NTV Telugu Site icon

Off The Record: బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీకి క్లారిటీ వచ్చేసిందా.?

Tdp Bjp

Tdp Bjp

Off The Record: ఏపీలో ఏయే పార్టీలు కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్తాయి? 2014లాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కడతాయా? లేక 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా..? అదీ ఇదీ కాకుండా..కొత్త కాంబినేషన్‌ వర్కౌట్‌ అవుతుందా అంటే…కొత్త కాంబినేషన్‌ దిశగానే అడుగులు పడుతున్నట్టు చెబుతున్నాయి జరుగుతున్న పరిణామాలు. పొత్తుల విషయంలో మెల్లిగా మబ్బులు వీడుతున్నందున స్పష్టమైన దృశ్యం కనిపిస్తోందంటున్నారు కొందరు టీడీపీ సీనియర్‌ లీడర్స్‌. బీజేపీని పక్కనపెట్టేసి… టీడీపీ-జనసేన కలిసిలకు వెళ్లడం దాదాపు ఖాయమన్నది అంతర్గతంగా వాళ్ళు చెబుతున్న మాట. టీడీపీతో పొత్తు దిశగా కాషాయ పార్టీని ఒప్పించడానికి పవన్‌కళ్యాణ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. దాన్ని బట్టి బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టే బీజేపీ నేతలు గతంలో మాదిరిగా కాకుండా.. పొత్తుల విషయాన్ని పార్టీ హైకమాండే చూసుకుంటుందని తేల్చేశారు. అయితే.. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… కమలనాథులు తమతో పొత్తుకు ఇష్టపడటంలేదని అర్ధమవుతోందని.. అలాంటప్పుడు వన్‌లైడ్‌ లవ్‌ ఎందుకన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది.

ఇన్నాళ్ళు జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి రూ. 10 వేల కోట్లకు పైగా నిధులను వచ్చేలా కేంద్రం రెవెన్యూ డెఫిషిట్‌ ఇవ్వడంతో… తమకో క్లారిటీ వచ్చిందని అంటున్నారు టీడీపీలోని కొందరు. ఇప్పటికీ బీజేపీ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోందని, అలాంటప్పుడు మనం వగరు పోగొట్టుకోవడం ఎందుకని పార్టీ నాయకత్వం అనుకుంటున్నట్టు తెలిసింది. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో కూడా సక్రమంగా నిధులివ్వడానికి నానా తిప్పలు పెట్టారని, అలాంటిది ఇప్పుడు ఏ సంబంధం లేకుండా జగన్‌ సర్కార్‌కు ఎందుకు అంతలా ఆర్ధిక వెసులుబాట్లు కల్పిస్తున్నారని చర్చించుకుంటున్నారట టీడీపీ నేతలు. రెవెన్యూ డెఫిసిట్ రూపంలో ఏకంగా 10 వేల కోట్లు ఇవ్వడమంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి.. తాను అమలు చేయాలనుకున్న పథకాలకు ఇబ్బంది లేకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరోటి కాదని, ఇదంతా చూస్తుంటే వైసీపీపై బీజేపీకి ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోందని, అలాంటప్పుడు పొత్తు పేరుతో మనం వెంపర్లాడటం ఎందుకని టీడీపీలోని ఓ వర్గం అనుకుంటోందట. దాంతో పాటు అవినాష్‌ రెడ్డి విషయంలో జరుగుతున్న వ్యవహారాలను చూశాక ఆ రెండు పార్టీలు ఒకటేనన్న భావన బలపడుతోందని, ఇక మనం అడగడం ఎందుకని అనుకుంటున్నారట. అందుకే బీజేపీ మనతో పొత్తుకు రాదని డిసైడై అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలన్నది టీడీపీ ఇంటర్నల్‌ టాక్‌గా చెబుతున్నారు.

క్రమంగా క్లారిటీ వస్తున్నా… టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇప్పటికీ ఆచితూచి వ్యవహరించాలనే అనుకుంటోందట. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరక్కుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కన్పిస్తోంది. అందుకే…పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పార్టీ ఎంపీలను ఆదేశించింది టీడీపీ హైకమాండ్. చివరి నిమిషం వరకు బీజేపీ విషయంలో జాగ్రత్తగానే ఉండాలనుకుంటోంది టీడీపీ నాయకత్వం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఆ పార్టీ పొత్తుకు సిద్ధంగా లేకుంటే.. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే చేసుకోవాలన్న కొందరు నేతల సూచనలను టీడీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందట. బీజేపీతో పొత్తుల గురించి బహిరంగంగా మాట్లాడకున్నా.. లోలోపల మాత్రం అన్నింటికీ సిద్దమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీజేపీని వదిలేసినా… జనసేన చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ప్రస్తుతానికి ఆ పార్టీతో పొత్తు కచ్చితంగా ఉంటుందన్న క్లారిటీ ఉన్నా.. భవిష్యత్తులో పరిస్థితులు మారి జరగరానిది జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది టీడీపీ హైకమాండ్ . కీడెంచి మేలెంచాలన్న సూత్రం ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుటోందట తెలుగుదేశం అధినాయకత్వం.