NTV Telugu Site icon

Off The Record: టీడీపీ హిట్ లిస్ట్‌లో ఉన్నది వాళ్లేనా..!? అరెస్టులు తప్పవా..?

Tdp Hit List

Tdp Hit List

Off The Record: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్‌లపై మాటల దాడి చేస్తే… పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఎక్కువ మాట్లాడే వారు. అధికారంలో ఉన్న ఐదేళ్ళపాటు అటు టీడీపీ వ్యవహారాలు మొదలు చంద్రబాబు కుటుంబ వ్యవహారాలపై నేరుగా విమర్శలు చేయటంతో… ఈ నేతలందరూ టీడీపీ హిట్‌లిస్ట్‌లో చేరారనేది పార్టీ వర్గాల మాట. అధికారంలోకి రాక ముందు ఈ నేతలను ఓడించడాన్ని మొదటి టార్గెట్‌గా పెట్టుకుని సాధించామని అంటున్నారట టీడీపీ నాయకులు. దీంతో ఇప్పుడిక నెక్స్ట్‌ టార్గెట్‌ రీచ్ అయ్యే పనిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా హద్దులు మీరి మాట్లాడమే కాకుండా…. అక్రమాలకుపాల్పడిన వారిని చట్టపరంగా జైలుకు పంపుతామని గతంలోనే పలు సందర్భాల్లో ప్రకటించారు టీడీపీ లీడర్స్‌. అయితే…. కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా… అప్పుడు చెప్పినవేం జరగలేదని తెలుగు తమ్ముళ్ళు కాస్త అసహనంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కింది స్థాయి అభిప్రాయాలు ఎలా ఉన్నా….టీడీపీ అధిష్టానం మాత్రం ఎలా పడితే ఎలా అరెస్ట్‌లు చేస్తే… కక్షసాధింపుస కిందికి వస్తాయని, అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలన్న అభిప్రాయంతో ఉందట. ఈ క్రమంలోనే…. తాజాగా వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపటం కలకలం రేపింది. దీంతో ఇన్నాళ్ళు నారాజ్‌గా ఉన్న తమ్ముళ్ళు మళ్లీ యాక్టివ్‌ అయి… ఫస్ట్‌ వికెట్‌ పడింది…. ఇక నెక్స్ట్‌ ఎవరని మాట్లాడుకుంటున్నారట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని మీద ఇప్పటికే కేసులు బుక్‌ అయి ఉన్నాయి. అందరికీ న్యాయస్థానాల్లో తాత్కాలిక ఊరట మాత్రమే దక్కింది. ముందస్తు బెయిల్స్‌ మీద ఉన్నవాళ్ళలో కూడా వంశీ అరెస్టుతో కలవరం మొదలైందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వంశీకి కూడా ఒక కేసులో తాత్కాలిక ఊరట దక్కినా… కొత్త కేసులో సడెన్ ఎంట్రీతో పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపించారు.

అందుకే… తమ విషయంలో ఏం జరుగుతుందోనని మిగతా నాయకులు ఆందోళనగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రులపై కొత్తగా కేసులు నమోదైతే వాటి నుంచి రిలీఫ్ కోసం న్యాయస్థానాలకు వెళ్తున్నారు. తెలిసిన కేసులైతే ఓకేగానీ…. తెలియకుండా ఏమేం కేసులు ఉన్నాయో, వాటికి సంబంధించి పోలీసులు ఎప్పుడు వచ్చి అరెస్టు చేస్తారో అర్ధం కావడంలేదని అత్యంత సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. వంశీ తర్వాత మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ… టీడీపీ లీడర్స్‌ చేస్తున్న వ్యాఖ్యలు కొందరు వైసీపీ నాయకుల భయాన్ని ఇంకా పెంచుతున్నాయని అంటున్నారు. త్వరలోనే గుడివాడ ప్రజల ఎదురుచూపులు ఫలిస్తాయంటూ కామెంట్‌ చేశారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.నియోజకవర్గంలో జరిగిన దుర్మార్గాలు, అవినీతిపై ఫిర్యాదు చేశానని, త్వరలో చర్యలు మొదలవుతాయని ఆయన అనడంతో…. తదుపరి టార్గెట్‌ గుడివాడలో ఉండబోతోందా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. వంశీ అరెస్టు జరిగిందని, త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయంటూ… ఎక్స్‌లో మెసేజ్‌ పోస్ట్‌ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వంశీ అరెస్టు, టీడీపీ నేతల మాటలతో వైసీపీలో నెక్ట్ ఎవరు అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. ప్రతిపక్ష నేతలు కూడా టెన్షన్ పడుతున్నా… బయటకు మాత్రం అది కనపకుండా ట్రై చేస్తున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో…. ఎటువంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.