NTV Telugu Site icon

Off The Record: ఈటల, రంజిత్ రెడ్డి రెండు పార్టీలలో ఉండటంపై చర్చ.. ప్లాన్‌ అదేనా..?

Etela

Etela

Off The Record: తెలంగాణలో పౌల్ట్రీ రంగంలో వారిద్దరు మంచి వ్యాపార భాగస్వాములు. ఒకరు మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మరొకరు ఎంపీ రంజిత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్‌ ఆవిర్భావం నుంచి పని చేశారు. కొంతకాలం క్రితం బీజేపీలో చేరిపోయారు. ఈటల రాజకీయాలతో పాటు వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన వ్యాపార భాగస్వామి రంజిత్ రెడ్డి. 2019 ఎంపీ ఎన్నికల సందర్భంగా రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఇప్పించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రంజిత్‌రెడ్డిని గెలిపించుకున్నారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బహిష్కరణకు గురయ్యారు. అదే సమయంలో రంజిత్ రెడ్డి కూడా పార్టీ మారుతారనే చర్చ జరిగింది. కానీ అప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ మారలేదు. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్…బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆయన తరపున రంజిత్ రెడ్డి బంధువులు ప్రచారం చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఈటల రాజేందర్…బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నిక్లలో ఈటల…మల్కాజిగిరి లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

రంజిత్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్‌రెడ్డి…చేవెళ్ల ఎంపీ సీటును తెచ్చుకున్నారు. ఇద్దరు వ్యాపార స్నేహితులు…రెండు జాతీయ పార్టీల్లో నుంచి బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. పరస్పర విరుద్ధమైన రెండు పార్టీల నుంచి తలపడటంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకరు బీజేపీ, మరొకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగిన ఈటల తరపున ఆయన కుటుంబసభ్యులు ప్రచారం చేసేందుకు సిద్ధమౌతున్నారు. రాజేందర్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఒకప్పుడు ఆమె కూడా బిఆర్ఎస్ నుంచి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా పని చేశారు. ఇటీవలే ఆమె కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎంపీ బరిలో ఉన్నవారంతా నిన్న మొన్నటి వరకు మిత్రులే. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ఒక్కక్కరు ఒక్కో పార్టీలో చేరి మిత్రులు కాస్తా ప్రత్యర్ధులుగా మారారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించిన పట్నం మహేందర్ రెడ్డి…రంజిత్ రెడ్డి రాకతో మల్కాజిగిరికి మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజురాబాద్ అసెంబ్లీ నుంచి ఈటల మల్కాజిగిరికి మకాం మార్చారు. వరంగల్ జిల్లా నుంచి చేవెళ్లకు రంజిత్ రెడ్డి మకాం మార్చారు. ఈటల, రంజిత్ రెడ్డి వ్యాపార మిత్రులు కావడంతో…మల్కాజిగిరిలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందా? లేక నామమాత్రపు పోటీ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్‌, రంజిత్‌ రెడ్డి రెండు పార్టీల్లో ఉండటంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం కంటే…రెండు వేర్వేరు పార్టీల్లో ఉంటే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ గెలిచినా…ఇద్దరి వ్యాపారులకు ఇబ్బందుల కలగకుండా ఉండేందుకు…ఈటల బీజేపీ, రంజిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments