Off The Record: కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అప్రమత్తం అయ్యిందా? అంటే… అయ్యిందన్నదే రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్‌కు హ్యాండ్ ఇచ్చి కూతురుతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన పార్టీలో చేరిన కొద్ది రోజులకే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్‌కు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూడా హస్తం గూటికి చేరిపోయారు. మేటర్ అక్కడితో ఆగిపోలేదని, మరి కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా గోడ దూకడానికి రెడీ ఉన్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. మిగిలిన సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డి నుంచి మరికొందరు శాసనసభ్యులు కూడా గాంధీభవన్‌వైపు ఆశగా చూస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి వస్తారని, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే రోజులు ముందున్నాయంటూ ఇటీవల సాక్షాత్తు మంత్రులే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఆ ఊపు చూసి పార్లమెంట్ ఎన్నికల లోపే చాలా మంది కారు దిగేస్తారని కూడా అనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరక్కపోవడంతో… ఇక ఆలస్యం చేయకుండా ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టాలని భావిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం.
ఈ క్రమంలోనే… రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమని చెప్పేశారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్య అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్నారట ఆయన. మరి ప్రకాష్ గౌడ్ తర్వాత ఎవరన్నది తాజా చర్చ. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. టీడీపీలో రేవంత్ రెడ్డితో కలిసి పని చేశారు. మరి ఆ పాత పరిచయాలతో వీళ్ళలో ఎవరు గోడ దూకుతారని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా ఉంది. కొద్ది రోజుల క్రితం కాలే యాదయ్య సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ముందు కొందరు, ఎన్నికల ఫలితాల తర్వాత మరికొందరు చేరతామంటూ కాంగ్రెస్ అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. దీంతో త్వరలో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ఎన్ని కలర్స్ మారతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
