NTV Telugu Site icon

Off The Record: ఆర్జీవీ, పోలీసుల మధ్య దాగుడు మూతలు ఇంక్కేన్నాళ్ళు?.. వర్మ సవాల్‌ విసురుతున్నారా?

Rgv

Rgv

Off The Record: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్‌ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు. ఇక ఆ తర్వాతి నుంచి అసలాట మొదలైంది. ఎప్పటికప్పుడు పోలీసులతో దోబూచులాడుతున్న వర్మ… ఒక రకంగా వారికి సవాల్‌ విసురుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. షూటింగ్స్‌ పేరుతో ఇప్పటికి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టారాయన. వర్మను అరెస్ట్‌ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌ వెళ్ళినా.. వర్కౌట్‌ కాలేదు. పోలీసులు వెదుకుతున్నంత సేపు ఎక్కడా కనిపించని, వినిపించని ఈ వివాదాస్పద దర్శకుడు.. తర్వాత సడన్‌గా ఓ వీడియో రిలీజ్‌ చేసి తాను ఎక్కడికీ పారిపోలేదంటూ బుకాయింపు మొదలుపెట్టారు.

Read Also: CM and Deputy CM Meeting: సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. అసలు వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది..?

అసలు ఈ మార్ఫింగ్ కుట్రని ఛేదించాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉందంటూ అడ్డంగా వాదించడం వర్మకే చెల్లిందన్నది పొలిటికల్‌ పండిట్స్ మాట. ఈ క్రమంలోనే…తనపై నమోదైన కేసును కొట్టేయాలని వర్మ హైకోర్టుకు వెళ్ళడం,న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించటం జరిగిపోయాయి. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఏదన్నా ఉంటే పోలీసుల దగ్గరే తేల్చుకోమని కూడా సూచించింది న్యాయ స్థానం. ఓవైపు షూటింగ్స్‌ పేరుతో విచారణకు హాజరవకపోవడం, మరోవైపు ఇంటర్వ్వూల పేరుతో రోజుకో రకమైన వివాదాస్పద వ్యాఖ్య చేయడం, ఇంకా చెప్పాలంటే పోలీసులనే టార్గెట్‌ చేస్తున్నట్టుగా మాట్లాడ్డం డిపార్ట్‌మెంట్‌కు అస్సలు మింగుడుపడటం లేదట. ఇదేమైనా ఎమర్జెన్సీ కేసా.. అసలు కేసుకు ఏమైనా అర్థం ఉందా.. అంటూ తనదైన స్టైల్లో పంచ్‌లు ఇవ్వడం చూస్తుంటే… కావాలని పోలీసుల్ని రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తోందన్న వాదన సైతం బలపడుతోందట రాజకీయవర్గాల్లో. తాను ఎవరిమీద ట్వీట్స్‌ పెట్టానో వాళ్లకు సంబంధం లేకుండా ఎవరో థర్డ్‌ పార్టీ కేసు పెడితే.. సెక్షన్స్‌ ఎలా వర్తిస్తాయంటూ లా పాయింట్లు లాగడం పోలీసులకు మింగుడు పడటం లేదన్నదన్నది డిపార్ట్‌మెంట్‌ టాక్‌.

Read Also: Scooty Running Without Rider: ఇదేందయ్యా ఇది.. మనిషి లేకుండానే స్కూటీ అలా వెళ్లిపోతోంది

అసలా మార్ఫింగ్‌ ఫోటోల ట్వీట్స్‌ గురించి మాట్లాడితే… ఇప్పటికి కొన్ని వేలు పెట్టానని, ఏది ఎప్పుడు పెట్టానో తెలియదని వెటకారపు సమాధానాలు వింటున్న పోలీసులకు ఎక్కడో కాలిపోతోందట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద కేసులు పెడతామంటే…, జైళ్లు సరిపోతాయా అంటూ వర్మ వాదించడం ప్రకాశం పోలీసులకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని అంటున్నారు. ముందు విచారణకు సహకరిస్తానని చెప్పిన దర్శకుడు…. ఇప్పుడు ఎక్కడో ఉండి తమను కించపరిచేలా మాట్లాడ్డాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు సమాచారం. ఎక్కడో చాటున ఉండి అడ్డదిడ్డమైన వాదనలు చేయడం కాదు… అంతగా తాను తప్పు చేయలేనదన్న నమ్మకం, ధైర్యం ఉంటే… చట్ట ప్రకారం ముందుకు వచ్చి తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చుకదా అన్న చర్చ జరుగుతోందట రాజకీయ వర్గాల్లో. దీంతో పోలీసులను ఫేస్ చేసే ధైర్యం రావడం లేదంటేనే… ఆయనకు తాను తప్పు చేశానన్న సంగతి అర్ధం అవుతున్నట్టేకదా అన్న వాదన బలపడుతోంది. రామ్‌గోపాల్‌వర్మ.. ముందు చాటుమాటున ఉండి శ్రీరంగ నీతులు చెప్పటం మాని విచారణకు హాజరు కావాలని, లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారట పోలీసులు.. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా పోలీసుల విచారణకు హాజరవ్వాల్సిందేనని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని అంటున్నారట ప్రకాశం పోలీస్‌ అధికారులు. ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు నడుస్తాయో… చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.