Off The Record: రాజకీయాల్లో ట్విస్టులు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఏ ఎత్తుగడ వెనుక ఎవరు ఉంటారో…ఏ స్విచ్ వేస్తే ఎక్కడి లైట్ వెలుగుతుందో కనిపెట్టడం అంత తేలిక కాదు. ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల ఎత్తుగడలు రసవత్తరంగా ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి కొంత మంది కార్యకర్తలు వచ్చి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. మంగళగిరి హైవే నుంచి పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి మరీ వైసీపీ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. మధ్యాహ్నం సమయానికి పార్టీ ఆఫీసు ముందే వెంట తెచ్చుకున్న భోజనాలు చేశారు. విషయం ఏంటంటే ప్రస్తుతం కొండపి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్ బాబు టీడీపీతో లాలూచీ పడుతున్నారన్నది కార్యకర్తల ఆరోపణ. అశోక్ బాబును ఇంఛార్జ్ గా తప్పించాలని నినాదాలు చేశారు. అనుచరులతో కలిసి ఇసుక, మద్యం, బియ్యం అక్రమ వ్యాపారాలు అశోక్ బాబు చేస్తున్నారని…నిరసన వ్యక్తం చేయటానికి వచ్చిన స్థానిక నేతలు, కార్యకర్తలు ఆరోపించారు.
కొంచెం వెనక్కి వెళితే గత ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గం నుంచి 2019లో మాదాసు వెంకయ్య పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ ఆయనకు డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. గత ఏడాది జూన్ వరకు ఆయనే ఇంఛార్జ్ గా ఉన్నారు. ఆ తర్వాత అశోక్ బాబుకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది. తాజాగా నిరసనలను చూస్తే… అశోక్ బాబుకు వ్యతిరేకంగా ఉన్న వెంకయ్య వర్గం ఇదంతా చేయిస్తుందేమో అన్న అనుమానాలు వస్తాయి. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
2014 ఎన్నికల సమయంలో వైసీపీలో ఉండి టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయించిన జూపుడి ప్రభాకర్ ఈ నిరసన వెనుక కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని టాక్. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్న జూపూడి ఎట్టకేలకు సామాజిక న్యాయ ప్రభుత్వ సలహాదారు అనే పదవిని సంపాదించగలిగారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగలేదని, వచ్చే ఎన్నికల్లో కొండెపీ నుంచి బరిలో నిలబడాలని జూపుడి ఉత్సాహపడుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌ను తప్పించగలిగితే ఒక టాస్క్ పూర్తి అవుతుందన్న జూపుడి లెక్క అన్న చర్చ జరుగుతోంది. అశోక్ బాబు వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొట్టి ప్లకార్డులతో పార్టీ కార్యాలయం ముందు నిరసనకు దిగేలా చేయటం జూపుడి స్క్రిప్ట్ లో భాగం అని ప్రచారం జరుగుతోంది. నిరసన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత…మీడియాలో కవరేజ్ ఏ మేరకు వచ్చింది అనే విషయాన్ని కూడా జూపుడి వర్గం ఆరా తీసిందట. జూపుడి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టన్ విషయాలు పార్టీ పెద్దల వరకు చేరిందని టాక్.