబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత.. ఆ ఫలితాలు, మంత్రుల పనితీరే … కొలమానంగా నిర్ణయించాలని డిసైడైనట్టు సమాచారం. ప్రస్తుతం అనుకుంటున్నది అనుకున్నట్టు జరిగితే…. వచ్చే డిసెంబర్‌లోనే… మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చన్నది ఇంటర్నల్‌ టాక్‌.

Read Also: Off The Record: ఫార్ములా ఈ-రేస్‌ కేసు వెనక రాజకీయ వ్యూహం ఉందా? బీఆర్ఎస్‌ ఆలోచన ఏంటి..?

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది కాబట్టి… ఇంకా ఖాళీలను మిగల్చకుండా.. పూర్తి స్థాయిలో కేబినెట్‌ కూర్పు ఉండవచ్చంటున్నారు. దీంతో కొత్తగా మంత్రులు అయ్యేది ఎవరన్న చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది కాంగ్రెస్‌ వర్గాల్లో. సామాజిక సమీకరణల లెక్కలు కూడా మరోసారి తెర మీదికి వస్తున్నాయి. ప్రస్తుతం మైనార్టీలకు ప్రాతినిధ్యం లేనందున ఆ కోటా నుంచి ఒకరికి ఖచ్చింతంగా ఛాన్స్‌ ఉంటుంది. ఇక మిగిలిన ఇద్దరు ఎవరన్న విషయంలో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. బీసీలకు చాన్స్ ఉంటుందా..? అనే లెక్క ఒకటైతే… రెడ్డి సామాజికవర్గం నుండి ఇద్దరు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుపడుతూనే ఉన్నారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన విషయమై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజగోపాల్‌ తొందరపడ్డారన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం అభిప్రాయం. పార్టీ మీద వత్తిడి పెంచేందుకు మునుగోడు ఎమ్మెల్యే సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ పరిస్థితుల్లో ఆయనకు బెర్ట్‌ దక్కుతుందా లేదా అన్నది కొందరి డౌట్‌.

Read Also: TG News: రైతులకు గుడ్‌న్యూస్.. సాదాబైనామాలపై నోటిఫికేషన్‌ విడుదల

ఇక ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని పక్కన పెడతారనే టాక్ బలంగా నడుస్తోంది. ఇప్పటి వరకు పని తీరును బేరీజు వేయలేదు. కానీ… త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జిల్లాలకు ఇన్ఛార్జ్‌లుగా మంత్రులను నియమించింది ప్రభుత్వం. ఎన్నికల ఫలితాల్లో వాళ్ళ పని తీరు సరిగా లేదంటే.. పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే… కొంత మంది మంత్రులు శాఖ పనులు పక్కన పెట్టి.. సొంత వ్యవహారాల మీదే దృష్టి పెడుతున్నారని, రేపు కూడికలు తీసివేతల్లో ఎన్నికల ఫలితాలతో పాటు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ ఇంటర్నల్‌ టాక్‌. రెండేళ్లు కావస్తోంది కాబట్టి.. అందరి పనితీరును సమీక్షించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. మరోవైపు కొంత మంది మంత్రుల కంటే… వాళ్ళ దగ్గర పని చేసే సిబ్బందే పవర్ ఫుల్ అనే ప్రచారం సైతం ఉంది. ఇలాంటి అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించే పనిలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు మంత్రుల మీద ఎమ్మెల్యేల నుంచి కూడా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి…. ఇక ఎక్కాల పుస్తకం ఓపెన్‌ చేసే టైమ్ ఆసన్నం అయ్యిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత మంత్రులు కొందరి శాఖల మార్పులు కూడా ఉంటాయంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం… కూడికలు… తీసివేతలు తప్పవన్నదే ఇండికేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొందరు మంత్రుల పనితీరుకు గీటు రాయిగా మారబోతున్నాయి. ఈ లెక్కన మార్పు చేర్పులు గట్టిగానే ఉండవచ్చన్నది రాజకీయ వర్గాల అంచనా.

Exit mobile version