Site icon NTV Telugu

Off The Record: చివరి నిమిషంలో ఆగిపోయిన చేరిక..! ఆ మాజీ మంత్రి చేరిక ఉంటుందా.. ఉండదా..?

A Chandrasekhar

A Chandrasekhar

Off The Record: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళి మరీ… పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా ఆదివారం నాడు ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై దళిత డిక్లరేషన్ పై చర్చించారు. మీటింగ్‌ అయ్యాక చంద్రశేఖర్ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాల్సింది. కానీ… ఆ ఒక్కటి మాత్రం జరగలేదు. ఢిల్లీ వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. పీసీసీ ఛీఫ్‌ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడం, చంద్రశేఖర్‌ చేరిక వాయిదా పడటంతో.. అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది పార్టీలో. రకరకాల విశ్లేషణలతో హీట్‌ పెంచుతున్నారు నాయకులు.

2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌లోనే ఉన్న చంద్రశేఖర్‌ వికారాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ.. టికెట్ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ అభ్యర్థి మీదే రెబెల్‌గా మారారు. దీంతో అప్పట్లో పిసిసి క్రమశిక్షణ కమిటీ ఆయన్ని సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌ ఎత్తేయకుండానే మాజీ మంత్రిని తిరిగి పిలిచి 2019లో లోక్‌సభ పోటీ చేయించారు పార్టీ పెద్దలు. పెద్దపెల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారాయన. ఆ వెంటనే బీజేపీ గూటికి చేరిపోయారు. ఇప్పుడు తీరా.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి కాంగ్రెస్ లో చేరడానికి పావులు కదుపుతున్నారు చంద్రశేఖర్‌. ఇదే విషయమై పార్టీలో కొందరు సీనియర్స్‌ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట. ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడం.. ఓడిపోయాక బయటికి వెళ్లడం, మళ్లీ వచ్చేస్తానంటే చేర్చుకోవడమేనా..? ఒక పద్ధతంటూ లేదా అని అభ్యంతరం చేశారట ఒకరిద్దరు సీనియర్స్‌.

దీని మీదే ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర పార్టీని వివరణ కోరినట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉండాలి గాని.. అవకాశ వాదంగా కేవలం ఎన్నికల ముందు చేరి తర్వాత బయటకు వెళ్లే వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పెద్దలు పీసీసీని హెచ్చరించినట్టు తెలిసింది. సీజన్‌కు తగ్గట్టు పదే పదే పార్టీలు మారుస్తున్న ఇలాంటి వారిని సరిగ్గా ఎన్నికలకు ముందు చేర్చుకుని టిక్కెట్స్‌ ఇస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు అధిష్టానం నుంచి రావడంతో… చంద్రశేఖర్‌ చేరిక డైలమాలో పడ్డట్టు చెప్పుకుంటున్నారు. కండువా కప్పాల్సిన అగ్ర నేతలే పీటముడి వేయడంతో కార్యక్రమం వాయిదా పడిందట. అందుకే ఢిల్లీకి వెళ్లాల్సిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. అయితే కాంగ్రెస్‌లో ఇలాంటివన్నీ సహజమన్నది పార్టీ వ్యవహారాల గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. ప్రస్తుతానికి కాస్త వెనక్కు తగ్గినట్టుగా ఉన్నా… కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలిక వస్తుందా లేక చంద్రశేఖర్‌కు పర్మినెంట్‌గా గేట్లు మూసేసినట్టేనా అన్నది చూడాలి.

Exit mobile version