Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్. ఖానాపూర్ నుంచి రెండు సార్లు గెలిచారామె. మూడో సారి మాత్రం ఆమెకు టిక్కెట్ నిరాకరించింది బీఆర్‌ఎస్. తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో రేఖా నాయక్ పేరు లేకపోవడం, మంత్రి కేటీఆర్ స్నేహితుడిగా చెప్పుకుంటున్న భూక్యా జాన్సన్ నాయక్ పేరు తెరమీదికి రావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. జాబితా ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే.. రాత్రికి రాత్రే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ థాక్రేను కలిసి పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఆయన ఆసిఫాబాద్ నుంచి హస్తం పార్టీ తరపున బరిలో దిగేందుకు టికెట్ అడుగుతుండగా.. రేఖానాయక్ మాత్రం ఇప్పుడే బయటపడకూడదని అనుకుంటున్నారట. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నాకు ఇంకా టైం ఉందని చెబుతున్నారట.
తాను పార్టీ మారబోనని పైకి అంటున్నా.. బ్యాక్ గ్రౌండ్‌లో జరగాల్సిన పని జరుగుపోతోందన్నది లోకల్ టాక్. ఆమె చివరి నిమిషంలోనైనా సరే.. కారు దిగేసి హస్తం గూటికి చేరిపోతారని అంటున్నారు. ఇప్పుడు మాత్రం తనకు సీఎం అన్యాయం చేశారు.. తడిగుడ్డతో గొంతు కోశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమేకాక ఆరు నెలల ముందే స్కెచ్ వేశారని, అప్పటి నుంచి నిధులు ఆపించారంటూ జాన్సన్ నాయక్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకుల మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలతో పాటు సర్వే రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉండటం వల్లే టిక్కెట్ రాలేదంటున్న రాజకీయ వర్గాలు ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళక పోవడం వెనక వ్యూహం ఉందంటున్నాయి. ఇప్పటికిప్పుడు పార్టీ మారిపోతే… జనానికి చెప్పుకోవడానికి వాయిస్ ఉండదు కాబట్టి.. పదవి ఉన్నని రోజులు ఇలాగే కొనసాగి అధికార పార్టీవల్ల తనకు అన్యాయం జరిగిందని దుమ్మెత్తి పోస్తే.. తర్వాత పని తేలిక అవుతుందని అనుకుంటున్నారట. అలాగే జాన్సన్ నాయక్ మత మార్పిడి గురించి కూడా హైలైట్ చేసి జనంలో చర్చకు పెట్టాలనుకుంటున్నారట రేఖా నాయక్. ఇలాంటి స్కెచ్‌లతో సింపతీ గేమ్ ఆడవచ్చన్నది ఎమ్మెల్యే వ్యూహంగా చెబుతున్నారు.
రేఖానాయక్ భర్త శ్యాం నాయక్ రాజకీయాల్లోకి రావడం కోసం ఏకంగా రవాణాశాఖలో తాను చేస్తున్న జిల్లా స్థాయి ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చేశారు. కొద్ది రోజుల నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటున్న శ్యాం.. కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు. పార్టీ స్క్రీనింగ్ కమిటీకి ఆయన దరఖాస్తు చేసుకున్నారు కూడా. అదే చేత్తో భార్య రేఖానాయక్‌కు కూడా ఖానాపూర్ నుంచి టికెట్ కోసం ఆయనే దరఖాస్తు చేశారట. భార్యా భర్తలు ఇద్దరూ చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అంటే… రేఖా నాయక్ ఓ వైపు బీఆర్ఎస్ సిట్టింగ్‌గా ఉంటూనే… మరో వైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేశారన్న మాట. టెక్నికల్‌గా చూస్తే.. నా భర్త అప్లయ్ చేశారని చెప్పవచ్చుగానీ… ఈ దరఖాస్తుల్ని బట్టి చూస్తే… ఇవాళ కాకుంటే రేపైనా ఆమె కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటున్నారు పరిశీలకులు. అయితే ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఇచ్చేస్తే.. ఇప్పటికే అక్కడున్న వారి పరిస్థితి ఏంటి? దరఖాస్తు చేసుకోగానే టిక్కెట్ ఇచ్చేస్తారా? ఒకే కుటుంబంలో… అదీ భార్యా భర్తలకు ఇస్తారా అన్నది చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. మరి ఈ పొలిటికల్ కపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.