Off The Record: స్మితా సభర్వాల్…. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో… అంతా తానై అధికారం చెలాయించిన ఐఎఎస్ ఆఫీసర్. ఇంకా చెప్పాలంటే… సీఎంవో మొత్తం ఆమె కనుసన్ననల్లోనే నడిచిందంటారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఫేట్ తిరగబడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్మితాను కూడా పక్కన పెట్టారు. నాటి వైభోగమంతా కనుమరుగైంది. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ ఎక్స్ పోస్ట్ తీవ్ర వివాదాస్పదమై దేశ వ్యాప్తంగా రచ్చ అవుతోంది. అందునా అత్యంత సున్నితమైన దివ్యాంగులు, రిజర్వేషన్స్ సబ్జెక్ట్‌ను టచ్ చేయంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అందులో వాడిన భాష, చెప్పిన విధానం ఆమెలోని కరడుగట్టిన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. మనుషులు పైకి చూడ్డానికి సున్నితంగా కనబడినంత మాత్రాన సరిపోదు. మనసులు కూడా అంతే అందంగా ఉండాలన్న సెటైర్స్ సైతం గట్టిగానే పడుతున్నాయి. ట్రైనీ ఐఎఎస్ పూజా ఖేద్కర్ నకిలీ వైకల్యం, ఓబీసీ సర్టిఫికెట్స్ వివాద క్రమంలో ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్‌లో రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది.
దానికి కొనసాగింపుగా ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు స్మిత. అదే ఇప్పుడు ఆమెను ఇరుకున పెడుతోంది. ఐఎఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో క్షేత్ర స్థాయి పని ఎక్కువని, కొన్ని సార్లు కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుందని, అందుకు శారీరక దృఢం చాలా ముఖ్యమని అన్నారు. ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి ఉంటుందని, ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుందని కూడా రాసుకొచ్చారామె. తాను దివ్యాంగుల్ని గౌరవిస్తానని ఓ వైపు అంటూనే.. మరోవైపు వైకల్యం ఉన్న పైలట్‌ను విమానం నడపడానికి సంస్థలు ఎంచుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవల్ని మీరు విశ్వసిస్తారా అంటూ… వివాదాస్పద ప్రశ్నలతో రచ్చకు తెరలేపారు. సివిల్ సర్వీసెస్ అధికారులు ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపిగ్గా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో అసలు ఈ కోటా ఎందుకని నేను అడుగుతున్నానంటూ ప్రశ్నించారు స్మిత. ఆ మెస్సేజ్ చుట్టూనే ఇప్పుడు వివాదం ముసురుకుంది.
అసలామె ఏ ఉద్దేశ్యంతో ఆలా అన్నారు? దివ్యాంగులంటే అంత చిన్న చూపా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్స్. మాజీ ఐఏఎస్ అధికారి బాలలత అయితే స్మితకు ఏకంగా సవాల్ విసిరారు. తనతో పాటు మళ్ళీ సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారామె. అసలు దివ్యాంగులం బతకాలా వద్దా అని కూడా ప్రశ్నించారు బాలలత. పని ఉన్నోళ్ళు పని చేసుకుంటారు తప్ప ఇలా ట్వీట్‌లు పెట్టరని, బహుశా స్మితా సబర్వాల్ ఫిజికల్లీ ఫిట్ అయి ఉండవచ్చుగానీ… మెంటల్ గా ఫిట్‌గా లేదన్నారు బాలలత. స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? లేక తెలంగాణ ప్రభుత్వ విధానం కూడా అదేనా చెప్పాలని కూడా డిమాండ్ చేశారామె. గతంలో కూడా రకరకాల వివాదాల్లో చిక్కుకున్నారు స్మిత. కేసీఆర్ హయాంలో సీఎం సెక్రెటరీగా ఉంటూనే… తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మిగతా ఐఎఎస్‌లు ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసినా.. స్మిత మాత్రం ఆ పని చేయలేదు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది.
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సైతం స్మితా సబర్వాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో చేయకూడనివన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి తప్పించుకోవడం కొంత మందికి ఫ్యాషన్ అయిందంటూ ట్వీట్ చేశారాయన. చివరికి స్మిత రియాక్ట్ అయి అందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే తన హవా కొనసాగిన టైంలో… ఫీల్డ్ విజిట్ పేరుతో ఆమె ప్రత్యేక హెలికాప్టర్ వాడటం విమర్శలకు దారి తీసింది. ప్రస్తుత పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ముందు స్మితా కాలుమీద కాలువేసుకుని కూర్చున్న విధానంపై కూడా మండిపడ్డారు నెటిజన్లు. గత ఏడాది స్మితా ఇంట్లోకి ఓ ఆగంతకుడు చొరబడం, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం మరో వివాదం. అవన్నీ ఒక లెక్క, ఇప్పుడు ఏకంగా దివ్యాంగుల్ని టార్గెట్ చేసుకుని పెట్టిన మెస్సేజ్ మరో లెక్క. ఇది ఆమె మానసిక స్థితా? లేక ఇన్నేళ్ళు హవా నడిపి… ఇప్పుడు తననెవరూ గుర్తించడం లేదన్న ఫ్రస్ట్రేషన్‌లో ఏదో ఒక రూపంలో లైమ్‌లైట్‌లో ఉంటాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. పైగా ఫస్ట్ చేసిన పోస్ట్‌కు వివరణ ఇస్తూ పెట్టిన రెండో పోస్ట్ రచ్చను మరికొంచెం పెంచింది. ఈ వివాదాస్పద ఆఫీసర్ ఇప్పటికైనై ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పెడతారా? లేక ఎవరేమనుకుంటే నాకేంటి? పాజిటివో నెగిటివో రావాల్సిన మైలేజీ వస్తోందనుకుంటూ కొనసాగిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.