NTV Telugu Site icon

Off The Record: రాజ్యసభలో బలం పెంచుకునే ప్లాన్‌లో బీజేపీ.. అందుకోసమే..

Otr R Krishnaiah

Otr R Krishnaiah

Off The Record: రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా…రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా… ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?

బీజేపీకి ఇప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేదు. బిల్లుల్ని పాస్‌ చేయించుకోవడం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే… ఓ వైపు ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే… మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందర్ని తమ కూటమిలోకి లాగేసుకునే ప్లాన్‌కు పదును పెడుతోంది. ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీల్లో మెజార్టీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్ళనే తమ తరపున పెద్దల సభకు పంపే వ్యవహారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎక్కువ మంది పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా బీసీ సంఘాల నేత, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య విషయంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కృష్ణయ్య సన్నిహితులు దీన్ని ఖండిస్తున్నా… ప్రచారం మాత్రం ఆగడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు టచ్‌లో ఉందని, కృష్ణయ్య పుట్టిన రోజున పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఫోన్‌చేసి విషెస్‌ చెప్పడంతో పాటు ఇతర విషయాలు కూడా మాట్లాడారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో.

ఒక వేళ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరాలంటే వైసీపీ ఎంపీగా రాజీనామా చేయాలి. అలా కాదంటే… వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఒకే జట్టుగా బీజేపీలోకి వెళ్ళి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించమని ఛైర్మన్‌ను కోరవచ్చు. అప్పుడైతే వాళ్ళకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. కానీ… ఇక్కడే అసలు తిరకాసు ఉంది. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కృష్ణయ్య ఒక్కరే తెలంగాణకు చెందిన నేత. మిగతా 99 శాతం ఆంధ్రప్రదేశ్‌ నాయకులే. ఒకవేళ అంతా కలిసి మూడింట రెండు వంతుల చొప్పున వెళ్ళాలంటే… ఆప్షన్‌గా టీడీపీ లేదా జనసేనను ఎంచుకుంటారు తప్ప… బీజేపీలోకి వెళ్ళరన్న వాదన ఉంది. అలాంటప్పుడు కృష్ణయ్య ఒక్కరే బీజేపీలోకి వెళ్తారా? అన్న చర్చ సైతం జరుగుతోంది. ఆయన పదవీ కాలం ఇంకా నాలుగేళ్ళు ఉంది. ఈ పరిస్థితుల్లో…. ఒక వేళ బీజేపీ పెద్దలు ఆయన్ని రమ్మని కోరినా… కాషాయ కండువా కప్పుకోవడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. కృష్ణయ్య బీజేపీలో చేరతారని గతంలో కూడా రెండు సార్లు ప్రచారం జరిగింది. ఆయన ఖండించారు. అయినా సరే… ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన బీజేపీ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.