NTV Telugu Site icon

Off The Record: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు.. పగవాడికి కూడా రాకూడని కష్టం..?

Nzb Brs

Nzb Brs

Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు వరద కష్టాలు మొదలయ్యాయట. భారీ వర్షాలకు..ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది నిజామాబాద్ జిల్లా. వర్షాల దెబ్బకు నిజామాబాద్ లో 40వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక్కడే ఎమ్మెల్యేలకు అసలు కష్టం మొదలయ్యిందట. వరద బాధితుల పరామర్శకు వెళ్తున్న కొందరు ఎమ్మెల్యేలు.. పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఎలాంటి హామీ ఇవ్వలేక.. తలలు పట్టుకుంటున్నారట. ఇంకొందరైతే… ఈ గొడవంతా ఎందుకనుకుని అసలు వరద బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడటం కూడా మానేసినట్టు తెలిసింది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఆదేశాలిస్తే.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మినహా మిగతా వాళ్ళంతా ఆలస్యంగా కదిలారట. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో రికార్డింగ్ పంపి.. చేతులు దులుపుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మొక్కుబడి పర్యటనలతో మమ అనిపించారట. అసలు మేటర్‌ ఏంటయ్యా అంటే… పంట నష్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలే అమలవలేదని, ఇప్పుడు కొత్తగా రైతుల ముందుకు వెళ్ళి మళ్లీ ఏం చెప్తామని అనుకుంటున్నారట సదరు శాసనసభ్యులు.

ఏప్రిల్ చివర్లో కురిసిన అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. అప్పుడు ఎకరానికి 10వేలు ఇస్తామని ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. తీరా వాస్తవంలోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలతో రైతుల్ని సతాయించారన్న అపవాదు ఉంది. 30 శాతానికి మించి పంట నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామన్న నిబంధనతో చాలా మంది రైతులకు నిరాశే మిగిలింది. అర్హులైన వారందరికీ కూడా ఇంకా ఖాతాల్లో డబ్బు జమ అవకముందే…వానాకాలం వచ్చేసి…. వేసిన పంట మునిగిపోయింది. దీంతో ప్రజల్లోకి వెళితే ఏం సమాధానం చెప్పాలో అర్ధంగాక పక్కకు తప్పుకుంటున్నారట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు జనం మధ్యకు వెళ్తే… మరింత వ్యతిరేకత పెరుగుతుందని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కురిసిన భారీ వర్షాలు.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారాయని తలలు పట్టుకుంటున్నారట గులాబీ ఎమ్మెల్యేలు. ఇదంతా ఒక ఎత్తయితే… వీళ్లకు మరో రూపంలో ఇంకో రకమైమన కష్టం కూడా రాబోతున్నట్టు తెలిసింది. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే..పరామర్శించకుండా ముఖం చాటేసిన ఎమ్మెల్యేల జాబితాను పార్టీ తెప్పించుకుందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. తాము చెప్పినా… ప్రజల్లోకి వెళ్లని వాళ్ళ లిస్ట్‌ రెడీగా ఉందట. ఈ అంశం పై త్వరలోనే వివరణ కోరే అవకాశం ఉందంటున్నారు. ప్రజల్లో వెళ్లిన వారికి ఒకరకం ఇబ్బంది ఉంటే.. వెళ్లని ఎమ్మెల్యేలు పార్టీ దృష్టిలోపలుచనయ్యారు. వరద కష్టాలు ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతాయో… ఎవరి సీటుకు ఎసరు పెడతాయో చూడాలి.

Show comments