NTV Telugu Site icon

Off The Record: తెలంగాణలో సీబీఐకి మళ్లీ ఎంట్రీ ఉంటుందా..?

Cbi

Cbi

Off The Record: తెలంగాణలో మళ్ళీ సీబీఐ దర్యాప్తు డిమాండ్ ఊపందుకుంటోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే బీజేపీ డిమాండ్ చేయడమే గాక ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాజకీయ తీర్మానం చేయడం చర్చనీయాంశం అయింది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కుంగుబాటు, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, గొర్రెల స్కామ్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలతో పాటు రేవంత్ సర్కార్ లో జరిగిన బియ్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పదే పదే డిమాండ్ చేస్తోంది కాషాయ పార్టీ. కాంగ్రెస్ పాలనలో బియ్యం విక్రయాల్లో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ, విజిలెన్స్ విచారణ అడుగుతున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాష్ట్రంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చి వందల కోట్ల కమీషన్ తీసుకున్నారన్నది బీఆర్‌ఎస్‌ నేతల మరో ఆరోపణ. ఇలా రకరకాల కోణాల్లో సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేసింది కాంగ్రెస్‌.

Read Also: Off The Record: తెలంగాణలో ఎల్పీ విలీనాల పర్వం.. బీఆర్‌ఎస్‌లో భూకంపం..!?

ఇక అధికారంలోకి వచ్చాక నాడు ప్రతిపక్ష హోదాలో చేసిన ఆరోపణలకు సంబంధించి కొన్ని అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది రేవంత్ సర్కార్. ఎన్నో స్కాములు జరిగాయని పలుమార్లు ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చిన సీఎం ఇప్పుడు ఆ అంశాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎవరికి వాళ్ళు సీబీఐని అడుగుతున్నారు, అదే సర్వరోగ నివారిణి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ… ఇక్కడో చిన్న లాజిక్‌ మిస్‌ అవుతున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఇప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్‌ చేస్తున్న ఇదే బీఆర్‌ఎస్‌ గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి ఆ సంస్థ అడుగుపెట్టకుండా నిషేధించింది. దీనికి సంబంధించి 2022 ఆగస్టు 30న జీవో నంబర్ 51 విడుదలైంది. రాష్ట్రంలో సీబీఐ ఆఫీసర్స్‌ స్వేచ్ఛగా దర్యాప్తు నిర్వహించడానికి అంతకు ముందు ఉన్న అనుమతిని నాడు రద్దు చేసింది కేసీఆర్‌ సర్కార్‌. జనరల్ కన్సెంట్‌ ఉపసంహరణతో ప్రస్తుతం తెలంగాణలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

Read Also: Peddamma Thalli Temple: పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనం శాకాంబరి ఉత్సవాలు.. తొలి రోజు ఇలా..

అదే సమయంలో అసలు సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని సూచించారు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ సీబీఐతో సహా అన్ని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని నాడు ఆరోపించారాయన. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక ఇప్పుడా పార్టీనే సీబీఐ దర్యాప్తు అడగడంపై చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆరోపణలకు కట్టుబడి రాష్ట్రంలో ఇప్పుడు సీబీఐ ఎంట్రీకి అనుమతి ఇస్తారా? ఇవ్వరా అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946 ప్రకారం.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో దర్యాప్తు చేయాలంటే ఆయా ప్రభుత్వాల సమ్మతి అవసరం. దీంతో ఇప్పుడు తెలంగాణ సీఎం నిర్ణయం కోసం ఆసక్తిగా చూస్తున్నాయి అధికార, రాజకీయ వర్గాలు.