Site icon NTV Telugu

Off The Record: పొలిటికల్‌ హీట్‌ పెంచిన బచ్చా పాలిటిక్స్‌

Khammam

Khammam

Off The Record: ఉమ్మడి జిల్లాలో హాట్ సీటు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద ఈ ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది బీఆర్‌ఎస్‌. ఈసారి ఎలక్షన్స్‌లో కూడా మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. తాను మాత్రం గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. అధికార పార్టీ నేతలు ఎక్కువ మందిలో కూడా అదే అభిప్రాయం ఉందట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఖమ్మంలో పోటీ చేసిన పువ్వాడ.. సీనియర్‌ లీడర్‌ తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి.. జిల్లాలో బలమైన నేతగా ఉన్న నామా నాగేశ్వరరావుపై గెలిచారు. అందుకే ఆయన్ని ఓడించడం అంత తేలిక కాదని, ఈసారి హ్యాట్రిక్‌ కొడతారని ప్రచారం చేసుకుంటున్నారు మంత్రి అనుచరులు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండో వైపు స్టోరీ వేరే జరుగుతోందట.

పువ్వాడ అజయ్‌ అభివృద్ధి మాటున అరాచకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన్ని టార్గెట్ చేసుకుంటున్న నాయకులు. కాంగ్రెస్‌, బీజేపీతోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం మంత్రి టార్గెట్‌గా మాటల తూటాలు పేలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. దమ్ముంటే అజయ్ కుమార్ మీద పోటీ చేయాలని పొంగులేటికి సవాల్ విసిరారు ఆమె. అందుకు మంత్రి స్పందిస్తూ… పొంగులేటి ఎందుకు? నువ్వే పోటీ చేయవచ్చుకదా? ఆ దమ్ములేదా అని ప్రతి సవాల్‌ చేశారు. దానికి కొనసాగింపుగా… నామీద పొంగులేటి పోటీ చేసినా సై … లేదంటే ఏ బచ్చాగాడు వచ్చినా ఓకే.. అనడంతో వివాదం ముదిరింది. అదే క్రమంలో అజయ్‌ని ఓడించడానికి నేను అవసరం లేదు. ఓ బచ్చాను పెట్టి ఓడిస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు పొంగులేటి. దానిమీదే ఇప్పుడు హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. పొంగులేటి మాటలే సీరియస్‌ అయితే… అజయ్ మీద పోటీచేసే బచ్చా ఎవరంటూ ఖమ్మంలో చర్చించుకుంటున్నారు. టీ కొట్టు దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఆఫీల దాకా అంతటా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణల జోరు ఎక్కువై మంత్రి చెవిన పడటంతో ఏ బచ్చా వచ్చినా… లేక నేరుగా పొంగులేటే వచ్చినా నేను రెడీ..హ్యాట్రిక్‌ కొట్టేస్తానని తాజా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు పువ్వాడ.

ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ మీద పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే స్థానికంగా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారే ఛాన్స్‌ ఉందంటున్నారు. కొద్ది రోజుల నుంచి పొంగులేటి ఖమ్మంలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా విఫలం చేసే ప్రయత్నాల్లో ఉందట అధికార పార్టీ. అందుకే మంత్రి పువ్వాడను ఆయన టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. ఎన్నికలనాటికి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో తనకు ప్రత్యర్థి అవుతారన్న అంచనాతోనే మంత్రి ముందు నుంచి ఆయన్ని టార్గెట్‌ చేస్తున్నారన్న వాదనలు సైతం ఉన్నాయి. అందుకే ఇద్దరి మధ్య మాటలు తూలుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల నాటికి బచ్చాలే తెరమీదికి వస్తారో… బీభత్సాలే జరుగుతాయో చూడాలి.

Exit mobile version