NTV Telugu Site icon

Off The Record: ఆళ్లగడ్డలో భూమా, గంగుల వర్గాల స్ట్రీట్‌ ఫైట్‌..

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Off The Record: ఒకవైపు నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి , మరో వైపు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు భూమా అఖిలప్రియ. తాజాగా ఆళ్లగడ్డలో భూమా వర్సెస్‌ గంగుల వర్గాల స్ట్రీట్ ఫైట్ హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి పై సవాల్ చేశారామె.. ఎవరు అభివృద్ధి చేశారు , ఎవరు అవినీతికి పాల్పడ్డారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేయడం , పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అఖిలప్రియ. దొర్నిపాడులో జగనన్నకు చెబుదాం కార్యక్రమం జరుగుతున్న టైంలో వెళ్లిన అఖిల…కలెక్టర్‌కు సమస్యలు చెబుతున్న టైంలోనే అక్కడికి వచ్చారు బ్రిజేంద్ర రెడ్డి.

కేసి కెనాల్ రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరిన భూమా ఆ తర్వాత ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ప్రజలు సమస్యలు చెప్పుకునే స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలా కూర్చుంటారంటూ ఘాటైన పదజాలం వాడారామె. ఎమ్మెల్యే ఎదురుగా కూర్చుంటే… ఆయన మీద ఆయన అనుచరుల ఆగడాల మీద కలెక్టర్‌కు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు అఖిలప్రియ. అధికారులు మాత్రమే కూర్చోవాల్సిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలా కూర్చుంటాడన్నారు. నియోజకవర్గానికి సీఎం ప్రకటించిన 100 కోట్లు తీసుకురావడానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు చేతకాలేదని, రైతులకు సాగునీరు తెప్పించడం చేతకాకపోతే పక్కన కూర్చోవాలని, ఎలా తెప్పించుకోవాలో తాము చేసి చూపిస్తామని సవాల్ చేశారు అఖిల. దీనికి ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి సైతం తీవ్ర స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు. ప్రోటోకాల్ తెలియకుండా గతంలో మంత్రి పదవి ఎలా చేశావంటూ… ఆమెను నిలదీశారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏనాడైనా రైతుల కష్టాలు పట్టించుకున్నావా అంటూ రివర్స్‌ అటాక్‌ చేశారు ఎమ్మెల్యే. పంచాయతీ కోసం ఇంటికి వస్తే డబ్బులు లాక్కునే కల్చర్ మీది, చిల్లర రాజకీయం మానుకొని జనానికి మంచి చేయడం గురించి ఆలోచించాలంటూ… ఘాటుగా రియాక్ట్‌ అయ్యారాయన.ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆళ్ళగడ్డ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల నాటికి ఈ యుద్ధం హద్దులు మీరి పీక్స్‌కు చేరే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఇది ఇంకెంత ముందుకు వెళ్ళి ఏమేం చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు స్థానికులు.

ఆళ్ళగడ్డలో భూమ, గంగుల వర్గాల స్ట్రీట్ ఫైట్ l AP Politics l Off the Record l NTV