Site icon NTV Telugu

Off The Record: ఖుషీ ఖుషీగా టీడీపీ ఎంపీకి థాంక్స్‌ చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Tdp Ycp

Tdp Ycp

Off The Record: ఏపీ రాజకీయాల్లో వైసీపీ – టీడీపీల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా తేలిగ్గానే మేటర్‌ చెప్పేస్తాడు. ప్రతి విషయంలో రెండు పార్టీలు పై చేయి సాధించటం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి. ఒక రకంగా ప్రతి జిల్లాలోనూ…రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎంపీ అధికార పక్షం ఎమ్మెల్యేల్ని పొగడటమంటే… సాధారణ విషయం కాదు. కానీ… విజయవాడ లోక్‌సభ సీటు పరిధిలో అదే జరుగుతోంది. అందుకే అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు ఫుల్‌ఖుష్‌ అవుతూ ఎంపీకి ధ్యాంక్స్‌ చెబుతున్నారట.

బెజవాడ పార్లమెంట్ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో ఒకచోట మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే గెలవగా మిగతా ఆరుగురూ అధికార పార్టీ శాసనసభ్యులే. ఎంపీగా మాత్రం టీడీపీ తరపున కేశినేని నాని రెండో సారి గెలిచారు. తర్వాత కేశినేనికి పార్టీ అధిష్టానంతో వచ్చిన గ్యాప్ కారణంగా ఆయనకు, సొంత పార్టీ నేతలకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ నేతలు నిత్యం పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను సపోర్టు చేస్తూ సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇస్తున్నారు ఎంపీ. నందిగామలో ఎమ్మెల్యే మొండి తోక జగన్ మోహన్, ఆయన సోదరుడు మొండి తోక అరుణ్ అవినీతి చేస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోరాడుతున్నారు. కానీ..అక్కడకు వెళ్లిన కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేని పొగడటంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాడని కితాబు ఇచ్చేశారు. దీంతో నందిగామ టీడీపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారట. ఎంత లేదనుకున్నా…ఈ వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. అదే టైంలో వైసీపీ నేతలు మాత్రం ఖుషీగా ఉన్నారట. మీ పార్టీ ఎంపీనే మమ్మల్ని మెచ్చుకుంటుంటే… మీరు మాత్రం అనవసరంగా మాట్లాడతారు ఎందుకని టీడీపీ నాయకులకు రివర్స్‌ క్వశ్చన్స్‌ వస్తున్నాయట.

నందిగామలో మాత్రమే కాదు, మైలవరం, జగ్గయ్యపేట కూడా కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలకు సర్టిఫికెట్స్‌ ఇస్తున్నారు. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు, నానికి పడదు. ఇక్కడ ఉమాపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నాని. ఇక జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తనతో బాగా సమన్వయం చేసుకుంటున్నారని బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు కేశినేని. దీంతో ఆయా నియోజక వర్గాల్లో టీడీపీ క్యాడర్ ఇరకాటంలో పడుతోందట. అటు వైసీపీ నేతలు మాత్రం ఎంపీ మాటల్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారట. టీడీపీ ఎంపీనే మేం మంచివాళ్ళమని చెబుతున్నాడంటే.. ఎలా పనిచేస్తున్నామో చూసుకోమని అంటున్నారట. కాగల కార్యం గంధర్వులే తీర్చడమంటే ఇదేనని జోష్‌లో ఉన్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.

వైసీపీ ఎమ్మెల్యేల్ని తెగపొగిడేస్తున్న టీడీపీ ఎంపీ..! ఆ మూడు నియోజకవర్గాల్లో ఇరకాటంలో టీడీపీ..? | Ntv

Exit mobile version