NTV Telugu Site icon

Off The Record: సంక్రాంతి నుంచి మైలవరంలో జోగి రమేష్ రాజకీయం

Otr Jogi

Otr Jogi

Off The Record: ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుతున్న…ఆ మాజీ మంత్రి ఈ సారి ముందుగానే ఫిక్సయ్యారా ? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి నియోజకవర్గంలో పాలిటిక్స్‌ చేయాలని నిర్ణయించుకున్నారా ? ఓడిన నియోజకవర్గంలోనే…గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారా ? సంక్రాంతి పండుగ తర్వాత…పార్టీ కార్యాలయం తెరిచేందుకు రెడీ అయిపోయారా ? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి…ఏంటా నియోజకవర్గం. ?

జోగి ర‌మేష్…వైసీపీ హ‌యాంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా చ‌క్రం తిప్పారు. పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయ‌న…రెండుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో అటు చంద్రబాబు…ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లను హ‌ద్దులు దాటి మ‌రీ అన‌రాని మాట‌లు అన్నారు. మంత్రి అవ‌కముందే చంద్రబాబు ఇంటిపై త‌న అనుచ‌ర వ‌ర్గంతో దాడికి యత్నించారు. కూట‌మి అధికారంలోకి రాగానే జోగిపైనే కాకుండా జోగి కుమారుడు రాజీవ్ మీద కూడా అగ్రిగోల్డ్ భూముల కేసులు న‌మోదయ్యాయి. జోగి కొన్ని రోజులు అజ్జాతంలోకి వెళ్ళగా…ఆయ‌న కుమారుడు జైలుకి వెళ్ళి వచ్చారు. తాజా ఘ‌ట‌న‌ల‌తో జోగి రమేశ్‌… త‌న స‌హ‌జ‌శైలిగా ఉన్న దూకుడును ప‌క్కన పెట్టిన‌ట్టు ఆయన వర్గమే చెబుతోంది. అయితే ఇప్పుడు జోగి ర‌మేష్ మ‌ళ్ళీ యాక్టివ్ అవ్వాల‌ని డిసైడ‌య్యార‌ట‌. ప్రధానంగా జోగి ర‌మేష్ టీడీపీ లేదా జ‌న‌సేన‌లోకి వెళ్తార‌ని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్రచారం జ‌రిగింది. దీంతో దీన్ని ఖండించ‌టంతోపాటు పూర్తి స్థాయిలో త‌న ఉద్దేశాల‌ను కూడా పార్టీ క్యాడ‌ర్‌కు చెప్పాల‌ని నిర్ణయించుకున్నారట. రెండు రోజుల క్రితం మైల‌వ‌రంలో కార్యక‌ర్తల స‌మావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు. తాను వైఎస్సార్ శిష్యుడినని వైసీపీలోనే ఉంటాన‌ని స్పష్టం చేశారు. వ‌చ్చే సంక్రాంతి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యాల‌యం ప్రారంభిస్తాన‌ని…అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాన‌ని క్యాడ‌ర్‌కు భరోసా ఇచ్చారట. ఇక‌పై తాను మైల‌వ‌రం నుంచే రాజ‌కీయాలు చేస్తాన‌ని, వైసీపీలో ఉంటాన‌ని జోగి క్లారిటీగా చెప్పటంతో మైల‌వ‌రం నియోజ‌క‌ వ‌ర్గ రాజ‌కీయాలు వేడెక్కాయట‌.

జోగి ర‌మేష్ నాలుగు సార్లు పోటీ చేసి మూడు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీకి దిగారు. అందులో పెడ‌న నుంచి రెండుసార్లు, మైల‌వ‌రం నుంచి ఒక‌సారి, పెన‌మ‌లూరు నుంచి మ‌రోసారి పోటీ చేశారు. జోగి సొంత నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. కానీ అక్కడ నుంచి 2014లో పోటీ చేసి ఓడి పోయిన ఆయ‌న…2019లో పెడ‌న వెళ్లారు. అక్కడ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇదే స‌మ‌యంలో ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌పున వ‌సంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వ‌సంత‌, జోగిలు చెరో నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచారు. అయితే మైల‌వ‌రంలో త‌న‌ను ప‌ని చేయ‌నీయ‌కుండా జోగి ఆయ‌న వ‌ర్గం ఇబ్బంది పెడుతోంద‌ని…వ‌సంత పార్టీకి రాజీనామా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీలో చేరి మ‌ళ్ళీ మైల‌వ‌రం నుంచి గెలిచారు. అప్పట్లో కూడా ఇద్దరి మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా జోగిని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇన్చార్జిగా నియ‌మించ‌టం…అక్కడ నుంచి పోటీకి సై అని క్లారిటీ ఇవ్వటంతో పాత శ‌త్రువుల మ‌ధ్య పోరు మ‌ళ్ళీ మొద‌లైన‌ట్టైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి వ‌సంత‌, జోగి ప్రత్యర్థులుగా మార‌నున్నారు. ఇప్పటికే ప‌లుమార్లు జోగి తీరును వ‌సంత కృష్ణప్రసాద్‌ ఎండ‌క‌ట్టారు. తాజా స‌మావేశంలో వ‌సంత టార్గెట్ గా జోగి మాట్లాడారు. దీంతో ఇద్దరి మ‌ధ్య పోరు మొద‌లైంద‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. గ‌తంలో వ‌సంత గెలుపుకు స‌హ‌క‌రించిన జోగి…ఆ త‌ర్వాత శ‌త్రువులుగా మారిపోయారు. ఇప్పుడు రెండు వేర్వేలు పార్టీల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో వ‌సంత వ‌ర్సెస్ జోగి వ్యవ‌హారం ఎలాంటి రాజ‌కీయ ర‌చ్చ రేపుతాయో చూడాలి మ‌రి.