Off The Record: పవన్ కళ్యాణ్. కొంత కాలంగా ఒకే పాట పాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్తానని చెబుతూనే ఉన్నారు. ఇక ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో కలిసిన సందర్భంలో కూడా వారికి టీడీపీతో కలిసి వెళ్తేనే బెటరనే భావనను వ్యక్తం చేస్తూ టీడీపీతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లేలా ఒప్పించే ప్రయత్నం చేశారు పవన్. ఇంత జరుగుతున్నా.. ఇంత చేస్తున్నా.. జనసేన కార్యకర్తలు.. జనసేనలోని ముఖ్య నేతలు మాత్రం పవన్ సీఎం అవుతారనే అభిప్రాయాన్ని అడపా దడపా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారు వీరు కాదు.. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కూడా పవన్ సీఎం అయితే స్వర్ణయుగమే అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. ఓట్ షేరింగ్, సీట్ షేరింగుతో పాటు.. పవర్ షేరింగ్.. సీఎం సీట్ షేరింగ్ కూడా ఉంటుందనే భావనతో ఉన్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారో.. దానికి సార్దకత చేకూరుతుందని అంతా భావించారు. కానీ గురువారం పవన్ చేసిన కామెంట్లతో అంతా తారు మారైంది. ఇప్పుడిదే ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్కుగా మారింది.
పొత్తులపై మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు జనసేన అధినేత. పొత్తులు ఉంటాయని, ఆ పొత్తులకు సీఎం పదవి ప్రామాణికం కాదన్నారు. తనకు సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ, బీజేపీలను అడగబోనని అన్న పవన్ కల్యాణ్….ముఖ్యమంత్రి పదవి వరించి రావాలన్నారు. కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి సాధించలేమన్నారు. పవన్ కళ్యాణ్ ఈ తరహా ప్రకటన చేయడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జోరుగా సాగుతోంది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా భారీ తప్పిదంతో మూల్యం పవన్ చెల్లించుకోబోతున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం కానప్పుడు.. ఆ పార్టీకో.. ఆ కూటమికో తామెందుకు ఓట్లేయాలనే భావన బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన జనసేన వర్గాల్లో కన్పిస్తోంది. పవన్ పూర్తిగా చంద్రబాబుకు లోబడి పని చేస్తున్నారని.. చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారనే విమర్శలకు మరింత బలం చేకూర్చినట్టుగా పవన్ ఉన్నారనే చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో పవన్ తనంతట తాను అధికార పార్టీకి ఓ భారీ అస్త్రాన్ని ఇచ్చారనేది ఓ వాదన. దీనికి పవన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అంటున్నారట. అసలు ఎన్నికలు ముగిశాక.. అప్పుడు వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని.. చూసుకుని మాట్లాడి ఉంటే సరిపోయేదని.. కానీ ఇప్పటికిప్పుడే ఇంత హడావుడిగా ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అనంతరం జనసేనకు వచ్చిన సీట్లే ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా మారితే.. కచ్చితంగా పవన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది కదా..? ఇప్పుడే ఇంత తొందరపాటు ప్రకటన దేనికని జనసేన వర్గాలే గుసగుసలు పోతున్నాయట. దీంతో భవిష్యత్ మీద బెంగతో కొందరు ఇప్పటికే డీలా పడిపోయారనే చర్చ జరుగుతోందట.
అయితే పవన్.. జనసేన పార్టీ అధినాయకత్వం ఆలోచన వేరే విధంగా ఉందని అంటున్నారు. అన్ని రకాల అంశాలకు.. క్లారిటీ ఇవ్వడం కోసమే పవన్ ఈ ప్రకటన చేశారని అంటున్నారు. కష్టమో.. నష్టమో.. క్లారిటీ ఇచ్చేస్తే.. ఎవరు ఎటు వైపు ఉంటారు.. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయనేది తేలిపోతుందనేది జనసేన ఆలోచనగా కన్పిస్తోంది. అలాగే పదేపదే కులం పేరు చెప్పి.. అభిమానం పేరు చెప్పి.. ఉచిత సలహాలు ఇచ్చే వారికి చెక్ చెప్పే క్రమంలోనే ఈ తరహా ప్రకటన వచ్చిందనేది జనసేన పార్టీలోని హైలెవల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. పైగా తాము క్లారిటీ ఇవ్వనంత కాలం.. సీఎం అభ్యర్థి ఎవరు..? చంద్రబాబా..? పవనా..? లోకేషా..? ముందు ఎవరో తేల్చుకోండనే విమర్శలకు.. కౌంటర్లకు ఒక్క స్ట్రోకుతో సమాధానం చెప్పేసినట్టు అయిందనేది జనసేనాని భావనగా కన్పిస్తోంది. పైగా వాస్తవాలు.. గత ఎన్నికల గణంకాలతో బేరీజు వేసినా.. వచ్చే 2024 ఎన్నికల్లో తాను సీఎం కావడం కలలోని మాట అనే గ్రౌండ్ రియాల్టీకి దగ్గరగా ఉంటుందని.. దీన్ని ఎవ్వరూ కాదనలేని సత్యమంటున్నారు. కానీ పవన్ కల్యాణ్, ఆయన ముఖ్య నేతా గణం వరకు ఈ క్లారిటీ వున్నా…ఇలాంటి కామెంట్లు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు మాత్రం రాంగ్ సిగ్నల్ వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మీరు ఓటెయ్యకపోవడం ద్వారానే నేను ఓడిపోయాను.. చప్పట్లు కొట్టడం కాదు.. ఓట్లు వెయ్యాలి.. మీరు అనుకుంటే నేను సీఎంను అవుతానంటూ అనేక సభల్లో చెప్పారు పవన్. మీరు సీఎం చేస్తే అవుతాను అనడమేంటి అనే విమర్శలు కూడా పవన్ పైకి దూసుకొచ్చాయి. పోరాడాలి, నిత్యం ప్రజల్లో వుండాలి..విధానాలు నచ్చితే…ప్రజలే ఆశీర్వదిస్తారు. అంతేకానీ, ఓడించి మీరు తప్పు చేశారన్నట్టుగా జనంపైనే పవన్ నిందలు మోపేలా, ఆయన మాటలు వున్నాయని అనేవారూ వున్నారు. అంతేకాదు, రాయలసీమలో అసలు తమకు బలమే లేదని కూడా పవన్ అన్నారు. ఈ కామెంట్లు కూడా రాయలసీమ పవన్ ఫ్యాన్స్, జనసేన క్యాడర్ కూ అసంతృప్తికి గురి చేశాయట. బలం పెంచుకోవాలి కానీ, బలంలేదని వదిలెయ్యడం, అక్కడి కార్యకర్తలకు రాంగ్ సిగ్నల్ పంపినట్టు అవుతుందన్న మాటలు వినపడ్డాయి.
