Off The Record: ఆ నాయకుడు కనిపించడం లేదు. గుంటూరు రాజకీయ వర్గాల్లో తరచూ వినిపించే మాట ఇది. ఎందుకంటే.. 2014 నుంచి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గతంలో అమావాస్యకి పౌర్ణానికి కూడా కాదు.. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి నియోజకవర్గానికి గెస్ట్‌లా వచ్చి పోయేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నేళ్ళ పాటు అసలు గుంటూరు ముఖం చూడ్డమే మానేశారు. ఆ తర్వాత ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరిగారు. ఆ క్రమంలోనే 2019లో రెండోసారి గెలిచారాయన. అయితే.. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గడిచిన నాలుగున్నరేళ్ళలో జయదేవ్ గుంటూరు జిల్లాలో ఉన్న రోజుల సంఖ్యను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. హైదరాబాద్, ఢిల్లీ, విదేశాల్లో తిరగడం, వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం తప్ప.. అసలు తాను గుంటూరు ఎంపీనన్న సంగతి మర్చిపోయారట.
అటు ఎంపీ కనిపించడం లేదంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్స్‌లో పదే పదే ప్రశ్నిస్తుండటంతో.. జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారట టిడిపి నాయకులు. ఎన్నికలకు ముందు అందరు నాయకుల్లాగే.. గల్లా జయదేవ్ కూడా ఓ రేంజ్ లో హామీలు ఇచ్చేశారు. నియోజకవర్గంలో ఆర్ యు బీల నిర్మాణంతో పాటు అరండల్ పేట బ్రిడ్జిని ఇట్టే పూర్తి చేసేస్తానని, దత్తత తీసుకున్న గ్రామాల్లో విచ్చలవిడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తానని అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లో చూస్తే దత్తత గ్రామాలు కాదు కదా, అసలు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గంలో ఎక్కడా అడుగుపెట్టడం లేదంటున్నారు స్థానికులు. మీ జిల్లా అల్లుడ్ని అని చెప్పి ఓట్లు వేయించుకున్న జయదేవ్, తన మామ సొంతూరు బుర్రిపాలెంలో అదే మామ, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే.. ఆ కార్యక్రమానికి సైతం డుమ్మా కొట్టారు. ఇక గుంటూరు కేంద్రంగా టీడీపీ నిర్వహిస్తున్న ఏ కార్యక్రమానికి హాజరవడం లేదు. అదే సమయంలో గల్లా.. ఏదో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించే భజన బ్యాచ్ కూడా తయారైందట గుంటూరులో. మరి ఇచ్చిన హామీలు, ప్రజాప్రతినిధిగా నెరవేర్చాల్సిన బాధ్యతల సంగతేంటే మాత్రం సమాధానం ఉండటం లేదంటున్నారు. సొంత వ్యాపారాలకు ఇబ్బందులు వచ్చాయని, ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడి రాజకీయాలు మానేస్తే, ఓట్లు వేసి గెలిపించిన మాకు ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు.
ఏళ్ళ తరబడి నియోజకవర్గం ముఖం చూడకుండా గుంటూరును మర్చి పోతే ఎంపీ మిస్ అయ్యాడని కేసులు పెడతామని హెచ్చరించేదాకా వచ్చింది పరిస్థితి. నిన్న మొన్నటి దాకా జయదేవ్ వచ్చేవారం వస్తారనో, మరో నెలలో వస్తారనో సమాధానాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన అనుచరులకే ఇప్పుడు అసలు ఆయన రాజకీయాల్లో, ఉన్నారో లేదో అర్థం కావడం లేదట. సొంత పార్టీ కార్యక్రమాలకు సైతం ముఖం చాటేస్తున్న తమ నాయకుడి తీరుతో ముఖ్య అనుచరుల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోందట. అసలాయన్ని ఫాలో అవ్వాలా లేక మరో నాయకుణ్ణి చూసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ కూడా కొందరు నేతల్లో ఉందంటున్నారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి కొత్త నాయకుల్ని వెతికే పనిలో పడ్డారట. మరి ఓట్లేసి గెలిపించిన గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు, ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేసిన స్థానిక టీడీపీ నాయకులకు గల్లా జయదేవ్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.