Off The Record: ఏపీలో కూటమి రాజకీయం జోరందుకుంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతున్నాయి. దీంతో ఈ పొత్తు.. కూటమి పార్టీలను మరింత ఎత్తుకు చేర్చుతుందా..? లేక.. చిత్తు అవుతారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందట. జనసేన, బీజేపీలకు ఇచ్చిన సీట్లల్లో ఎన్ని గెలుస్తారు? టఫ్ ఫైట్ ఉండేవి ఏవి? పూర్తిగా ఓడిపోయే అవకాశం ఉన్న సెగ్మెంట్లేవీ అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి టీడీపీ వర్గాలు. మొత్తంగా 31 అసెంబ్లీ స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయిస్తే.. అందులో పది చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. ఆ పదింటిలో మహా అయితే… ఒకట్రొండు స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నది టీడీపీ వర్గాల అంచనాగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీకి కేటాయించిన వాటిలో మెజార్టీ సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయినట్టే లెక్కగడుతున్నారట టీడీపీ నేతలు. ఇక జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఎన్నిటిని గెల్చుకుంటుందో చూడాలని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఆ 21 సీట్లలో 10 నుంచి 15 గెలిస్తే చాలా మంచి అఛీవ్‌మెంట్ అన్నది టీడీపీ వర్గాల భావనగా తెలిసింది. మరి ఆ స్థాయిలో గ్లాస్ పార్టీ గెలుస్తుందా..? లేదా..? అనేది చూడాల్సి ఉంటుందని అంటున్నారు టీడీపీ నేతలు. కాపులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్న క్రమంలో.. దాన్ని తట్టుకునేలా ప్రతి వ్యూహాలు రచించుకోవాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు సైకిల్ నేతలు. ప్రస్తుతం జరుగుతున్న సీట్ల సర్దుబాటు ప్రభావం జనసేన మీదే కాకుండా.. టీడీపీ అభ్యర్థుల మీద కూడా ఉంటుందన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీంతో హై అలెర్ట్ కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తాము పోటీ చేసే 144 స్థానాల్లో కనీసం 100 నుంచి 110 సీట్లలో గెలిచేలా పని చేస్తే తప్ప.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కష్టమనే చర్చ జరుగుతోందట టీడీపీలో. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు ప్రభావం ఎలా ఉన్నా.. భాగస్వామ్య పార్టీలకు చెందిన కేడర్‌ను, ఆ పార్టీ సానుభూతిపరులను, దగ్గర చేసుకోవడంపై ఫోకస్ పెడుతున్నారట తెలుగుదేశం పెద్దలు. సీట్లు దక్కని మిత్రపక్షాలకు చెందిన ఆశావహులను ఏదో రకంగా మచ్చిక చేసుకోవాలని నియోజకవర్గ నేతలకు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో అనవసరమైన బేషజాలకు పోకుండా అందర్నీ కలుపుకుని వెళ్లాలని పదే పదే స్పష్టం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఏమాత్రం తేడా జరిగినా…. నిర్లక్ష్యంగా ఉన్నా.. అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకోవడం కష్టమనే చర్చ జరుగుతోందట టీడీపీలో. ఈ క్రమంలో ఫీల్డులో అసంతృప్తితో ఉన్న వైసీపీ కేడరును కూడా అక్కున చేర్చుకునే దిశగా ప్రణాళికబద్దంగా వెళ్లకుంటే గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోందట. ఈసారి పార్టీకి, అభ్యర్థులకు చావో రేవో లాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తెరెగి పనిచేయాలని, గెలిచేస్తామనే ధీమాతో ఎన్నికలకు వెళ్తే అదే అతి పెద్ద తప్పిదమని కూడా నాయకుల్ని హెచ్చరిస్తున్నాయట ఎన్టీఆర్ భవన్ వర్గాలు. ఇప్పటికే కొందరు లీడర్లు.. తాము గెలిచిపోయామనే ధీమాతో అతిగా వ్యవహరిస్తున్నారని, ఇది అసలుకే మోసం తెస్తుందన్న వార్నింగ్స్ కూడా అంతర్గతంగా వెళ్తున్నట్టు తెలిసింది. ఇలాంటి నేతలు ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టి హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఫీల్డులో అభ్యర్థుల పని తీరు ఏ విధంగా ఉందనే అంశంపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అభ్యర్థులు తేడాగా వ్యవహరిస్తే.. వారికి వెంటనే అలెర్ట్ వెళ్తున్నట్టు సమాచారం. ఆ స్థాయిలో టీడీపీ వార్నింగ్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.