NTV Telugu Site icon

Off The Record: మంత్రులు, సిబ్బందికి సీఎం చంద్రబాబు వార్నింగ్‌..!

Cm Chandrababu

Cm Chandrababu

Off The Record: ఏపీలో ప్రభుత్వం మారి రెండు నెలలవుతోంది. కొంత మంది మంత్రుల పేషీల్లో సిబ్బంది జాయినయ్యారు. ఇంకొన్ని కార్యాలయాల్లో పూర్తి నియామకాలు జరగలేదు. ఎన్నో అంచనాల మధ్య పవర్‌లోకి వచ్చినందున ప్రస్తుతం అందరి కళ్లు.. కూటమి ప్రభుత్వం పైనే ఉన్నాయి. ఏ చిన్న తప్పు జరిగినా.. చిలువలు పలువలు చేయడానికి కొందరు కాచుక్కూర్చున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేయండంటూ… సీఎం చంద్రబాబు పదే పదే వార్నింగ్‌ ఇస్తున్నారు. అయినాసరే.. కొందరిలో మాత్రం మార్పు కనిపించటడం లేదట. ఆయన అలాగే చెబుతుంటారులే… మన పని మనం చేద్దాం… ఏదో రకంగా దండుకుందామనుకునే బాపతు పెరిగిపోతోందని అంటున్నారు. ఏపీ సెక్రటేరియెట్‌లో తిష్ట వేసిన ఈ చేయి చాపుడు బ్యాచ్‌…ఈ రెండు నెలలు కాస్త సమయమనం పాటించినా…ఇక మెల్లిగా విశ్వరూపం దర్శనం మొదలుపెట్టిందట. పని ఏదైనాసరే… అయితే ఏంటి? మా సంగతేంటని నేరుగానే అడిగేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కొందరైతే ఏకంగా… మంత్రుల పేర్లే చెప్పేసి దండుకుంటున్నట్టు సమాచారం.

Read Also: Plastic Bottles Water: ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగితే రక్తపోటు గ్యారెంటీ.. కొత్త అధ్యయనం..

ఓ మంత్రి పేషీలో పని చేసే అడిషనల్ పీఎస్ స్థాయి వ్యక్తి చేతి వాటం ఇప్పుడు సచివాలయాలయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారి, ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండేది ఆ శాఖ. నాడు ఆ శాఖలోజరిగిన తప్పిదాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ స్పృహ కూడా లేకుండా ఆ శాఖకు చెందిన మంత్రి పేషీలో పని చేస్తున్న అడిషనల్‌ పీఎస్‌ గల్లాపెట్టె తెరిచేశారట. వైజాగ్‌ నుంచి ఎవరో.. సదరు అడిషనల్ పీఎస్‌ను సంప్రదించి.. ఓ పని చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారట. అది కూడా ఊరికే వద్దులే.. అంటూ అవతలి వాళ్ళు దీర్ఘాలు తీసేసరికి టెంప్ట్‌ అయిపోయారట ఆ ఆఫీసర్‌. విషయం కనుక్కుని వెంటనే వైజాగ్‌లోని ఆ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారికి ఫోన్ చేసి..మా మంత్రిగారు చెప్పమన్నారు..మీరు పని కానిచ్చేయండని ఆదేశం రేంజ్‌లోనే చెప్పేశారట. మాట్లాడింది సాక్షాత్తు మంత్రిగారి అడిషనల్‌ పీఎస్‌. ఫోన్‌ వచ్చింది ఆయన పేషీ నుంచే. ఇక మనకెందుకు… కట్టిన తాడుకు, కట్టుకున్న దూడకు లేనిది మధ్యలో గుంజకెందుకు గురక రోగం అన్న సామెతను గుర్తు చేసుకుంటూ… పేషీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పని చేసిపెట్టేశారు. కానీ… అక్కడే తేడా కొట్టింది. ఆ పని చేయించుకున్న వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడు కావడంతో… వైజాగ్‌ నుంచి నేరుగా మంత్రిగారికే ఫోన్‌ వెళ్ళిందట. చిర్రెత్తుకొచ్చిన వైజాగ్‌ టీడీపీ లీడర్స్‌… ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇలా ఉంటే ఎలా అంటూ మంత్రిగారిని దాదాపు కడిగిపారేసినంత పని చేశారట. ఆ దెబ్బకు షాక్‌ తిన్న సదరు మంత్రి… ఇదెక్కడి గొడవ.. నాకేం తెలుసునంటూ ఆరా తీస్తే.. వాస్తవాలన్నీ బయటపడ్డాయి.

Read Also: Inspector vs Women: మహిళను చెంపదెబ్బ కొట్టిన ఇన్స్పెక్టర్.. గన్ చూపిస్తూ మరీ..!

ఇక్కడి వరకు జరిగిన తతంగం ఓ ఎత్తు అయితే…. ఆ తర్వాత జరిగింది మరో ఎత్తు. తన అడిషనల్‌ పీఎస్‌ సంగతి తెలుసుకున్న మినిస్టర్‌…. ఆయనతో ఓ సినిమా సీన్‌ రీ-క్రియేట్ చేశారట. సదరు అధికారిని….. తన సొంత నియోజకవర్గానికి వెళ్దాం రమ్మంటూ కారెక్కించుకుంటున్నారు. కారు ఏసీ హైలో పెట్టినా సరే…చెమటలు పట్టే రేంజ్‌లో తలంటేసి…మళ్లీ అలాంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా క్లాస్‌ పీకారట. అక్కడితే మేటర్‌ అయిపోతే మజా ఏముంది… సగం దారిలో కారు ఆపేసి… నడి రోడ్డు మీదే అడిషనల్‌ పీఎస్‌ను దించేసి… నీ చావు నువ్వు చావు మళ్లీ నీ ముఖం నాకు చూపించవద్దంటూ… సర్రున కారు లాగించుకుని వెళ్ళిపోయారట. దీంతో లబోదిబోమంటూ ఆ ఆఫీసర్‌ వాళ్ళని వీళ్ళని బతిమాలుకుని ఎలాగో విజయవాడ చేరుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దగ్గరికి వెళ్లి.. మరోసారి ఆ తప్పు చేయనంటూ.. కాళ్ల వేళ్లా మీద పడితే.. కనికరించినట్టు తెలిసింది. ఆ ఎపిసోడ్‌ తర్వాత సదరు ఆఫీసర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసుకుంటుండగా మిగతా పేషీల్లోని వాళ్ళు కూడా అలర్ట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు.ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా సెక్రటేరీయేట్ వర్గాల్లో బాగా ప్రచారం జరగడంతో… ఇటు మంత్రి.. అటు అడిషనల్‌ పీఎస్‌.. మధ్యలో కారు అంటూ జోకులేసుకుంటున్నట్టు తెలిసింది. మంత్రుల పేషీల్లో బయటికి రాని ఇలాంటి చిన్నెలు ఇంకెన్ని ఉన్నాయోనన్న చర్చ జరుగుతోంది ఏపీ సచివాలయ వర్గాల్లో.