Off The Record: పార్టీ పవర్‌లో ఉండి, తాను పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా హోదా వెలగబెట్టినప్పుడు కన్ను మిన్ను కానరాలేదట ఈ లీడర్‌కి. నియోజకవర్గంలో బిల్డప్ బాబాయ్ మాటలు చాలానే చెప్పారట. ఏ విషయం మాట్లాడినా… ఓస్ అంతేనా అంటూ… అసలు బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత నేనే అన్నంతగా గొప్పలకు పోయారట. తీరా ఎంపీ టిక్కెట్ అడిగినా ఇవ్వకపోయేసరికి సిగ్గుబోయి నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆ నాయకుడు ఎవరు? ఏంటాయన ఎకసెక్కాల యవ్వారం?
2014 నుంచి వరుసగా రెండు సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపారు ఓటర్లు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గువ్వల హవా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో ఉండేదట. అంగబలం, అర్ధబలంతో అధికార యంత్రాంగాన్ని కనుసన్ననల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారని చెప్పుకుంటారు. పదేళ్ల పాటు తానాడిందే ఆట, పాడిందే పాటగా సాగిన గువ్వలకు చెక్ పెట్టి ఈసారి కాంగ్రెస్ అభ్యర్ది వంశీక్రిష్ణకు పట్టం కట్టారు నియోజక వర్గ ఓటర్లు. ఆయన ఓటమికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ… అధికారం శాశ్వతం అన్నట్లుగా నాడు వ్యవహరించిన తీరు, విపరీత పోకడలే ఓటమికి ప్రధాన కారణం అన్నది నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజమే అయినా… ఓడిపోయాక గువ్వల బాలరాజు అచ్చంపేటకు పూర్తిగా ముఖం చాటేశారన్నది లేటెస్ట్ టాపిక్. ఎమ్మెల్యేగా ఓడిన గువ్వల …. ఎంపీ టికెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారట. ఒక సారి ఎంపీగా పోటీ చేసిన అనుభవంతో ఈ విడత టికెట్ దక్కించుకొని పార్లమెంట్‌లో అడుగుపెడదామనుకున్నా… ఆ ఆశ నెరవేరకుండా… అర్ ఎస్ ప్రవీణ్‌కు కేటాయించి కేసీఆర్ షాకిచ్చినట్లు చెప్పుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. ఈ చర్చ బాగా గట్టిగా జరగడంతో… డీప్‌గా హర్ట్ అయిన గువ్వల నియోజక వర్గానికి ముఖం చాటేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరించారనేది పార్టీ వర్గాల సమాచారం.
మొయినాబాద్ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తర్వాత ఆకాశంలో విహరించిన గువ్వల బాలరాజు.. తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అంటూ అచ్చంపేటలో ప్రచారం చేసుకున్నారు. ఒకానొక దశలో గులాబీ దళంలో నేనే ప్రముఖుడిని బిల్డప్‌లు కూడా ఇచ్చారట. కానీ… ఎంపీ టిక్కెట్టు దక్కకపోవడాన్ని నామోషీగా ఫీలైపోయి తీవ్ర నిరాశలోకి జారుకున్నట్టు తెలిసింది. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పోండి అంటూ . చిర్రుబుర్రులాడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే అచ్చంపేటలో అడుగుపెట్టిన గువ్వల బాలరాజు తీరును చూసి… బీఆర్‍ఎస్ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు వేరే పార్టీలవైపు క్యూ కడుతున్నట్టు సమాచారం. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూగానకుండా వ్యవహరించిన తీరుతో ఒక్క ఓటమితోనే అచ్చంపేటలో అడుగు పెట్టలేని దుస్థితి గువ్వలకు దాపురించిందన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. మరో పక్క నియోజక వర్గానికే చుట్టపు చూపు కూడా కరవైన గువ్వల ఇక జిల్లా అధ్యక్ష పదవిని పూర్తిగా విస్మరించినట్టు చెప్పుకుంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించి ఫైట్ చేయాల్సి ఉందని, అలాంటిది తమ నాయకుడు ముఖం చాటేయడంతో క్షేత్ర స్థాయి క్యాడర్ నైరాశ్యం లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ కదన రంగంలో వెన్నంటి నిలవాల్సిన నాయకుడు హైద్రాబాద్‌కే పరిమితం కావడంపై బిఆర్ ఎస్ శిబిరం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఒక పక్క లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం కావడం తో పాటు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి వెళ్ళాల్సిన తరుణంలో గువ్వల వైఖరితో కేడర్ నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.