Site icon NTV Telugu

Off The Record: మైలవరం వైసీపీలో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చేసిందా..?

Mylavaram

Mylavaram

Off The Record: 45 రోజుల అమెరికా టూర్‌ తర్వాత తిరిగొచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టీ పెట్టగానే.. లోకల్‌గా తనను ఇబ్బందిపెట్టే వారికి వార్నింగ్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్‌ మంత్రి జోగి రమేష్‌గా వ్యవహారం నడుస్తున్నందున ఆ వార్నింగ్స్‌ అన్నీ.. మంత్రిని ఉద్దేశించేనన్నది లోకల్‌ టాక్‌. ఇద్దరి మధ్య సోషల్‌ మీడియాలో సైతం వార్‌ ఓ రేంజ్‌లో జరుగుతోంది. మంత్రి జోగి తీరుతో విసిగిపోయిన వసంత గతంలో గడప గడపకు కార్యక్రమాన్ని వదిలేసి హైదరబాద్ వెళ్ళిపోయారట. సీఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకుని పంచాయితీ చేసినా.. మేటర్‌ మళ్ళీ మొదటికే వచ్చిందంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో ఒకసారి అమెరికా వెళ్తే.. ఎన్నికలలో ఓడిపోయి వెళ్లినట్టు దుష్ప్రచారం చేశారని, మళ్ళీ ఇప్పుడు వెళ్తే.. ఈసారి సీటు ఇవ్వరని చెప్పడంతో అలిగి వెళ్ళినట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతోందట వసంత వర్గం. అందుకే.. ఈసారి వచ్చీ రాగానే.. జోగి వర్గానికి వార్నింగ్ ఇచ్చారంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. పార్టీలో కొందరు వర్గాలను పెంచి పోషిస్తున్నారని, పదవులు వచ్చే వరకు నక్కవినయాలు ప్రదర్శించి.. ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని కామెంట్ చేశారు వసంత. పార్టీ తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే వ్యాపారాలు చేసుకుంటానని ఆయన చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌ అయ్యాయి. ఇక్కడేం జరుగుతోందో అధిష్టానానికి తెలుసని, ఇకపై ఇక్కడి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే ఉద్దేశ్యం కూడా తనకు లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు ఎమ్మెల్యే. కావాలని వర్గాలను కొందరు పెంచి పోషిస్తున్నారని, ఎప్పుడు కుదురుతుందా సీటు లాగేద్దామా అన్న ధ్యాస తప్ప వేరే పనే లేనట్టుగా ప్రవర్తించేవారి గురించి ఆలోచించడం కూడా అనవసరమని అన్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఇవన్నీ మంత్రి జోగి రమేష్‌ను ఉద్దేశించి చేసినవేనన్నది నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం.

ఎమ్మెల్యే వసంత అమెరికా టూర్ లో ఉన్న సమయంలోనే మైలవరం టికెట్ జోగి రమేష్‌కు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు పోస్టింగ్స్‌ సోషల్ మీడియాలో తెగ తిరిగేశాయి. అదంతా జోగి వర్గం పనే అన్నది వసంత మనుషుల ఆరోపణ. దీంతో అమెరికా టూర్ నుంచి వచ్చీరాగానే జోగి వర్గం టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఇకపై అధిష్టానం దగ్గర ఈ విషయంపై పంచాయితీ పెట్టే ఉద్దేశ్యం లేదంటూ ఖరాకండీగా చెప్పటం ద్వారా.. తాను ఈ విషయంలో విసిగిపోయాననే సంకేతాలను ఇచ్చారంటున్నారు. సహజంగా తాను సౌమ్యుడిని అని, అయితే ఇది ఒకవైపే నని, ఎవరి బెదిరింపులకు లొంగే రకాన్ని కాదని.. ఇది తన రెండో వైపంటూ వార్నింగ్ లు ఇచ్చారు వసంత. దీంతో ఎమ్మెల్యే తదుపరి ఏం చేయబోతున్నారోనన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. కొన్నాళ్ళుగా గన్నవరంలో వర్గపోరుతో ఇబ్బందిపడిన వైసీపీ అధిష్టానం తాజాగా మైలవరం రచ్చతో మరింత ఇరకకాటంలో పడుతోందట. వసంత తాజా వ్యాఖ్యలతో అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

Exit mobile version