Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరుగుతాయని జోరుగా చర్చ జరుగుతోంది. అందుకు బలం చేకూర్చే విధంగా…ఢిల్లీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. పార్టీ పెద్దలు వరుస సమావేశాలు పెట్టుకుంటున్నారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిన బీజేపీ పెద్ద ఆశలు పెట్టుకుంది. అలాంటి తెలంగాణలో కర్ణాటక ఎన్నికల తర్వాత…సీన్ రివర్స్ అయిందనే ప్రచారం పార్టీలో నేతలే చేశారు. దానికి తోడు అంతర్గత విభేదాలు వెరసి…ఎక్కడో ఉందనుకున్న బీజేపీ..ఎక్కడికో దిగజారిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పాత, కొత్త నేతలను సంతృప్త పరిచేందుకు…ఫార్మూలాను కేంద్ర పార్టీ సిద్ధం చేస్తోందట. బండిని పదవి నుంచి తప్పిస్తే వచ్చే నష్టాన్ని నివారించడానికి ఆయన్ను కేంద్రం కేబినెట్‌లోకి తీసుకుంటారట.
రాష్ట్ర బీజేపీలో అంతర్గత గొడవలు పీక్ స్టేజ్‌కు వెళ్లాయ్. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత…అసమ్మతి సెగలు ఎన్నడూ లేని విధంగా బయటపడుతున్నాయ్. పార్టీలోకి కొత్తగా చేరిన నేతలు…రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నేతలు…సమయం దొరికినపుడల్లా రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. బండి సంజయ్ వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు. ఈ వ్యవహారం పాత నేతలకు మింగుడు పడటం లేదు. కొత్త నేతల కామెంట్లు…పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన వారిపై పాతకాపులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇలా చేస్తే పార్టీకి మొదటికే మోసం వస్తుందని రంగంలోకి దిగింది హైకమాండ్.
మొత్తం ఎపిసోడ్‌కు చెక్ పెట్టడానికి… పార్టీ ఫుల్ స్పీడ్‌లో వెళ్లేలా నేతలను సిద్ధం చేస్తోందట.
రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై రకరకాల ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణకు…అధ్యక్ష పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వస్తున్నాయ్. సామాజిక సమీకరణల లెక్కలతో పాటు…ప్రజల్లో ఇమేజ్…ఆర్థికంగా బలంగా ఉన్న వారికే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడతారన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఈ కసరత్తు నడుస్తోందట. ఒకవేళ అది వర్కౌట్ కాదనుకుంటే…ఏం చేయాలన్న దాని మీద ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోందట. అధ్యక్ష మార్పు లేక పోతే డికే అరుణను…ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తారని తెలుస్తోంది. అమిత్ షా…ఈ నెల 15 న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ లోపే వీటన్నంటిపై క్లారిటీ వస్తుందని ఢిల్లీ పార్టీ వర్గాలు అంటున్నాయి. మోడీ విదేశీ పర్యటనకు ముందే…కేంద్ర మంత్రి వర్గం మార్పుల స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా జరగాల్సి ఉంటే ఆ లోపే జరుగుతుందని చెబుతున్నాయి.