NTV Telugu Site icon

Off The Record: ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుచరులే తలనొప్పిగా మారుతున్నారా?

Congress

Congress

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల అనుచరులు రెచ్చిపోతున్నారట. పోలీస్‌ స్టేషన్స్‌లో సెటిల్ మెంట్స్‌ మొదలు అన్ని రకాల వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది. మా సార్ పదవిలోకొచ్చారు అంటూ… పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తుండటంతో… ఇక ఆండ్రా బాబూ… మీ దందాలు అంటూ స్వయంగా ఎమ్మెల్యేలే వార్నింగ్స్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ తలనొప్పులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓనేత ప్రధాన అనుచరుడు సెటిల్ మెంట్లు, ఇల్లీగల్ వ్యవహారాలకు రేటు ఫిక్స్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక మరో ఎమ్మెల్యే అనుచరుడు అక్రమ బియ్యం, లిక్కర్‌, భూ దందాతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలో సైతం ఊతమిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరో ఎమ్మెల్యే అనుచరులపై అరాచకాల గురించి అయితే.. అస్సలు చెప్పే పనే లేదంటున్నారు. చివరికి సదరు ఎమ్మెల్యేనే వాళ్ళని పిలిచి పేరు బద్నాం చేయకండర్రా అని బతిమాలుకోవాల్సి వస్తోందట.

Read Also: Amaravati: అమరావతి అభివృద్ధి.. ఈ ఏడాది చివరకల్లా రూ.15 వేల కోట్ల రుణం..

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా… అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్‌ రిమార్క్స్‌ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్… తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ నేతకు ప్రధాన అనుచరుడిగా ఉండి మొన్నటి ఎన్నికల్లో వివేక్ కోసం పనిచేసిన ఆ నాయకుడు తక్కువ టైంలోనే చెడ్డపేరు తెచ్చుకోవడంతో… వివేక్‌ బహిరంగంగానే… నాపేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకోబోనని వార్నింగ్‌ ఇచ్చారట. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం ఇలాంటి వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గల్లీ నాయకులు సైతం పెద్ద లీడర్లలా ఫోజులు కొడుతూ ఎమ్మెల్యే పేరును బజారున పడేస్తున్నారన్నది బెల్లంపల్లి టాక్‌. చివరికి మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖలో సైతం చోటామోటా నాయకుల దందాల గురించి ప్రస్తావించారంటే… వాళ్ళ అరాటకాలు ఏ స్థాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు స్థానికులు. వీటన్నిటినీ చూసి భరించలేని ఎమ్మెల్యే… వాళ్ళని పిలిచి ఒరే నాయనా…నాకు చెడ్డపేరు తేకండిరా…పనులు చేసుకోండిగానీ… పరువు తీయకండంటూ కాస్త బతిమాలడం, ఒకింత బెదిరించడం లాంటి రకరకాల విన్యాసాలు చేయాల్సి వచ్చిందట.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇక అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పేరు చెప్పి కొంతమంది పెద్దపెద్ద డీల్స్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు, సెల్లార్ల కూల్చివేతలు, వరుసగా జిల్లా కేంద్రంలో జరగుతున్న దాడుల్లో ఎమ్మెల్యే అనుచరులు ఒక్కరిద్దరి పాత్ర ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అలాంటి వాళ్ళకు ఎమ్మెల్యే డైరెక్ట్ వార్నింగ్‌ ఇవ్వడంతో పాటు….తోకజాడించి చెడ్డపేరు తెచ్చిన వారిని దూరంగా పెట్టారనే ప్రచారం సైతం జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు కొందరు అతిగా తాగి అరాచకాలు చేస్తున్నారంటూ… ఎక్కువగా మందు కొట్టనంటూ ఏకంగా వాళ్ళతో ప్రమాణాలు కూడా చేయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలానికి ఒక్కరో ఇద్దరో చేసే చెడుపనుల వల్ల ఎమ్మెల్యేల పదవులకు, అంతిమంగా కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోందన్న బాధ ఆ పార్టీ వర్గాల్లో ఉందట. ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుచరుల ఆగడాలతో తలబొప్పి కడుతోందన్నది లోకల్‌ టాక్‌. వీళ్ళ వ్యవహారం చూస్తున్నవాళ్ళంతా… చాదస్తపు మొగుడు చెబితే వినడు, తిడితే ఏడుస్తాడన్నట్టుగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారట. ముగ్గురు శాసనసభ్యులు అనుచరుల్ని ఎలా కట్టడి చేస్తారో చూడాలి మరి.

Show comments