NTV Telugu Site icon

Off The Record: తెలంగాణతో మళ్లీ వార్తల్లోకి.. జేసీ అదే సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారా?

Jc Diwakar Reddy

Jc Diwakar Reddy

Off The Record: రాయల తెలంగాణ…ఈ మాట వినపడి చాలా ఏళ్ళయింది కదా..? తొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన టైంలో రాయలసీమ నేతల నోళ్లలో బాగా నానిన పేరది. మళ్ళీ ఇన్నాళ్ళకు… ఆ ప్రస్తావన తీసుకువచ్చారు సీమకు చెందిన సీనియర్‌ లీడర్‌ జేసీ దివాకర్‌రెడ్డి. సడన్‌గా ఇన్నేళ్ళ తర్వాత ఆయనకు రాయల తెలంగాణ ఎందుకు గుర్తుకు వచ్చిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు జేసీ. అంతకు మించి ఆయన ఏం మాట్లాడినా.. సెన్సేషన్ అవుతూ ఉంటుంది ఎక్కువసార్లు. ఎదురుగా ఎవరు ఉన్నారు.. ఏంటి.. అని ఆలోచించకుండా మాట్లాడేయడం చాలాసార్లు వివాదాస్పదమైంది కూడా. తాడిపత్రి కేంద్రంగా రాజకీయాలు చేసే జేసీ బ్రదర్స్‌కు 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సోదరుల కుమారులు ఇటు తాడిపత్రిలోనూ, అటు అనంతపురంలోనూ ఓడిపోయారు. ఆ తర్వాత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులతో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం, త్రిశూల్ సిమెంట్స్‌పై భారీ మొత్తంలో పెనాల్టీ వేయడం, గతంలో ఉన్న మైనింగ్ లీజులు రద్దు కావడం.. ఇలా ఒక్కటేంటి జేసీ ఫ్యామిలీకి అన్ని వైపుల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి.

ఈ దాడులు, కేసులతో విసిగిపోయిన దివాకర్‌రెడ్డి గత మూడేళ్లుగా సైలెంట్ అయ్యారు. వయసు 83ఏళ్ళు కావడంతో వయోభారం కూడా వెంటాడిందట. దీంతో.. ఎప్పుడో ఎవరైనా గట్టిగా అడిగితే తప్ప రాజకీయపరమైన కామెంట్స్‌ పెద్దగా చేయలేదు. హైదరాబాదులో అప్పుడప్పుడు కనిపిస్తూ తన పాత మిత్రులను కలుసుకునేవారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడో మరుగునపడిన రాయల తెలంగాణ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించి అందరి దృష్టి ఆకర్షించాలనుకుంటున్నారు జేసీ. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా రాష్ట్రం ఇచ్చే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు జేసీ. రాష్ట్రం విడిపోవాల్సి వస్తే ఖచ్చితంగా రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని అప్పట్లో డిమాండ్ చేశారాయన. రాయలసీమకు, తెలంగాణకు దగ్గర సంబంధాలు ఉన్నాయని, అలాగే నీటి విషయంలో కూడా కలసి పంచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే అప్పట్లో అలాంటి వాదనలేవీ పనిచేయలేదు. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తొమ్మిదేళ్ళకు తిరిగి అదే పాత రికార్డేశారు మాజీ ఎంపీ. ఇప్పుడు జేసీ యాదృచ్చికంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, కావాలనే అలా మాట్లాడారన్నది పొలిటికల్‌ పండిట్స్‌ విశ్లేషణ అట.

హైదరాబాద్ రాయలసీమకు దగ్గరగా ఉంటుంది. సీమలో చాలామంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. వారి వ్యాపార, ఆర్థిక బంధాలు అన్నీ హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయట. అందుకే గతంలో రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చారట. ప్రస్తుతం ఏపీలో తమ పరిస్థితి ఏ మాత్రం బాగోకపోవడంతో జేసీ తిరిగి పాత పల్లవి అందుకున్నారని అంటున్నారు. ఇందులో ప్రాంత ప్రయోజనాలకంటే… వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం సీఎం జగన్‌కు, జేసీ ఫ్యామిలీకి అసలు పొసగడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం అత్యధికంగా కేసులు ఎదుర్కొంది. ఇప్పటికీ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణను తమకు సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారట దివాకర్‌రెడ్డి. అక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ బలంగా ఉన్నాయి. వైసీపీ ఉనికి కూడా లేదు. అందుకే… ఈ సీనియర్‌ లీడర్‌ నోటి నుంచి తాజాగా రాయల తెలంగాణ ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ అంశం మీద కీలక నేతలు అందర్నీ కలుస్తానని అంటున్నారట ఆయన. రాయల తెలంగాణ అంటూ… జేసీ దివాకర్‌రెడ్డి నోటి మాటగా చాలా తేలిగ్గా చెప్పేశారు. కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అది సాధ్యమేనా అన్న ప్రాక్టికల్‌ క్వశ్చన్‌ వేసుకుంటే… సమాధానం అదే వస్తుందని అంటున్నారు ఎక్కువ మంది. జరగని వాటి గురించి జేసీ పదేపదే మాట్లాడి అరిగిపోయిన రికార్డ్‌ తిరగేయడం ఏంటని అంటున్నారట.