NTV Telugu Site icon

Off The Record: వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్‌ కోరుకుంటోందా..?

Ap Ts

Ap Ts

Off The Record: తెలంగాణ, ఏపీలో లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది. ఇక మిగిలింది గెలుపు ఓటములపై చర్చలే. ఆల్రెడీ అవి కూడా పీక్‌ స్టేజీలో ఉన్నాయి. ఎవరి అంచనా ఎలా ఉన్నా, ఎవరి సర్వే సంగతి ఎలా ఉన్నా, ఎవరి మనసులో మాట ఏదైనా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీనే గెలవాలని, జగనే మళ్లీ అధికారంలోకి రావాలని- బీఆర్‌ఎస్ మనసావాచా కోరుకుంటోందట! ముందు నుంచీ ఆ పార్టీ కీలక నేతలు జగనే మళ్లీ ముఖ్యమంత్రి అని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌కి బీజం పడింది. అధికారంలోకి వచ్చి, ఒకరినొకరు విమర్శించుకున్న తర్వాత.. ఇద్దర మధ్య సయోధ్య కుదిరింది. భేషజాలు లేవ్.. బేసిన్లు లేవు.. రాయలసీమను రతనాల సీమ చేద్దాం.. కృష్ణా గోదావరి నీళ్లతో ఇరు రాష్ట్రాలను సస్యశ్యామలం చేద్దాం అని ఇద్దరు మీటింగుల మీద మీటింగులు పెట్టారు. స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించారు. కేసీఆర్ ఏపీకి కూడా వెళ్లొచ్చారు. అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి, పుష్పించి, ఫలించింది. రెండు ప్రభుత్వాలు మనసులో మాటల్ని షేర్ చేసుకున్నాయి. రిటర్న్‌ గిఫ్ట్ స్ట్రాటజీలను పంచుకున్నాయి. అనుకున్నట్టే అమలు చేశాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓటమి తర్వాత ఆ పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జారిపోయారు. ఓడిపోయిన కొందరు మాజీలు కండువా పడేసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ శక్తినంతా పుంజుకుని ప్రచారం చేశారు. మొత్తానికి మరో ఎన్నికల ఘట్టాన్ని అతికష్టమ్మీద ఈదగలిగారు. వచ్చే సీట్లు- పోలయ్యే ఓట్లపై బీఆర్‌ఎస్‌ నేతల్లో ఎవరి క్లారిటీ వాళ్లకుంది. అది కాసేపు పక్కన పెడితే.. కేసీఆర్‌, కేటీఆర్‌ మాత్రం ఏపీలో రాబోయే సర్కారుపైనే ధ్యాసంతా కేంద్రీకరించారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్న ఆత్రుత సారుకు ఎక్కువైందట. జగన్ మళ్లీ రావాలని, కేసీఆర్, కేటీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు. పోలింగ్ కంటే ముందునుంచే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు.. ఎవరికి వోటు వేయాలో వారికి తెలుసు అని కేటీఆర్ అనడం కూడా అప్పట్లో తెలంగాణ పొలిటికల్ గ్రౌండులో దుమారం చెలరేగడానికి కారణమైంది.

బీఆర్ఎస్‌కు- ఇటు కాంగ్రెస్‌కు అటు బీజేపీకి సమదూరం పాటిస్తోంది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్ధి. లోక్ సభ సమరంలో బీజేపీ మెయిన్ అపోనెంట్. అందుకే ఈ రెండు పార్టీలతో బీఆర్‌ఎస్ ఏకకాలంలో ఫైట్ చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ జగన్ వస్తేనే ఎంతోకొంత రాజకీయంగా సపోర్ట్ దొరుకుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. జగన్ వచ్చిన తర్వాత పోలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా డిసైడ్ అయినట్టు పార్టీలో ఓ వర్గం చెబుతోంది. ఆ క్రమంలోనే ఎన్నికల ముందు నుంచీ ఏపీలో రాజకీయ పరిణామాల్ని కేసీఆర్ చాలా దగ్గరగా మానిటర్ చేశారట. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని ఆరా తీశారట. అక్కడ సన్నిహితుల నుంచి సమాచారం సేకరించారట. అవసరమైన నివేదికలు కూడా తయారుచేశారట. పోలింగ్ సరళిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారట. ఇప్పుడు జూన్ నాలుగు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుంది? వైసీపీ గెలిస్తే BRS బంధం భవిష్యత్‌లో ఎలా ఉంటుంది? ఇదంతా తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.