అయితే, పార్టీ క్యాడర్ ను తన కామెంట్ల అయోమయంలో పడేసినా…వీటి వెనక పవన్ కంటూ చాలా అర్థాలున్నాయని పవన్ కోటరీ లీడర్లు చెబుతున్నారు. ఎలాగైనా జగన్ ను గద్దెదించాలని పవన్ కంకణం కట్టుకున్నారు. అందుకు ఏకైక మార్గం చంద్రబాబుతో జట్టుకట్టడం, ఓటు చీలనివ్వకుండా చెయ్యడమేనని నమ్ముతున్నారు. ఆ లక్ష్యంతోనే పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కర్నాటకలో బీజేపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యమని భావించిన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్దరామయ్య సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పవన్ కూడా ఇదే తరహాలో వైసీపీని పీఠం నుంచి దించడమే టార్గెట్ గా పెట్టుకుని, చంద్రబాబుతో నడవాలని డిసైడయ్యారని వివరిస్తున్నారు. అయితే, ఇంకెన్ని సంవత్సరాలు ఇదే ఫార్ములా అనుసరిస్తారనే విమర్శలూ వస్తున్నాయి. 2014లో కాంగ్రెస్ హఠావో..దేశ్ బచావో అంటూ బీజేపీ, టీడీపీతో జోడికట్టిన పవన్, ఇప్పుడు వైసీపీ హఠావో అంటూ మళ్లీ టీడీపీతో కలిసి సాగేందుకు సై అంటున్నారు. మరి జనసేన ఎప్పుడు పీఠం ఎక్కేది…ఎప్పుడు పవన్ సీఎం అయ్యేది….ఎప్పుడూ పల్లకీ మొయ్యడమేనా అంటూ జనసేన క్యాడర్ లోలోపల మథనపడుతోంది. ఏ పార్టీనో గెలిపించడం కోసం, తామెందుకు పని చెయ్యాలని లోలోపల మథనపడుతున్నారు.
పవన్ మాటలకు అర్థాలే వేరంటూ మరికొందరు ఇంకో వ్యూహాన్ని చెబుతున్నారు. పవన్ పని కష్టపడేది చంద్రబాబును గద్దెను ఎక్కించడానికో.. జగన్ను గద్దె నుంచి దించడానికో కాదని.. వచ్చే ఎన్నికల్లో జనసేన కనీసం గౌరవ ప్రదమైన సీట్లను దక్కించుకుని అసెంబ్లీ అడుగుపెట్టి తీరాలని.. దీనికి అనుగుణంగానే ఇప్పుడీ తరహా ప్రకటనలు.. రాజకీయం చేస్తున్నారని అంటున్నారట. ఎన్నికలు అయ్యాక..హంగ్ తరహా పరిస్థితే ఏర్పడితే.. అప్పుడు కుమారస్వామిలా ఎందుకు సీఎం పదవి వరించదంటూ భవిష్యత్ ను దర్శిస్తున్నారట. అయితే అనుకోవడానికి ఇవి బాగానే వున్నా…కర్నాటక, ఏపీకి చాలా తేడా వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత మైసూరులో జేడీఎస్ కు బలమైన ఓటు బ్యాంకు వుందని, కనీసం రెండంకెల సీట్లయినా సాధించి, కింగ్ మేకర్ గా అవతరిస్తోందని వివరిస్తున్నారు. మరి జనసేనకు ఏపీలో ఏ ప్రాంతంలో బలముందని, కింగ్ మేకర్ తరహా ఆలోచనలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకోకుండా, అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఎలా అనుకుంటున్నారని చెబుతున్నారు.
మొత్తానికి పవన్ కల్యాణ్ ఆలోచనలు, వ్యూహాలు ఎలా వున్నా…ఆయన కామెంట్లు మాత్రం జనసేన క్యాడర్ ను మరింత కన్ ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నాయి. పవన్ ను సీఎంగా చూడాలని జనసేన క్యాడర్ భావిస్తుంటే…పవన్ మాత్రం తనకు సీఎం పదవిపై ఆశలేదని చెబుతుండటం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపుతోందన్న చర్చ జరుగుతోంది. మరోసారి వైసీపీకి ఆయుధం ఇచ్చినట్టయ్యిందని క్యాడర్ మాట్లాడుకుంటోంది.