Off The Record: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్. నియోజకవర్గంలో పట్టున్న నేత. కానీ… నరసన్నపేటకు చెందిన కొందరు నేతలు ఈ మధ్య కృష్ణదాస్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ఆయన భార్య పద్మ ప్రియ, కొడుకు ఇద్దరూ రాజకీయంగా క్రీయాశీలకంగా ఉన్నారు. కృష్ణదాస్ కంటే ముందు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు ధర్మాన ప్రసాదరావు. ఇప్పటికీ ఇక్కడ ఆయనకు వర్గం ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లోనే.. ప్రసాదరావు వర్గాన్ని అణచివేసే ప్రయత్నం చేశారట కృష్ణదాస్ భార్యాపిల్లలు. సీనియార్టీని కూడా చూడకుండా… కొద్దిమంది నేతలతో వ్యవహరించిన తీరు ఇప్పుడు మైనస్ అవుతోందంటున్నారు. వాళ్ళంతా ఈసారి ఎన్నికల్లో దాస్ కు సహకరించలేమంటూ చేతులెత్తేసినట్టు తెలిసింది. పైకి లేదు లేదంటున్నా.. నరసన్నపేటలో ధర్మాన సోదరుల మధ్య ఆధిపత్య పోరు చాపకింద నీరులా పెరుగుతోందని అంటున్నారు.
ధర్మాన కుటుంబ సభ్యుడైన సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు అధిష్టానం దగ్గర నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించారట. ధర్మాన బ్రదర్స్ అంతర్గత పోరు ఈసారి ఎన్నికలలో కొంపముంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే తమకు గౌరవం దక్కడంలేదనే కృష్ణదాస్‌ను నియోజకవర్గంలోని బలమైన వర్గం వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్యపోరును క్యాష్ చేసుకోవాలని చూస్తోంది టీడీపీ. కానీ.. ఆ పార్టీ ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి మెతక వైఖరితో పార్టీలో దూకుడు కనిపించడం లేదట. అదే సమయంలో నల్లేరుపై నడక మాదిరి ఉన్న పోరును కృష్ణదాస్ ఫ్యామిలీ సంక్లిష్టం చేసుకుంటోందన్న మాటలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుడు, ఎంపీపీ కూర్మినాయుడు, జలుమూరు జెడ్పీటీసీ మెండ రాంబాబు వంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. వాళ్ళ బలాన్ని ఉపయోగించుకోకుండా గెలుపు ఎలా సాధ్యమన్న ప్రశ్నలు కేడర్ నుంచే వస్తున్నాయి. ఆ నేతలు సైతం దశాబ్దాలుగా ధర్మాన ప్యామిలీకి అండగా నిలబడ్డామని, ఇప్పుడు తమను కూరలో కరివేపాకులా తీసి పడేశారని ఆవేదనగా ఉన్నట్టు తెలిసింది. కృష్ణదాస్ ఫ్యామిలీ సొంత చర్యలతో లైట్ ఫైట్‌ని టఫ్‌గా మార్చుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. సారవకోట, జలుమూరు మండలాల్లో లీడర్స్ కృష్ణదాస్ పై సదభిప్రాయంతో ఉన్నా.. ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ జోక్యాన్ని సహించలేకపోతున్నారట.
ధర్మాన కుటుంబ సభ్యుడు, సీనియర్ నేత చిన్నాల వర్గం , దాస్ వర్గాల మధ్య ఇటీవల కాలంలో మరింత దూరం పెరిగిందంటున్నారు. సారవకోట మండలంలో జరుగుతున్న కార్యక్రమాలకు కూర్మినాయుడుని దూరంగా ఉంచడంతోనే కోత్త రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయట. తనలో ఏ తప్పు ఉన్నా… సరిదిద్దుకునేందుకు సిద్దంగా ఉన్నానంటూ కృష్ణదాస్ చెబుతున్నా… జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారట పార్టీ నేతలు. దీంతో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా? సోదరుడి కోసం వాతావరణాన్ని సెట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే తేలిగ్గా గెలవగలిగే ఓ సీటును పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు స్థానిక నాయకులు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.