Site icon NTV Telugu

Off The Record: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పీసీసీ మీద జగ్గారెడ్డి వార్‌?

Jaggareddy

Jaggareddy

Off The Record: చాలా రోజుల నుంచి మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి… నా మనసులో ఆవేదన ఉందంటూ తాజాగా ప్రకటనలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తూటాలు ఎక్కుపెట్టారా అన్న అనుమానాలు మొదలయ్యాయట. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు నాయకులందర్నీ పిలిచి రేవంత్‌ మాత్రం వదిలేశారు జగ్గారెడ్డి.

జగ్గారెడ్డి తన మనసులో ఉన్న విషయాలను వరుసగా ప్రకటనల రూపంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే మొదటి మెసేజ్‌లో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గతంలో గాంధీభవన్‌కి వచ్చి రిలాక్స్ అయ్యే వాడిని. కానీ ఇప్పుడు రాలేకపోతున్నానన్న ఆవేదన ఉందని చెప్పుకున్నారు. గాంధీభవన్‌కి వచ్చి అందరితో మాట్లాడే పరిస్థితులు లేవని.. ఆ లేఖలో పేర్కొన్నారు. దానికి కొనసాగింపు అన్నట్టు తాజాగా రెండో లేఖ కూడా విడుదల చేశారు జగ్గారెడ్డి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు గాంధీభవన్లో ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి ఇలా ప్రకటన విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారో చెప్పడానికి మాత్రం నిరాకరించారాయన. పైకి చెప్పకున్నా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే ఈ పని చేస్తున్నారన్నది గాంధీభవన్‌ టాక్‌ అట. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో ఇద్దరూ పరస్పరం టార్గెట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత సంయమనం పాటించారు. ఎన్నికల వరకు మాట్లాడేది లేదని చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడిలా ప్రకటనలు విడుదల చేయడం వెనక వ్యూహం ఏంటన్న చర్చ జరుగుతోంది.

పీసీసీ కమిటీలకు, వాటిలోని సభ్యులకు పని లేకుండా పోయిందన్నది జగ్గారెడ్డి బాధ అట. సభ్యుల అభిప్రాయాలకు గౌరవం లేదని, రేవంత్ రెడ్డి ఎవరితో చర్చించకుండానే సభలు, సమావేశాల తేదీలను ప్రకటిస్తున్నారన్నవి జగ్గారెడ్డి ప్రధాన అభ్యంతరాలట. ఆ విషయంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కి బాధ్యత లేదా, వారిని పరిగణనలోకి తీసుకోరా అన్నప్రశ్నలు లేవనెత్తుతున్నారట ఆయన. వీటన్నిటినీ కోట్‌ చేస్తూ… పాత పంచాయతీని జగ్గారెడ్డి కొత్తగా మొదలు పెట్టారన్నది పార్టీ ఇంటర్నల్‌ టాక్‌ అట. కొంతమంది నాయకులను కోవర్టులనే ముద్ర వేసి రేవంతే బయటికి పంపుతున్నారని గతంలోనే ఆరోపించారు జగ్గారెడ్డి. అయితే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గతంలోనే కొన్ని బాధ్యతలను అప్పగించింది పీసీసీ. జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని సూచించింది. కానీ .. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదన్నది రేవంత్ వర్గం వాదన అట. ఆ తర్వాత జరిగిన పంచాయతీలో జగ్గారెడ్డిని ఆయనకు కేటాయించిన జిల్లాల బాధ్యతల నుంచి తప్పించారు. ఇక పేరుకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తప్ప బాధ్యతలు పెద్దగా లేవట. ఇటీవల కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించినా సరిగా పట్టించుకోలేదన్నది పీసీసీ ప్రెసిడెంట్‌ వర్గం చెబుతున్న మాట. వ్యక్తిగతంగా రేవంత్‌ని వ్యతిరేకించడం వరుక ఓకేగానీ…పార్టీ సభ్యత్వం నమోదు సమావేశాలకు గాని , ఇతర సమావేశాలకు గాని హాజరవకుంటే చర్చించిన అంశాలు ఎలా తెలుస్తున్నాయన్నది పీసీసీ క్వశ్చన్‌. రేవంత్ నుంచి కొత్తగా ఎదురైన ఇబ్బంది ఏంటో కానీ జగ్గారెడ్డి మళ్ళీ తన మాటలకు పదును పెట్టడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోందట. అసలింతకీ ఆయన మనసులో ఏముంది? ఈ ఎపిసోడ్‌ ఎంత దూరం వెళ్తుందన్నది చూడాలి.

Exit mobile version