Site icon NTV Telugu

Off The Record: బొమ్మరిల్లు ఫాదర్ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు?

Atchimnaidu

Atchimnaidu

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తోందట. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ.. అన్న డైలాగ్‌ని తెగ గుర్తు చేసుకుంటూ సేమ్‌ సీన్‌ అని యువ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ డాడీ కేరక్టర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఉంటే… కొత్త ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు అదే డైలాగ్‌ చెబుతున్నారట. ఇచ్ఛాపురం, నరసన్నపేట నియెజకవర్గాల సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి గుడ్డిలో మెల్లలా ఉన్నా.. కొత్త వాళ్ల సంగతి దారుణంగా ఉందని చెప్పుకుంటున్నారు. తాము గ్రౌండ్ లెవెల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరక్క, నియోజకవర్గాల్లో అగ్రనేతకు అడ్డు చెప్పలేక తల్లకిందులవుతున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నామో, లేదో కూడా తెలియటం లేదని ఓ యువ శాసనసభ్యుడు తన అనుచరుల దగ్గర వాపోయారట. జిల్లా స్థాయి పోస్టింగ్స్‌ మెదలు, మండలాల్లోని బదిలీల వరకూ అంతా… మంత్రి అచ్చన్న కనుసన్నలలో జరిగిపోతున్నట్టు చెబుతున్నారు. జిల్లాలోని కొందరు పీడీలు, ఉన్నత అధికారులు.. మంత్రి అచ్చెన్నాయుడి మాట తప్ప తమ మాట వినడం లేదని, వాళ్ళు అసలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నారో లేదో కూడా అర్ధం కావడం లేదని ఆ ఐదుగురు కొత్త శాసనసభ్యులు తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం.

Read Also: Handri Neeva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పనులు పూర్తి.. ఎల్లుండి నీటిని విడుదల చేయనున్న సీఎం..

తమ మాట సాగడం లేదని లోలోన మధనపడుతున్నారని, ఆలాగని ఆ సంగతి బయటికి చెప్పుకోలేకపోతున్నారని సమాచారం. చివరికి అధికారుల్ని కూడా జనానికి ఫలానా పని చేయడంలేదేంటని గట్టిగా అడగాలంటే… వాళ్ళు అచ్చన్న మనుషులన్న మాటలు వినిపిస్తున్నాయట. దాంతో.. చేసేదేంలేక ఎమ్మెల్యేలు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నట్టు తెలుస్తోంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు నడుకుదిటి ఈశ్వరరావు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పలాస శాసనసభ్యురాలు శిరీష.. ఇలా వీళ్ళంతా మెదటి సారి అసెంబ్లీ మెట్లు ఎక్కినవారే. ఎన్నికల సమయంలో జిల్లా పార్టీకి పెద్దగా.. టిక్కెట్లు ఇప్పించడం నుంచి గెలుపులో కూడా అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించారని, అందుకే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల మీద పెత్తనం చెలాయిస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. ఎంత సహకరిస్తే మాత్రం… మొత్తం ఆయన చేతుల్లోకి తీసుకుని మమ్మల్ని కీలు బొమ్మల్ని చేస్తారా అన్నది ఎమ్మెల్యేల అంతరంగంగా తెలుస్తోంది. అధికారం మొత్తం ఆయన చుట్టూనే కేంద్రీకృతమైపోయిందన్నది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్‌ టాక్‌. ఎస్పీలు, డీఎస్పీల సంగతి తర్వాత… కనీసం ఎస్సై పోస్టింగ్స్‌ కూడా వేయించుకోలేక పోతున్నామని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట కొత్త ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల్లో అధికారులు ఎవ్వరూ తమ మాట వినకపోవడంతో…. అసలు గెలిచామా లేదా అన్న అనుమానం కలుగుతోందట వాళ్ళకి.

Read Also: HONOR X70: 8300mAh భారీ బ్యాటరీ, బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్ తో హానర్ X70 గ్లోబల్ లాంచ్..!

తాజా బదిలీల్లో కొందరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెత్తబుట్టల్లోకి చేరాయట. దీంతో తాము కేవలం పేరుకు మాత్రమే మిగిలిపోయామన్నది వాళ్ళ ఆవేదనగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉన్న అచ్చెన్నాయుడికి పార్టీ అధిష్టానం జిల్లా బాధ్యతలు ఇచ్చి ఉండవచ్చని, అంత మాత్రాన మా నెత్తినెక్కి నాట్యం చేస్తే ఎలా? మాకు మాత్రం రాజకీయ భవిష్యత్‌ ఉండవద్దా అని కొత్త శాసనసభ్యులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. నియోజకవర్గాల్లో ఇసుక నుంచి గ్రావెల్ వరకూ , పోర్ట్ పనుల సీనరేజ్ నుంచి ప్రతి అంశంలోనూ అచ్చెన్నాయుడి మనుసులే తెరవెనుక కథ నడిపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది కూడా ఎమ్మెల్యేల మంటకు కారణం అవుతోందట. మా నియోజకవర్గాల్లో మమ్మల్ని డమ్మీలుగా మార్చి ఎవరెవరో వచ్చి దందాలు చేస్తున్నారంటూ సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. చిన్న, పెద్ద ఏ పని జరగాలన్నా అచ్చెన్న మాట ఉండాల్సిందేనని, ఆ మాత్రం దానికి జనం మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ఎందుకంటూ అసహనంగా అంటున్నట్టు సమాచారం. మంత్రి ఎలా చెబితే అలా తలాడించే పరిస్థితి నుంచి జిల్లా శాసనసభ్యులు బయటికి రావాలనుకుంటున్నా.. రాలేకపోతున్నారట. కేవలం ఆమదాలవలస మినహా మిగిలిన అన్ని నియెజకవర్గాలలో ఇదే పరిస్దితిని ఉందంటున్నారు.

Exit mobile version