NTV Telugu Site icon

Off The Record: జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి..? కేసీఆర్‌ని ఎందుకు కలవడం లేదు?

National Level

National Level

Off The Record: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈసారి కమల దళానికి ఎలాగైనా చెక్‌పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాయి ప్రతిపక్షాలు. అందుకే కీలకంగా ఉన్న విపక్ష నేతలందర్నీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయి. ఒక వైపు మమతా బెనర్జీ, మరో వైపు తాజాగా నితీశ్ కుమార్ ఆ పనిలోనే ఉన్నారు. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల అధినేతల్ని కలుస్తున్నారు ఆయన. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే అంతా ఒక్కటై బీజేపీని ఢీకొట్టాలన్నది ప్లాన్‌. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల అధినేతల్ని కలిశారు నితీశ్ కుమార్‌. కానీ… ఎక్కడా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రస్తావన రాకపోవడం, ఆ నాయకుల్లో ఎవరూ తెలంగాణ సీఎంని కలవకపోవడం ఇప్పుడు రకరకాల అనుమానాలకు తావిస్తోంది. టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ కూడా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ ఆ మధ్య పలువురు నాయకుల్ని కలిశారు. బీజేపీ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి నాయకుడిని ఇప్పుడు జాతీయ కూటమి ప్రయత్నాల్లో ఉన్న వారు కలవకపోవడం ఏంటన్న చర్చ మొదలైంది.

2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో ముందుకు వచ్చారు కేసీఆర్‌. కానీ…అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత దేశంలో గుణాత్మక మార్పు అంటూ TRS ను BRSగా మార్చారు. బీజేపి కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అలాంటి నాయకుడిని కూటమి ప్రయత్నాల్లో ఉన్న బీహార్ సిఎం నితీశ్ కుమార్ కలవకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటన్న విశ్లేషణలు జోరుగా జరుగుతున్నాయి. జాతీయ కూటమి దిశగా కార్యాచరణ ఖరారు చేసేందుకు త్వరలో కాంగ్రెస్‌తో పాటు మిగతా విపక్ష పార్టీలు భేటీ కాబోతున్నాయి. అందుకోసం అందర్నీ సంప్రదిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని BRS తో సంప్రదింపులు జరపలేదని తెలిసింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఆ తర్వాతే బీఆర్‌ఎస్‌ విషయంలో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే …తెలంగాణలో ఆ పార్టీకే లాభం చేకూర్చిన వాళ్ళం అవుతామన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌ పెద్దల్లో ఉందట. అందుకే ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌ జోలికి వెళ్ళకూడదని అనుకుంటున్నారట. మొత్తంగా చూస్తే… బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేసే పనిలో సీరియస్‌గా ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం… తన ప్రయత్నాల వల్ల కమలం పార్టీ వీసమెత్తు కూడా లాభపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.