Off The Record: ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుతున్నారట…ఉంటారా ..పోతారా అంటూ ఆమధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకుల్ని ఉద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్ ఇచ్చారన్నది అప్పట్లో టాక్. అయితే తాజాగా ప్రతినిధుల సదస్సులో కూడా… వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది. పద్ధతి మార్చుకోండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం. అంటే.. ఆ చిట్టాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారనే ప్రచారం ఇప్పుడు ఇంకా ఊపందుకుంది. బోథ్ ,ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్ నియోజకవర్గాలు ఆ లిస్ట్‌లో ఉన్నాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే నేతల బంధువుల పేర్లతో సహా లిస్ట్‌లు బయటికి వస్తున్నాయి. దీంతో ఈ ప్రచారం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని టెన్షన్ పడుతున్నారట ఎమ్మెల్యేలు. ఆ మధ్య ఆదిలాబాద్ జడ్పి సమావేశంలో జడ్పీటీసీలు సైతం దళితబంధు వసూళ్ళపై ఆరోపణలు చేశారు. ఒకే గ్రామంలో రెండు లక్షల చొప్పున చాలామంది దగ్గర వసూలు చేసినట్లు గుడిహత్నూర్ జడ్పిటీసీ ఆరోపించారు.
ముథోల్, బోథ్, ఖానాపూర్‌లో కమీషన్ల వ్యవహారాలు ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయట. బోథ్‌లో కమీషన్లతో ఖరీదైన వాహనాలు కూడా కొనుక్కున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలతో కొందరు నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఇక ముథోల్‌లో అయితే ఏకంగా ఎమ్మెల్యే అనుచరుల తీరుపై ఆమధ్య రోడ్డెక్కి నిరసన తెలిపారు దళితులు. ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేను సైతం నిలదీశారు. ఇవన్నీ ఒక్కఎత్తైతే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు తీవ్ర చర్చకు వస్తున్నాయట. సీఎం దగ్గరున్న చిట్టాలో తమ పేర్లు ఉన్నాయో, లేదోనని తెలుసుకునే పనిలో ఉన్నారట కొందరు అధికార పార్టీ శాసనసభ్యులు.
అసలే ఎన్నికల టైం… ఇక మీరు కమీషన్లు, దందాలు ఆపండ్రా బాబూ… అని తమ అనుచరులకు గట్టిగానే చెబుతున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఖానాపూర్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో అడ్వాన్స్‌గా కొంత, పథకం వచ్చాక మిగతాది ఇవ్వాలని రూల్ పెట్టారట కింది స్థాయి నాయకులు. అప్పుడు వాళ్ళని పిలిచి క్లాస్ పీకారట ఎమ్మెల్యే. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుండగా కొన్ని సెగ్మెంట్‌లలో చోటా మోటా లీడర్లు వసూళ్లు చేస్తే లీకైపోతుందని ఏకంగా కొంతమంది టీంను పెట్టుకున్నారట. ఇవన్నీ అధిష్టానానికి తెలిసిపోయాయని, ఈసారి సీటు కోత పెట్టదల్చుకున్నప్పడు సీఎం ఆ లిస్ట్‌ను ముందు పెట్టవచ్చని అనుమానిస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు. అందుకే తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. మొత్తం మీద ప్రతినిధుల సభలో కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ వసూల్ రాజాల మీద గట్టిగానే పనిచేసిందన్నది బీఆర్‌ఎస్ ఇంటర్నల్ టాక్.