NTV Telugu Site icon

Off The Record: నంద్యాలలో కూటమి పార్టీల కుమ్ములాట

Nandyal

Nandyal

Off The Record: నంద్యాలలో టీడీపీకి ఎప్పటికప్పుడు ఒకదాని వెనక ఒకటిగా తలనొప్పులు పెరుగుతూనే ఉన్నాయట. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్‌ను ప్రకటించినప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్నారు ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి. ప్రచారంలో కూడా చంద్రబాబును సీఎంను చేయాలని చెబుతున్నా… అభ్యర్థి ఫరూక్ ను గెలిపించాలని మాత్రం అనడం లేదట. తాజాగా కూటమిలో జనసేన కో ఆర్డినేటర్… వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రెటరీ, నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్‌ విశ్వనాధ్ కేడర్‌తో కలిసి ఫ్యాన్‌ కిందికి చేరిపోయారు. ఇక బీజేపీ కూడా నంద్యాలలో టీడీపీ అభ్యర్థితో కలసి పనిచేయడం లేదు. స్థానిక టీడీపీ ఇప్పటికే అంతర్గత గ్రూపు రాజకీయాలతో నలిగిపోతోంది. టిక్కెట్‌ రాలేదన్న కసితో ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థికి సరిగా సహకరించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఒక దశలో పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినా… ఆ తరువాత పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం క్లాస్‌ తర్వాత ఫరూక్ , బ్రహ్మానంద రెడ్డి కామన్‌ మీడియా మీటింగ్‌ పెట్టి భుజం భుజం కలిపేస్తామని ప్రకటించేశారు. అది ఆ రోజుకే పరిమితమైంది తప్ప… ఆ తరువాత ఇద్దరూ కలిసింది లేదు. పనిచేసింది లేదు. పైగా భూమా బ్రహ్మానంద రెడ్డి రెబల్ గా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ అంతర్గత వ్యవహారం అలా ఉంటే… మిగతా రెండు పార్టీల నేతలు కూడా ఎవరి దారిలో వారు ఉన్నారట. టీడీపీ తో కలసి పనిచేయడానికి బీజేపీ, జనసేన విముఖత చూపుతున్నట్టు తెలిసింది. కూటమి కో ఆర్డినేషన్‌ మీటింగ్ లో బీజేపీ నేత అభిరుచి మధు టీడీపీపై ఆరోపణలు చేశారు.

తమను ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవడం లేదంటూ టీడీపీ నేతలని ప్రశ్నించారు. అటు జనసేనదీ అదే తీరు. ఇప్పటి వరకు నంద్యాలలో టీడీపీ జనసేన కలిసి ప్రచారంచేసింది లేదు. ఇక జనసేన కో ఆర్డినేటర్ విశ్వనాథం ఏకంగా వైసీపీ లో చేరారు. టీడీపీ అభ్యర్థి ఫరూక్ తమను పట్టించుకోవడంలేదన్నది ఆయన ఆవేదన అట. కారణం ఏదైనా నంద్యాలలో టీడీపీకి మద్దతుగా బీజేపీ, జనసేన పనిచేయడం లేదన్నది వాస్తవం అంటున్నారు స్థానిక నేతలు. ఇది వ్యూహాత్మకమా, లేక స్థానిక నేతల వ్యక్తిగత కారణాలా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది.