NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతుందా..? పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. పార్టీ టార్గెట్‌లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మీటింగ్‌ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్‌కు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదేమీ ఆషామాషీగా జరిగి ఉండదని, బీజేపీలో ఇలాంటి మీటింగ్స్‌ జరగడానికి కొన్ని ప్రత్యేకమైన లెక్కలు ఉంటాయని, ఆ కోణంలోనే తెలంగాణ ప్రతినిధులతో భేటీ అయి ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీఆర్‌ఎస్‌. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. కానీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి 8ఎంపీ సీట్లు గెల్చుకుంది. ఇక ఆ ఊపుతో.. ఇప్పటికైనా తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం కావాలని చూస్తోందట బీజేపీ. నేతల మధ్య సమన్వయం లేక పోవడం వల్లే రాష్ట్రంలో వెనకబడుతున్నామని, అదే పార్టీకి పెద్ద మైనస్ అని గుర్తించారట.

Read Also: Realme C75: రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?

ఈ విషయం మోడీ దృష్టికి కూడా వెళ్ళిందని, ఆ క్రమంలోనే పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న రాజాసింగ్ కూడా మోడీతో మీటింగ్‌కు హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే… అంతా విభేదాలు వీడి.. ఇక నుంచి కలిసి పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్‌ దిశగా పార్టీని సిద్ధం చేయమని చెప్పినట్టయిందని అంటున్నారు. మీటింగ్‌లో అందరి యోగ క్షేమాలు అడిగిన మోడీ… కలసి మెలసి పని చేయండని చెప్పారట. కష్టపడి పని చేయండి…. ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని గట్టిగా చెప్పడంతో ఇక రాష్ట్ర పార్టీలో కదలిక వస్తుందని అనుకుంటున్నారట నాయకులు. తెలంగాణ అభివృద్దికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని చెప్పినట్టు తెలిసింది. ఈ మీటింగ్‌ ద్వారా ఇక నుంచి తెలంగాణపై తమ ఫోకస్‌ ఉంటుందని బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ సంకేతం పంపడానికే ప్రత్యేకించి ఇప్పుడు మీటింగ్‌ పెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద మోడీ మీటింగ్‌తో ఇప్పటికైనా తెలంగాణ బీజేపీలో ఐక్యత వస్తుందా? నేతలు సమన్వయంతో దూకుడుగా వెళ్తారా అన్నది చూడాలి.