Off The Record: ధర్మపురి…పేరుకు ఎస్సీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గం…. కానీ.. ఇక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ… జనరల్ సీట్ కంటే యమా హాట్‌గా ఉంటాయి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి పదవులతో పాటు వివాదాలు కూడా వెన్నంటే ఉంటాయన్నది లోకల్ సెంటిమెంట్. పునర్విభజనలో ధర్మపురి సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ప్రధానంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్ మధ్యే ఎన్నికల పోరు సాగింది. ఈ వార్‌లో స్వల్ప మెజారిటితో మూడు సార్లు ఓడిపోయారు లక్ష్మణ్. ఆ సానుభూతికి తోడు కాంగ్రెస్ వేవ్ కలిసొచ్చి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి గెలిచారన్నది లోకల్ టాక్. అయితే… గెలిచిన మూడు నెలల్లోనే నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో విభేదాలు మొదలయ్యాయట. అయితే అందుకు కారణం కూడా బలంగానే ఉందన్నది లోకల్ టాక్. వరుసగా లక్ష్మణ్ ఓడిపోతున్నా… 15 ఏళ్ళ నుంచి ఆయనకు అండగా ఉన్నామని, తీరా ఇప్పుడు గెలిచాక తమను పట్టించుకోకుండా… ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తుల ప్రధాన ఆరోపణగా తెలిసింది. అలాగే ధర్మపురి కాంగ్రెస్‌లో పాత నేతలకు, జంపింగ్ జపాంగ్‌లకు మధ్య కూడా స్పర్ధలు మొదలయ్యాయట.అయినా సరే… లక్ష్మణ్ తనకేం పట్టనట్టు ఉంటున్నారని, ఎవరి తరపున మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న భయంతో ఆయన సైలెంట్ అయిపోయారని, దాని ఫలితం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించిందని అంటున్నారు.
Read Also: Droupadi Murmu: బ్యాడ్మింటన్ ఆడిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరికి 22వేల మెజారిటీ వస్తే… లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇదే అసెంబ్లీ సెగ్మెంట్‌లో… కాంగ్రెస్ అభ్యర్థి 8వేల ఓట్లు వెనుకబడ్డారు. పెద్దపల్లిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కి ఆధిక్యం లభించగా… ఒక్క ధర్మపురి లో మాత్రం బీజేపీ లీడ్ సాధించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షునిగా, ప్రభుత్వ విప్ గా ఉన్న అడ్లూరి ఇలాకాలో అలా జరగడం వెనుక కారణాలను పరిశీలించిన పార్టీ పెద్దలు షాక్ అయ్యారట. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్, ఎన్నికల ఖర్చు విషయాల్లో క్యాడర్‌ను ఆయన అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో ఆయన తీరుపట్ల సెకండ్ క్యాడర్ గరం గరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారితో పాటు, ఏళ్ల తరబడి జెండా మోసిన వారికి సైతం ఆయన అంత సులువుగా దొరకడం లేదనే టాక్ కూడా నడుస్తోందట ధర్మపురిలో… ఎన్నికల సమయంలో సర్పంచ్ స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఓ సీనియర్ మంత్రి సూచించినప్పటికీ వినీ విననట్టుగా వదిలేశారని అంటున్నారు. ఈ విషయాలన్నిటినీ పార్టీ ఎంపీ అభ్యర్థి దృష్టికి లోకల్‌నేతలు కొందరు తెచ్చారట. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోవడానికి ద్వితీయ శ్రేణి నేతలే కారణం అన్న వాదన బలపడుతోంది. అగెలాగా… అంటే… ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మండల స్థాయిలో పేరున్న నేతలదే హవా. పార్టీ ఏదైనా, ఎమ్మెల్యే ఎవరైనా… అగ్రవర్ణాలకు చెందిన ఆ మండల స్థాయి నేతలతో సఖ్యతగా ఉంటే సరి. లేదంటే ఇక సమస్య మొదలైనట్టేనట. ఎవరి మండలం మీద వారికి గట్టి పట్టు ఉంటుందని, ఇంకా చెప్పాలంటే… ధర్మపురిలో మండలానికో ఎమ్మెల్యే ఉంటారన్నది లోకల్ టాక్.
Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో అంతర్మథనం.. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావిస్తోందా..?
అసలు శాసనసభ్యుడు ఉత్సవ విగ్రహం మాత్రమేనని, నియోజకవర్గంలో కథ నడిపేదంతా… ఆ ఏడుగురు మండల నేతలేనని చెప్పుకుంటున్నారు స్థానికంగా. గతంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సీనియర్ నాయకుల్లో కొందరు మాజీ మంత్రి కొప్పులతో విభేదించడం వల్లే ఆయన ఓడిపోయారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే పరిస్థితి అడ్లూరికి ఎదురయ్యే పరిస్థితులు వస్తున్నాయన్న చర్చ మొదలైంది. నియోజకవర్గంలో కొనసాగుతున్న మండలానికో ఎమ్మెల్యే ట్రెండ్‌ని కంటిన్యూ చేసేందుకు కొందరు పాత నేతలు… ఇటీవలే పార్టీలో చేరిన కొత్త నేతలు….. ప్రయత్నాలను ప్రారంభించారట…… పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, మండల స్థాయి ఆఫీసుల్లో పనులు తమ కనుసన్నల్లో ఉండేలా చేసుకునేందుకు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తమను కాదంటే ఏం జరుగుతుందో ఇండైరెక్ట్‌గా ఇచ్చేశారట సదరు లోకల్ లీడర్స్. ఈ పరిస్థితుల్లో… వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యేకు ఛాలెంజ్‌గా మారే అవకాశాలున్నాయంటున్నారు. అక్కడ ఏదన్నా తేడా జరిగి.. పార్లమెంట్ ఎన్నికల ఫలితం రిపీట్ అయితే మాత్రం అడ్లూరి ఇమేజ్ డ్యామేజ్ అవడం పక్కా అనే చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. మరి లక్ష్మణ రేఖ దాటుతున్న నేతల్ని లక్ష్మణ్ కట్టడి చేసి తన దారికి తెచ్చుకుంటారా? లేక ఈ గొడవెందుకు… మనమే కళ్లు మూసుకుంటే పోలా అని వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.